Rathasapthami రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:13 AM
రాష్ట్ర పండుగగా ప్రకటించిన రథసప్తమి వేడుకలను జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

- జిల్లా ప్రతిష్ఠను పెంచేలా వేడుకలు
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పండుగగా ప్రకటించిన రథసప్తమి వేడుకలను జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర, సంప్రదాయ క్రీడలు, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. లక్షలాది భక్తులను ఆకర్షించే విధంగా శ్రీకాకుళం నగరాన్ని ముస్తాబు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రధాన కూడళ్లలో సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టాలని, ఫౌంటెయిన్లు నిర్మించాలని సూచించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో వేంకటేశ్వరరావు, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, డీఎస్పీ వివేకానంద, మున్సిపల్ కమిషనర్లు ప్రసాదరావు, అరసవల్లి ఆలయ ఈవో వై.భద్రాజీ, డీఎస్‌డీఓ శ్రీధర్, పర్యాటకాధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.