Share News

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే సహించం

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:17 AM

ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. శనివారం టెక్కలిలో టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే సహించం
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

- ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం

- కక్షసాధింపు నా విధానం కాదు

- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

టెక్కలి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. శనివారం టెక్కలిలో టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. టెక్కలిలో వైసీపీ నాయకులు హుద్‌హుద్‌ కాలనీ ఇళ్లను రూ.5లక్షలు చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్పటికే జగతి మెట్ట సమీపంలోని కాలనీలో అక్రమాలు వెలికితీయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించామని తెలిపారు. ఏదో ఒకరోజు తానే స్వయంగా కాలనీ పరిశీలనకు వెళతానని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో తాను ఎన్నో ఇబ్బందులకు గురైనా.. ప్రస్తుతం కక్షసాధింపు తన విధానం కాదని తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

- వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఒక్క బీటీ రోడ్డు, సీసీ రోడ్డు అయినా వేశారా? అని మంత్రి అచ్చెన్న ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.4,600 కోట్లతో ఊరూరా రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలు అందిస్తామన్నారు. వైసీపీ నాయకులు ఇటీవల ‘రైతు ధర్నా’ అని ఎందుకు చేశారో వారికే తెలవదని ఎద్దేవా చేశారు. ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతుల నుంచి 21 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.4,860కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలో పెడుతున్నామని, అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా నడిపిస్తున్నామన్నారు.

తీర ప్రాంతంలో నాలుగులైన్ల రోడ్డుకు డీపీఆర్‌ సిద్దం

‘మూలపేట, భోగాపురం తీర ప్రాంతంలో నాలుగు లేన్ల రహదారికి డీపీఆర్‌ సిద్ధమైంది. పోర్టుకు అనుసంధానంగా పది వేల ఎకరాల్లో అనేక అనుబంధ పరిశ్రమలు, టూరిజం హబ్‌ రానున్నాయి. 2025 జూన్‌ నాటికి పోర్టుకి మొదటి షిప్‌ వచ్చేలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అలాగే కోటబొమ్మాళిలో జూనియర్‌ కళాశాల మంజూరుకు, నందిగాం జూనియర్‌ కళాశాలలో సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటాం. జనవరి మొదటి వారం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందించేందుకు కృషి చేస్తున్నామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. సమావేశంలో నేతలు బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్‌, ఎల్‌ఎల్‌నాయుడు, చాపర గణపతి, లవకుమార్‌, కామేసు, రాము, బుజ్జి, సూర్యనారా యణరెడ్డి, లాడి శ్రీనివాస్‌, గుజ్జూరు సత్యం, ప్రసాద్‌రెడ్డి, పోలాకి షణ్ముఖరావు, మెండ దమయంతి, సుందరమ్మలు ఉన్నారు.

అభివృద్ధి పనులపై దృష్టి సారించండి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయ్యింది. హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. ఇక క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కలిసి అభివఽృధ్ధి పనులపై దృష్టి సారించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వివిధ శాఖల అధికారులకు సూచించారు. శనివారం టెక్కలిలో ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయరాజ్‌, ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ, మండలపరిషత్‌, రెవెన్యూ తదితర శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అవసరమైన చోట తారు రోడ్లు, సీసీ రోడ్లు వేయించాలన్నారు. ‘పల్లెపండగ’లో ఇంకా 80 పనులు పెండింగ్‌లో ఉండడం ఏంటంటూ పీఆర్‌ అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడైతే ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదో వివరాలు తెలియ జేయాలని, ఇప్పటివరకు 30శాతానికి మించి ఎందుకు జరగలేదో చెప్పాలని ఈఈ సూర్యప్రకాష్‌, డీఈఈ సుధాకర్‌ను ప్రశ్నించారు. పనులు నత్తనడకన జరుగుతున్నాయని.. అది సరికాదని స్పష్టంచేశారు. గ్రామాల్లో జరిగే సీసీ రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలని, అద్దాల్లా మెరవాలన్నారు. టూరిజం పనులకు ఈనెల 30న శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. టెక్కలి నియోజకవర్గంలో 137 పంచాయతీల్లో ఏ గ్రామానికి ఏ పని అవసరమో గుర్తించి ప్రతిపాదనలు అందించాలన్నారు. టెక్కలిలో వేసిన ఆర్‌అండ్‌బీ రోడ్డుకు రోడ్డు సేఫ్టీ త్రెడ్‌ లైటింగ్‌ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సీసీ, బీటీ రోడ్లు వేస్తున్న చోట విద్యుత్‌ పోల్స్‌ అడ్డంగా ఉంటే తొలగించాలని ఈఈ శంకరరావుకు సూచించారు. అలాగే ప్రజల నుంచి వినతులు స్వీకరించి కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు.

Updated Date - Dec 22 , 2024 | 12:17 AM