ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి..
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:15 AM
సిక్కోలు.. వలసల జిల్లాగా పేరొందింది. స్థానికంగా ఉపాధి అవకాశాలు చాలా మంది హైదరాబాద్, ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్‌తోపాటు విదేశాలకు సైతం తరలిపోతున్నారు. కాగా.. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వలస కూలీలు.. అక్కడ అనారోగ్యానికి గురి కావడం.. లేదా వివిధ ప్రమాదాల బారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

- వలస కూలీల మృత్యువాత
- అనాథలవుతున్న కుటుంబాలు
- పట్టించుకోని కంపెనీలు
- పరిహారం కూడా అందని వైనం
- స్వగ్రామానికి మృతదేహాలను తెప్పించేందుకు అవస్థలు
(వజ్రపుకొత్తూరు)
- 2006లో వజ్రపుకొత్తూరు మండలం అమలపాడుకు చెందిన నౌపాడ వెంకటేష్, పెద్దముహరిపురానికి చెందిన బత్తిని శ్రీరాములు, చినరామక్రిష్ణాపురానికి చెందిన సంగారు మోహనరావు.. దుబాయిలో రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఈ ముగ్గురూ ఉపాధి కోసం దుబాయి వెళ్లి.. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగిల్చారు. బాధిత కుటుంబాల తరపున అప్పటి ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖతో మాట్లాడి వారి మృతదేహాలను వారం రోజుల్లో స్వదేశానికి తెప్పించారు. కంపెనీ నుంచి కొంత పరిహారం అందించగలిగారు.
........................
- 2022లో చింతవానిపేటకు చెందిన యలమంచి లోకనాఽథం కూడా ఉపాధి కోసం దుబాయి వెళ్లి.. అక్కడ అనారోగ్యంతో చనిపోయాడు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు నెలరోజులు పట్టింది. అలాగే ఉద్దాన గోపినాథం పురానికి చెందిన ఒక వ్యక్తి కొన్నాళ్ల కిందట ఖతర్‌లో చనిపోగా.. ఆయన మృతదేహం 27 రోజులకు స్వగ్రామానికి చేరింది.
...................
- తాజాగా వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామానికి చెందిన శంకర్ అలియాస్ సతీష్ (32) ఈ నెల 5న సౌదీ అరేబియాలో అనారోగ్యంతో మృతి చెందాడు. మూడేళ్ల కిందట ఉపాధి కోసం శంకర్ ఖతర్ దేశం వెళ్లాడు. తల్లి కాంతమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. అప్పు చేసి తల్లికి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. అనారోగ్యంతో ఆమె మృతి చెందింది. అప్పుల భారం పెరగడంతో నాలుగు నెలల కిందట ఉపాధి కోసం సౌదిఅరేబియా వెళ్లాడు. డబ్బులు సంపాదించి అప్పు తీర్చేసి.. ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని భావించాడు. కాగా.. బుధవారం తెల్లవారుజామున సౌదీఅరేబియాలో బ్రెయిన్ స్ర్టోక్‌తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు బోరున విలపించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.
................
సిక్కోలు.. వలసల జిల్లాగా పేరొందింది. స్థానికంగా ఉపాధి అవకాశాలు చాలా మంది హైదరాబాద్, ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్‌తోపాటు విదేశాలకు సైతం తరలిపోతున్నారు. కాగా.. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వలస కూలీలు.. అక్కడ అనారోగ్యానికి గురి కావడం.. లేదా వివిధ ప్రమాదాల బారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్నారు. కొందరికి చివరిచూపు కూడా దక్కని పరిస్థితి. వారి మృతదేహాలను సగ్రామాలకు తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. విదేశాల్లో వలస కూలీలు మృతి చెందితే.. బాధిత కుటుంబాలకు నిర్ణీత పరిహారం కూడా అందకపోవడంతో.. చాలామంది రోడ్డున పడుతున్నారు. కుటుంబాన్ని పోషించేవారు లేక అనాథలవుతున్నారు.
- ఉపాధి మార్గంతోపాటు.. అప్పుల భారం నుంచి బయటపడేందుకు చాలా మంది విదేశాల్లో ఉద్యోగాల కోసం ఏజెంట్లకు సొమ్ములు చెల్లిస్తున్నారు. ఏజెంట్లు చెప్పినదానికి అక్కడి పరిస్థితి విరుద్ధంగా ఉంటాయని పలువురు వలస కూలీలు పేర్కొంటున్నారు. అక్కడ ఇబ్బందులు పడలేక.. తిరిగి స్వగ్రామానికి చేరుకునేందుకు అనుమతులు దొరక్క.. నరకయాతన పడిన సందర్భాలెన్నో అని చెబుతున్నారు. ఈ క్రమంలో అనేకమంది మానసిక వ్యథతో అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతుంటారని పేర్కొంటున్నారు. మృతదేహాల కోసం కూడా కుటుంబ సభ్యులు ఒక్కోసారి నెలరోజుల వరకూ ఎదురుచూడాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో నిబంధనలను అనుసరించి.. మృతదేహాలను స్వగ్రామాలకు పంపుతుండడంతో అవి ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి. పని చేయించుకున్న కంపెనీలు సక్రమంగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మృతుడి కుటుంబానికి అంతంతమాత్రమే పరిహారాన్ని అందజేసి చేతులు దులుపుకొంటాయనే విమర్శలున్నాయి. విదేశాంగ విధానంలో రక్షణ చట్టాలు బలంగా లేకపోవడంతో బాధిత కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినవారికి గ్రూప్ ఇన్స్యూరెన్స్ వంటి సదుపాయాలు కచ్చితంగా అమలు చేస్తే.. మృతుల కుటుంబాలకు కొంతమేర భరోసా దక్కే అవకాశం ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
రక్షణ చట్టాలు రావాలి
ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారి బాధలు వర్ణణాతీతం. వారు అనారోగ్యం పాలైనా.. మృతి చెందినా.. స్వగ్రామంలో బాధిత కుటుంబాలు అల్లాడుతుంటాయి. మృతదేహం కోసం రోజల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. విదేశాంగ చట్టాలు కఠినతరంగా ఉంటేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.
- వై.భాస్కరరావు, వజ్రపుకొత్తూరు
.........................
పరిహరం అందించాలి
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు కంపెనీల నుంచి పరిహారం తక్షణమే అందజేయాలి. కొన్ని కంపెనీలు మృతులకు పరిహారం అందించే విషయంలో స్పందించడం లేదు. అనేక మెళికలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎంపీ రామ్మోహన్నాయుడు సహాయంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలు ఉన్నాయి.
- పుచ్చ ఈశ్వరరావు, పూండి గోవిందపురం