Share News

వైభవంగా డోలోత్సవాలు

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:11 AM

జిల్లాలో ప్రసిద్ధి చెందిన అరసవల్లి సూర్యరాయణ స్వామి, శ్రీకూర్మనాథుని, శ్రీముఖలింగేశ్వరుని, శ్రీచక్రధరపెరుమాళ్ల, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో సోమవారం డోలోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివార్ల ఉత్సవమూర్తులకు తిరువీధి నిర్వహించారు. ప్రత్యేక పూజలు, విశేష అర్చనలు జరిపించారు. వేలాది మంది భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు.

 వైభవంగా డోలోత్సవాలు
హిరమండలం: వేంకటేశ్వర స్వామికి చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తున్న భక్తులు

- పలు ఆలయాల్లో నిర్వహణ

- స్వామివార్లను దర్శించుకున్న వేలాది మంది భక్తులు

జిల్లాలో ప్రసిద్ధి చెందిన అరసవల్లి సూర్యరాయణ స్వామి, శ్రీకూర్మనాథుని, శ్రీముఖలింగేశ్వరుని, శ్రీచక్రధరపెరుమాళ్ల, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో సోమవారం డోలోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివార్ల ఉత్సవమూర్తులకు తిరువీధి నిర్వహించారు. ప్రత్యేక పూజలు, విశేష అర్చనలు జరిపించారు. వేలాది మంది భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు.

సూర్యనారాయణ స్వామి ఆలయంలో..

అరవసల్లి, మార్చి 25: ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత సూర్యనారాయణ స్వామివారి డోలోత్సవం కన్నుల పండుగ్గా జరిగింది. ఉదయం 6.30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు, గ్రామస్థులు ఆధ్వర్యంలో ఉషా, ఛాయా, పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులను తిరువీధి మహోత్సవం నిర్వహించారు. అనంతరం అరసవల్లి రోడ్డులోని చిన్నతోటలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ఉత్సవమూర్తులను ఉంచి విశేష అర్చనలు, బుక్కా భర్గుండతో, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 11.30 గంటల సమయంలో మరలా ఉత్సవమూర్తులను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరిగి ఆలయంలోకి తీసుకువచ్చి, ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఎస్‌.చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ కృష్ణమాచార్యులు, అర్చకులు ఇప్పిలి సాందీపశర్మ, తదితరులు పాల్గొన్నారు.

ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు

గార: ప్రసిద్ధ శ్రీ కూర్మనాథుని డోలోత్సవాల్లో భాగంగా భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తొలుత ఈవో గురునాథరావు, ప్రధాన అర్చకులు సీతారామ నరసింహాచార్యులు, ఇతర అర్చక స్వాముల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ మూర్తులను మేళతాళాలతో తిరువీధి నిర్వహించి గ్రామ సమీపంలోని డోలో మండపానికి తీసుకువెళ్లారు. అక్కడ ఊయల్లో ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ వంశపారంపర్య ఽధర్మకర్తలు విజయనగరం పూసపాటి గజపతుల గోత్రనామాలు బుక్కా, భర్గుండలతో పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు.

శ్రీముఖలింగేశ్వరునికి మంగళస్నానాలు

జలుమూరు: శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు వంశధార నదిలో మంగళ స్నానాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి ఆలయ ధర్మకర్త పర్లాకిమిడి రాజు పేరున ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు నూతన వస్త్రాలు ధరించి పూలమాలలతో అలంకరించారు. ప్రత్యేక పల్లకిలో ఆసీనులను చేసి వంశధార నదికి తీసుకెళ్లి మంగళస్నానాలు చేయించారు. అర్చకులు నారాయణమూర్తి, వెంకటాచలం, శివ, రవి, అప్పారావు, శ్రీకృష్ణ, దేవదాయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

వంశధార తీరం.. భక్తజన సందోహం

హిరమండలం: వంశధార నదీ తీరం.. భక్త జనసంద్రమైంది. హిరమండలం మేజర్‌ పంచాయతీ సుభలయి మెట్టపై వెలసిన వేంకటేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన డోలోత్సవాల్లో భాగంగా చివరి రోజున శ్రీభూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఊరేగించారు. చక్రతీర్థ స్నానాలకు కొత్తూరు, పాతపట్నం, ఎల్‌.ఎన్‌.పేట, హిరమండలం మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో వంశధార నదీ తీరం జన సంద్రంగా మారింది. కొత్తూరు సీఐ ఆర్‌.వేణుగోపాలరావు ఆధ్వర్యంలో హిరమండలం ఎస్‌ఐ జి.నారాయణస్వామి తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Mar 26 , 2024 | 12:11 AM