Share News

ఆడబిడ్డలూ.. అధైర్యపడొద్దు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:39 AM

‘మీరంతా నా ఆడబిడ్డలు. మీ అందరికీ పుట్టిల్లు టీడీపీయే. మిమ్మల్ని మహాశక్తివంతులుగా తీర్చిదిద్దుతా. ఆర్థికంగా అభివృద్ధి చేస్తా’నని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మహిళలకు భరోసా ఇచ్చారు.

ఆడబిడ్డలూ.. అధైర్యపడొద్దు
మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు, సమావేశానికి భారీగా హాజరైన మహిళలు

- మిమ్మల్ని మహాశక్తివంతులుగా తీర్చిదిద్దుతాం

- మే 13న అదిరిపోయే తీర్పునివ్వాలి

- వైసీపీని ఓడించి.. సైకో జగన్‌ను తరిమికొట్టాలి

- మీ ఆర్థికాభివృద్ధికి నాదీ బాధ్యత

- మహిళల సమావేశంలో చంద్రబాబు భరోసా

- టీడీపీ అధినేతకు సమస్యలు విన్నవించిన మహిళలు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ అరసవల్లి, ఏప్రిల్‌ 24: ‘మీరంతా నా ఆడబిడ్డలు. మీ అందరికీ పుట్టిల్లు టీడీపీయే. మిమ్మల్ని మహాశక్తివంతులుగా తీర్చిదిద్దుతా. ఆర్థికంగా అభివృద్ధి చేస్తా’నని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మహిళలకు భరోసా ఇచ్చారు. బుధవారం శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ మైదానంలో జిల్లా మహిళలతో ఆయన సమావేశమయ్యారు. వైసీపీ పాలనలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రస్తావించారు. అసమర్థ ప్రభుత్వం కారణంగా ప్రజల జీవితాలు తలకిందులయ్యాయని ఆరోపించారు. వైసీపీ నేతల తీరును ఎండగడుతూ.. ‘ఏ ఒక్కరూ అధైర్యపడొద్దు. అండగా ఉంటా. మీ ఆర్థికాభివృద్ధికి నాదీ బాధ్యత’ అని మహిళలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. మే 13న అదిరిపోయే తీర్పునివ్వాలని.. వైసీపీ నేతలను ఓడించి.. సైకో జగన్‌ను సాగనంపాలని పిలుపునిచ్చారు.

వారిద్దరూ రాష్ట్రానికి, జిల్లాకు పట్టిన కేన్సర్‌

‘వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడ్డారు. కుటుంబ ఖర్చులకు తగ్గ ఆదాయం పెరగలేదు. పైగా.. రూ.10 ఇచ్చి తెలివిగా రూ.100 నొక్కేస్తున్నాడు సీఎం జగన్‌. రాష్ట్రానికి పట్టిన కేన్సర్‌ జలగ జగన్‌. శ్రీకాకుళం జిల్లాకు పట్టిన కేన్సర్‌ ధర్మాన ప్రసాదరావు. ఆయన ఇంటిపేరులో ధర్మం ఉంది.. కానీ ఆయన పనులన్నీ అధర్మమే. అధర్మానను ఇంటికి పంపించాలి. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడును, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ను ఆశీర్వదించి గెలిపించాలి. ఎర్రన్న స్ఫూర్తిని కొనసాగిస్తూ.. రామ్మోహన్‌నాయుడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా, అసాధారణ వ్యక్తిగా ఎదిగాడు. ఆయన ఢిల్లీలో గళం విప్పితే తిరుగులేదు. నాకు డౌట్‌లేదు. ఎన్నిక లాంఛనమే. మంచి మెజార్టీతో ఆశీర్వదించాలి. గొండు శంకర్‌ ఓ సాధారణ కార్యకర్త. యువకుడు. మీ అందరి అభిప్రాయాలను అడిగాను. ఈ రోజు ఉదయం గుండ లక్ష్మీదేవి, సూర్యనారాయణతో మాట్లాడాను. వారు కూడా చాన్నాళ్లపాటు పార్టీకి సేవలందించారు. ఎన్ని ఇబ్బందులున్నా గెలుపే నిర్ణయంగా తీసుకున్నాను. మీ నోట్లో నాలుకగా తయారైన వ్యక్తి కావాలన్నదే శంకర్‌ను తయారుచేశాను. మీరు ఆదరించి గెలిపించాలి’ అని చంద్రబాబు కోరారు.

- లక్షాధికారులను చేస్తాం

‘మగవారి కంటే ఆడబిడ్డలు తెలివైనవారు. అందుకే ఆనాడు ఇళ్లు, పట్టాలు మీ పేరున ఇచ్చారు. ఈసారి సూపర్‌ పవర్‌గా మిమ్మల్ని తయారుచేయాలనే నాలుగు కార్యక్రమాలతో ఇక్కడకు వచ్చాను. నేను ఆంక్షలు పెట్టను. అమ్మకు వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్లందరికీ రూ.15వేలు చొప్పున ఇస్తాను. మా ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తాం. ప్రతి ఏడాది మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాను. అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. ఏప్రిల్‌ నుంచి పింఛన్‌ రూ.4వేలకు పెంచుతాను. జూలైలో ఇచ్చే పింఛన్లను.. ఏప్రిల్‌తో కలిపి అందజేస్తాను. వికలాంగులకు రూ.6వేలు ఇస్తాను. ఈ ఎన్నికల్లో వైసీపీ ఇచ్చే రూ.2వేలకు ఆశపడొద్దని హెచ్చరిస్తున్నా. పాతపట్నంలో పనులు చేస్తున్న ఉపాధిహామీ కూలీలు నావద్దకు వచ్చి వారి కష్టాలు చెప్పుకొచ్చారు. వాళ్లందరికీ న్యాయం చేస్తామ’ని చంద్రబాబు తెలిపారు.

- జిల్లాకు ఇవీ చేస్తాం

‘జిల్లాలో మినీ జెట్టీలను ఏర్పాటుచేస్తాం. మత్స్యకారులను ఆదుకుంటాం. స్టేడియం కడతాం. పాలకొండ రోడ్డు.. ఔటర్‌ రింగు రోడ్డు పెండింగ్‌ ఉంది. శ్రీకాకుళంలో అండర్‌గ్రౌండ్‌ సమస్య ఉంది. టీడీపీ హయాంలోనే శ్రీకాకుళం అభివృద్ధి అయింది. శ్రీకాకుళాన్ని మోడల్‌ టౌన్‌గా మార్పుచేయాలన్నదే నా ఆలోచన. జిల్లాలో వలసలు నివారించి.. తలసరి ఆదాయం పెంచుతాం. ఎక్కువగా డిఫెన్స్‌లో ఉండే త్యాగాల జిల్లా ఇది. మీ బంగారు భవిష్యత్తు కోసం కలసివచ్చాం. మెగా డీఎస్సీ పెడతాం. ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలిస్తాం. అన్నక్యాంటీన్‌లను పునరుద్ధరిస్తాం. యువత ఇంటివద్దనే పని చేసుకునేలా సౌకర్యం కల్పిస్తామ’ని చంద్రబాబు హామీ ఇచ్చారు. సమావేశంలో ప్రసంగం అనంతరం ఓ తల్లి.. నెలన్నర వయసున్న తన చిన్నారిని చంద్రబాబు వద్దకు తీసుకువచ్చి పేరు పెట్టమంది. దీంతో ఆ చిన్నారికి పునర్విక అని పేరు పెడుతూ.. చంద్రబాబు పిలిచారు.

- పింఛన్‌ చాలడం లేదు : అలబాన జయలక్ష్మి, హయతీనగర్‌

నేను వితంతువుని. నాకు ఇచ్చే పింఛన్‌ రూ.3వేలు ఖర్చులకు చాలడం లేదు. అందులోనే చెత్తపన్నుకి, కరెంట్‌ బిల్లుకు పోతుంది. గతంలో 35 కిలోలు బియ్యం మీరు ఇచ్చేవారు. మీవల్లనే మేం బాగుపడ్డా. చిన్నప్పుడు మా పిల్లలకు సైకిల్‌ తొక్కించాం. ఇప్పుడు మీరు వస్తేనే బాగుంటుంది. మీకోసం అందరూ సైకిల్‌ తొక్కేలా చేస్తాం.

చంద్రబాబు : మోదీ ఆహారభద్రత కింద మనిషికి ఐదు కిలోల బియ్యం ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇవ్వడంలేదు. పండగలకు కానుకలు ఇచ్చేవాళ్లం. అవేవీలేవు. అధికారంలోకి వచ్చాక పేదవారికి ఖర్చులు తగ్గిస్తా. మెరుగైన స్టాండర్డ్స్‌ ఇచ్చే బాధ్యత నాది.

.........................

- డీఎస్సీ లేదు.. : కుమారి, బీఈడీ

నేను బీఈడీ చేశాను. నాలుగేళ్లలో ఒక్క డీఎస్సీ రాక గృహిణిగా ఉండిపోయాను. మళ్లీ డీఎస్సీ ప్రకటిస్తే జాబ్‌ కోసం పనిచేస్తాను. నాకు ఉద్యోగం చేయాలని ఉంది.

చంద్రబాబు : తప్పకుండా తొలిసంతకం మెగా డీఎస్సీపైనే. నీ లక్ష్యం నెరవేరాలి. ఇప్పటినుంచే ప్రిపేర్‌ కావాలి.

.........................

- ఉపాధి లేకుండా పోయింది: దేవకన్య, డ్వాక్రాసంఘ సభ్యురాలు

మీరు పెట్టిన భిక్ష మాది సార్‌. ఆనాడు చిన్నపునాది వేశారు. మహిళా సాధికారిత కోసం మమ్మల్ని మార్గదర్శిగా చేశారు. 2000లో సంఘం పెట్టుకుని.. సీఆర్పీలుగా మారి ఇతర రాష్ట్రాల్లో శిక్షణ ఇచ్చేవాళ్లం. ఈ ప్రభుత్వంలో మహిళలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ట్రైనింగ్‌ను రద్దుచేశారు. దీంతో ఉపాధి లేకుండా పోయంది. మీరు వచ్చాక మహిళా సాధికారిత వస్తుంది. మేం భయం లేకుండా తిరగాలి. బంపర్‌ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్‌.

చంద్రబాబు : ఇక్కడున్న రాజకీయ నాయకులకంటే ఆమె చాలా బాగా మాట్లాడారు. అది నేను నేర్పించిన నమ్మకం. ఆనాడు డ్వాక్రా సంఘాల్లో మోటివేటర్లుగా ఇతర రాష్ట్రాల్లో శిక్షణ ఇచ్చేవారంటే అదీ మన ఘనత. ఇక్కడ తయారుచేసిన వస్తువులను విదేశాల్లో మార్కెట్‌ చేశారు. డ్వాక్రా బజార్‌లు నిర్వీర్యం అయిపోయాయి ఇప్పుడు. ఈరోజు హామీ ఇస్తున్నా. నేను ఇచ్చే 1500 ఆర్థిక సహాయం కాకుండా రూ. 10లక్షలు వడ్డీలేని రుణం అందజేస్తాను.

.........................

- ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తో తీవ్ర నష్టం: విజయలక్ష్మి, మహిళాన్యాయవాది

మహిళలకు ఉన్న ఆస్తులకు గురించి చెప్పారు కానీ.. ప్రస్తుతం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల మహిళలకు తీవ్ర నష్టం జరుగుతుంది. మేం అత్తవారి ఇంట్లో ఉంటాం. మా హక్కులను కాలరాస్తున్నారు. మీరు ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నా.

చంద్రబాబు : ఏపీ టైట్లింగ్‌ యాక్ట్‌ను వైసీపీ తీసుకువచ్చింది. జగన్‌కు విచిత్రమైన ధోరణిలు ఉన్నాయి. ఎవరూ చేయని విధంగా వంశపారంపర్యంగా లభించిన ఆస్తికి సీఎం ఫొటోలు వేసుకుంటున్నాడు. పాస్‌బుక్‌లు, టెన్‌ వన్‌, ఆడంగల్‌ అనేవి గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ సీఎం అవన్నీ తీసేసి మీ ఆస్తులకు రికార్డులు లేకుండా చేసి ఆన్‌లైన్‌లో పెట్టుకుంటాడంట. మీ భూమిని వేరేవారి పేరుతో ట్రాన్స్‌ఫర్‌ చేస్తాడు. ఇదే జరిగితే ఆస్తులకు శఠగోపం పెట్టినట్లు అవుతంది. ఇప్పటికే వాళ్ల మనుషులతో ఆస్తులను కొట్టేస్తున్నారు. ఎన్నికలు అయ్యాక ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తాం.

Updated Date - Apr 25 , 2024 | 12:39 AM