Share News

పట్టుబడుతోంది..

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:05 AM

గత నెల 18 నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఎవరైనా రూ.50వేలకు దాటి నగదు తీసుకెళ్తే సరైన ఆధారాలు చూపాలని ఈసీ స్పష్టం చేసింది.

పట్టుబడుతోంది..
నరసన్నపేటలో పట్టుబడిన నగదును లెక్కిస్తున్న ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులు(ఫైల్‌)

- ఎన్నికల వేళ భారీగా చిక్కుతున్న నగదు

- 29 రోజుల్లో రూ.33.66లక్షలు సీజ్‌

- అవగాహన లేకుండా తరలిస్తున్న ప్రజలు

- ఆధారాలు చూపించలేక ఇబ్బందులు

(మెళియాపుట్టి)

- ఈ నెల 9 ఉగాది నాడు మంచి రోజు అని శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె వివాహం కోసం బంగారం కొనుగోలు చేసేందుకు కారులో నరసన్నపేటకు బయలుదేరింది. మడపాం టోల్‌గేట్‌ వద్ద వారి కారును పోలీసులు తనిఖీలు చేశారు. బ్యాగులో రూ.4 లక్షలు పట్టుబడింది. దీనికి సంబంధించి సరైన పత్రాలను ఆ కుటుంబం చూపించలేకపోయింది. పెళ్లికార్డు సైతం ఇంకా తయారు చేయకపోవడంతో ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయింది. దీంతో పోలీసులు ఆ నగదును సీజ్‌ చేశారు. దీంతో ఆ కుటుంబం ఆందోళన చెందుతుంది.

గత నెల 18 నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఎవరైనా రూ.50వేలకు దాటి నగదు తీసుకెళ్తే సరైన ఆధారాలు చూపాలని ఈసీ స్పష్టం చేసింది. డబ్బు, మద్యం, ఇతర సామగ్రిని అక్రమంగా రవాణా చేయకుండా ఎక్కడికక్కడే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ఈ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు నిత్యం వాహన తనిఖీలు చేపడుతున్నారు. అయితే, చాలామంది అవగాహన లేక, ఎలాంటి ప్రతాలు లేకుండా డబ్బును తీసుకెళ్తూ పట్టుబడుతున్నారు. 29 రోజుల్లో రూ.31,66,000 నగదును పోలీసులు, ఎన్నికల అధికారులు సీజ్‌ చేశారు. ప్రస్తుతం శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల 18, 19, 20, 21, 26, 27 తేదీల్లో విహహలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో సుమారు 5వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. గృహ ప్రవేశాలు కూడా ఎక్కువగా జరగనున్నాయి. దీంతో అవసరమైన బంగారం, నగలు, గృహోపకరణాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసేందుకు చాలామంది డబ్బులతో శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస, పాతపట్నం, ఒడిశాలోని పర్లాఖిమిండి తదితర ప్రాంతాలకు వెళ్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. డబ్బులకు సంబంధించి ఆధారాలను చూపించలేకపోతున్నారు. దీంతో నగదు సీజ్‌కు గురవుతుంది. ఈ ఇబ్బందులు పడలేక కొంతమంది ఎన్నికలు ముగిసిన తరువాత డబ్బులు ఇస్తామని వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుని అవసరమైన బంగారం, ఇతర వస్తువులను తీసుకెళ్తున్నారు.

ఇలా పట్టుబడ్డారు..

ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అన్ని మండల సరిహద్దులతో పాటు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో చెక్‌ పోస్టులను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీలు చేస్తుండడంతో భారీగా నగదు పట్టుబడుతోంది.

- గత నెల 23న సీది జంక్షన్‌ వద్ద పర్లాఖిమిండి వ్యాపారి నుంచి రూ.1.36 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

- 26న బత్తిలి- అలికాం వద్ద ఓ వ్యక్తి వద్ద రూ.2 లక్షలు పట్టుబడ్డాయి. అదే రోజు ఆమదాలవలస-తిమ్మాపురం జంక్షన్‌ వద్ద ఒకరి నుంచి రూ.82,820, మరొకరి నుంచి రూ.54 వేలు స్వాధీనం చేసుకున్నారు.

- 29న గార మండలం తూలుగు జంక్షన్‌ వద్ద ఓ వ్యక్తి వద్ద రూ.4.4లక్షలు పట్టుబడ్డాయి.

- ఈ నెల 1న పలాసలోని గురుడుఖండి వద్ద రూ.1,49,500, పల్లివూరు వద్ద రూ.1,02,350, పోలాకిలో రూ.66 వేలు స్వాధీనం చేసుకున్నారు.

- ఈ నెల 2న జలుమూరు మండలం టెక్కలిపాడు వద్ద రూ.3,01,400, పలాస మండలం రెంటి కోట వద్ద రూ.2.50 లక్షలు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.

- 3న వజ్రపుకోత్తూరు మండలం నగరంపల్లి వద్ద రూ.2 లక్షలు సీజ్‌ చేశారు.

- 7న ఎటు వంటి పత్రాలు లేకుండా శ్రీకాకుళం నుంచి నరసన్నపేట కారులో తరలిస్తున్న 12.310 కేజీల వెండి పట్టీలను సత్యవరం జంక్షన్‌ వద్ద ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికా రులు పట్టుకున్నారు.

- 9న పైడిభీమవరం వద్ద రూ.75 వేలు, నరసన్నపేట వద్ద రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

- ఈ నెల 10న నరసన్నపేట నియోజకవర్గంలో రూ.7.30 లక్షలను అధికారులు సీజ్‌ చేశారు.

ఆధారాలు చూపిస్తేనే..

ఎన్నికల కోడ్‌ ప్రకారం రూ.50 వేలకు మించి నగదు చెల్లింపులకు పాన్‌కార్డు ఉండాలి. నగదు పట్టుబడితే సరైన పత్రాలు చూపించాలి. లేదంటే నగదును పోలీసులు ఆర్వోలకు అప్పగిస్తారు. రూ.10 లక్షలకు మించి పట్టుబడితే ఆదాయపన్నుల శాఖ అధికారులకు అప్పగిస్తారు. ఆ నగదు తిరిగి తీసుకోవాలంటే ఆధారాలతో కార్యాలయాలకు వెళ్లాలి. దీనికి సంబంధించిన జిల్లా కమిటీ ఆ ఆధారాలను పరిశీలిస్తుంది. అన్ని సక్రమంగా ఉంటే నగదును బాధితులకు అప్పగిస్తారు.

లెక్కచెప్పాల్సిందే..

సరిహద్దులో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. ఒడిశా నుంచి వస్తున్నా ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాం. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం రూ.50 వేలు కంటే అదనంగా నగదు తరలిస్తే లెక్కచెప్పాల్సిందే. లేదంటే సీజ్‌ చేసి ఎన్నికల అధికారులకు అప్పగిస్తాం. వైద్యం కోసం నగదు తీసుకెళ్తే మెడికల్‌ బిల్లులు చూపించాలి. సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

-టి.రాజేష్‌, ఎస్‌ఐ మెళియాపుట్టి

Updated Date - Apr 14 , 2024 | 12:05 AM