Share News

పాతాళానికి గంగమ్మ

ABN , Publish Date - May 15 , 2024 | 11:55 PM

జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతేడాది తక్కువగా వర్షాలు కురవడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది.

 పాతాళానికి గంగమ్మ
కంచిలి మండలంలో ఎండిపోయిన ముకుంద సాగరం చెరువు

- జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు

- 10 మండలాల్లో ప్రమాద ఘంటికలు

- 7.98 మీటర్ల లోతులో భూగర్భ జలాలు

- వర్షాభావం, విచ్చలవిడిగా నీటి వినియోగమే కారణం

- పొదుపుగా వాడుకోవాలని సూచన

మెళియాపుట్టి, మే 15:

- మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన గండేటి చిన్నారావు గత పదేళ్ల నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఇంటిలో ఉన్న బావి అడుగంటింది. దీంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాడు. గత్యంతరం లేక రూ.2వేలు చెల్లించి బయట నుంచి ట్యాంకర్‌తో నీటిని తీసుకుచ్చి బావిని నింపి వినియోగిస్తున్నాడు. చిన్నారావు చిరువ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నీటికి అదనపు ఖర్చు కావడంతో లబోదిబోమంటున్నాడు.

జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతేడాది తక్కువగా వర్షాలు కురవడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. నీటి వినియోగంపై నియంత్రణ లేకపోవడం, వాడిన నీటిని తిరిగి భూగర్భంలో ఇంకేటట్లు చేయకపోవడం, తదితర కారణాలతో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీటి సంరక్షణకు ప్రజలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దీనికి ప్రధాన కారణంగా జల నిపుణులు పేర్కొన్నారు. ఎండలకు తోడు తీవ్ర వర్షాభావంతో నదులు, చెరువులు ఎండిపోయాయి. బోర్లు అడుగంటిపోవడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. నదుల్లో ఇసుకను పరిమితికి మించి తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో నీటి చెమ్మ తగలడం లేదు. తాగునీటి సమస్యపై అదికారులు సైతం చేతులు ఎత్తేశారు.

పది మండలాల్లో తగ్గుముఖం..

జిల్లాలో ఎచ్చెర్ల, సోంపేట, పలాస, కోటబొమ్మాళి, సారవకోట, రణస్థలం, లావేరు, మెళియాపుట్టి, పొందూరు, జి.సిగడాం మండలాల్లో అధికంగా భూగర్భ జలాలు తగ్గు ముఖం పట్టినట్లు సంబంధిత అధికారులు హెచ్చరించారు. రోజువారి అవసరాలకు సామాన్యులు, వాణిజ్య అవసరాలకు వ్యాపారులు భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారు. దీనికోసం వందల మీటర్ల లోతుకు బోర్లు వేసి నీటిని తోడుతున్నారు. వాస్తవానికి 70 శాతం నీటిని వినియోగిస్తే నీటిమట్టం సురక్షితంగా ఉంటుంది. 70 నుంచి 90 శాతం నీటిని వినియోగించుకుంటే సెమీ ట్రిటికల్‌, 90 నుంచి 100 శాతం వినియోగిస్తే క్రిటికల్‌, 100 శాతం కంటే ఎక్కువగా వినియోగిస్తే అత్యంత తీవ్ర స్థాయిగా గుర్తిస్తారు. జిల్లాలో సరాసరి నీటి వినియోగం కేవలం 33 శాతం అయినప్పటికీ రణస్థలం, లావేరు, మెళియాపుట్టి, పొందూరు, జి.సిగడాం మండలాల్లో మాత్రం పరిమితికి మించి 100 శాతం కంటే అధికంగా నీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం బోరు తీయాలంటే ముందుగా పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోవాలి. అయితే కొంతమంది అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పి ఎక్కడికక్కడే బోర్లు తీస్తుండడంతో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని గ్రామాలను గుర్తించి డ్రిల్లింగ్‌ జరపకుండా చూడాలని భూగర్బ జలశాఖ అధికారులు పంచాయతీ అధికారులకు తెలియజేశారు. అయినా కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడి మేరకు బోర్ల తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. జిల్లాలో గతేడాది మే నాటికి 6.22 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది మే నాటికి 7.98 మీటర్లుగా ఉంది. ఫలితంగా గతంలో ఎప్పుడు లేనివిధంగా నీటి సమస్యలు తలెత్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు..

జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ నదుల నుంచి పరిమితికి మించి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అలాగే, చెరువులు, గెడ్డలను కబ్జా చేయడం లేదా పూడ్చివేయడంతో వర్షపు నీరు ఇంకే పరిస్థితి ఉండడం లేదు. దీంతో భూ గర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అయితే ఇటీవల అడపదడప వర్షాలు పడుతుండడంతో కొంత వరకు భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణ ప్రాంత ప్రజలు నీరు లేక ఆందోళన చెందుతున్నారు. అలాగే, మైదాన ప్రాంతాల్లో ఉన్న గ్రామాలతో పాటు కొండలపై ఉన్న గిరిజన గ్రామాల్లో కూడా తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రతిఒక్కరూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఇల్లు, అపార్‌మెంట్‌ ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, నీటి రీసైక్లింగ్‌ విధానం అమలు చేయాలని, డబ్బు మాదిరిగానే నీటిని వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

Updated Date - May 15 , 2024 | 11:56 PM