Share News

ఎన్టీఆర్‌ పోటీచేసిన గడ్డ

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:12 AM

టెక్కలి నియోజకవర్గానికి జిల్లాలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్‌ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందిన చరిత్ర ఉంది.

   ఎన్టీఆర్‌ పోటీచేసిన గడ్డ
టెక్కలి నియోజకవర్గ మ్యాప్‌

- బహుభాషా కోవిదుడు రోణంకి, అప్పయ్యదొర, ఎర్రన్నాయుడు వంటి నేతలను అందించిన నేల

- నీలిరంగు గ్రానైట్‌కు ప్రత్యేకం

- సువిశాల తీరం భావనపాడు ఇక్కడే

- మొత్తం ఓటర్లు 2,34,433మంది

- గెలుపోటములను శాసించేది కాళింగ సామాజిక ఓటర్లే

- ఇదీ టెక్కలి నియోజకవర్గ ముఖచిత్రం

(టెక్కలి)

టెక్కలి నియోజకవర్గానికి జిల్లాలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్‌ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందిన చరిత్ర ఉంది. బహుభాషా కోవిదుడు ఆచార్య రోణంకి అప్పలస్వామి పురిటి గడ్డ. అప్పయ్యదొర, ఎర్రన్నాయుడు వంటి ఎందరో మహా నేతలను అందించిన నేల. సువిశాల సాగరతీరం, జాతీయ రహదారి ఈ ప్రాంత సొంతం. నీలిరంగు గ్రానైట్‌, విదేశీ విహంగాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం 2,34,433మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపోటములను శాసించేది మాత్రం కాళింగ సామాజిక వర్గమే.

టెక్కలి నియోజకవర్గం 61,196మంది ఓటర్లతో 1952లో ఏర్పడింది. పలాస, బ్రాహ్మణతర్లా, వజ్రపుకొత్తూరు, నందిగాం, టెక్కలి ప్రాంతాలతో ఈ నియోజకవర్గం ఉండేది. 2009లో పునర్విభజన తరువాత 1,78,362మంది ఓటర్లతో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలతో కొత్తగా అవతరించింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 2,34,433మంది ఓటర్లు ఉన్నారు. టెక్కలి పాత, కొత్త నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎనిమిది సార్లు, కాంగ్రెస్‌ పార్టీ ఐదుసార్లు, స్వతంత్రులు మూడుసార్లు, జనతా పార్టీ ఒకసారి గెలుపొందాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ అత్యధిక మెజార్టీ 1994లో ఎన్టీ రామారావు 40,890 ఓట్లు సాధించారు.

ఎన్నో ప్రత్యేకతలు

టెక్కలి అనగానే ప్రపంచస్థాయిలో నీలిరంగు గ్రానైట్‌ ఉత్పాదక కేంద్రంగా గుర్తింపు పొందింది. దేశ, విదేశాలకు నీలిరంగు గ్రానైట్‌ ఎగుమతులు ఈ ప్రాంతం నుంచే. బహుభాషా కోవిదుడు ఆచార్య రోణంకి అప్పలస్వామి పుట్టిన పురిటిగెడ్డ టెక్కలి. నవరసాల తల్లి నౌపడా ఉప్పుగల్లీ దేశంలోనే ఉప్పు ఉత్పాదనలో మూడో స్థానం పొందిన ప్రాంతం ఇక్కడిదే. భారతదేశంలోనే అతిపెద్ద సహజ శివలింగం గల రావివలస ఎండలమల్లిఖార్జునస్వామి ఆలయం, పెలికాన్‌, పెయింటెడ్‌ స్టార్‌ విదేశీ విహంగాల విడిది కేంద్రం తేలినీలాపురం, భావనపాడు సాగరతీరం, పెద్దబాణాపురం నుంచి వాండ్రాడ వరకు 50 కిలోమీటర్ల జాతీయరహదారి, తిలారు, హరిశ్చంద్రాపురం, కోటబొమ్మాళి, నౌపడా రైల్వేస్టేషన్ల మనిహారం, 200 పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రి, 1952లో బ్రిటీష్‌ కాలం నాడే సబ్‌కలెక్టర్‌ కార్యాలయం, 1974లోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వంటి వాటితో పాటు 826.51 ఎకరాల్లో రూ.4,361కోట్లతో పోర్టు నిర్మాణం ఈ నియోజకవర్గ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు.

తొలి విజేత స్వతంత్ర అభ్యర్థి

టెక్కలి నియోజకవర్గం 1952లో ఏర్పాటైన తరువాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రొక్కం లక్ష్మీనరసింహదొర 607 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 1955లో రొక్కం లక్ష్మీనరసింహదొర కాంగ్రెస్‌ పార్టీ తరఫున 533 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1962లో రోణంకి సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా 9,190 ఓట్లు, 1967లో నిచ్చర్ల రాములు స్వతంత్ర అభ్యర్థిగా 8,947 ఓట్లు, 1972లో సత్తారు లోకనాథంనాయుడు ఇందిరా కాంగ్రెస్‌ తరఫున 14,504 ఓట్లు, 1978లో జనతా పార్టీ నుంచి బమ్మిడి నారాయణస్వామి 13,704 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి అట్టాడ జనార్థనరావు 19,716ఓట్ల మెజార్టీతో, 1985లో టీడీపీ నుంచి వరదా సరోజ 21,571 ఓట్లు, 1989లో టీడీపీ అభ్యర్థి దువ్వాడ నాగావళి 7,434 ఓట్లు, 1994లో ఎన్టీ రామారావు 40,890 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్టీఆర్‌ రాజీనామాతో 1995 ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన హనుమంతు అప్పయ్యదొర 22,197 ఓట్లు, 1999లో టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ కొర్ల రేవతీపతి 3,392ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ తరఫున హనుమంతు అప్పయ్యదొర 17,271 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. నియోజకవర్గ పునర్విభజన నేపథ్యంలో 2009లో డాక్టర్‌ కొర్ల రేవతీపతి కాంగ్రెస్‌ పార్టీ నుంచి 1,893 ఓట్లు, 2009 ఉప ఎన్నికల్లో కొర్ల భారతి కాంగ్రెస్‌ నుంచి 7,171 ఓట్లు, 2014లో టీడీపీ నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు 8,387 ఓట్లు, 2019లో టీడీపీ నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు 8,857 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.

- 2009 నాటికి రద్దయిన హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి 1967లో స్వతంత్ర అభ్యర్థిగా కింజరాపు కృష్ణమూర్తి 5,672 ఓట్ల మెజార్టీతో, 1972లో కాంగ్రెస్‌ నుంచి కేఏ భుక్త 19,737 ఓట్ల మెజార్టీతో, 1978లో కేఏ భుక్త 2,311 ఓట్లు, 1983లో టీడీపీ నుంచి కింజరాపు ఎర్రన్నాయుడు 14,190 ఓట్లు, 1985లో టీడీపీ నుంచి కింజరాపు ఎర్రన్నాయుడు 18,139 ఓట్లు, 1989లో కింజరాపు ఎర్రన్నాయుడు స్వతంత్య్ర అభ్యర్థిగా 18,824 ఓట్లు, 1994లో కింజరాపు ఎర్రన్నాయుడు టీడీపీ నుంచి 27,220 ఓట్లు మెజార్టీతో, 1996 ఉప ఎన్నికల్లో కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి 32,271 ఓట్లు, 1999లో టీడీపీ తరఫున కింజరాపు అచ్చెన్నాయుడు 38,717 ఓట్లు, 2004లో టీడీపీ నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు 37,361 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.

ఓటర్ల వివరాలు

2024 ఓటర్ల జాబితా ప్రకారం టెక్కలి నియోజకవర్గంలో 2,34,433మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,16,981మంది, మహిళలు 1,17,442 మంది, ఇతరులు పదిమంది ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల లోపు 4,816మంది, 20 నుంచి 29 ఏళ్లలోపు 39,399మంది, 30 నుంచి 39 సంవత్సరాల లోపు 59,724మంది, 40 నుంచి 49 ఏళ్ల లోపు 50,689మంది, 50 నుంచి 59 సంవత్సరాల లోపు 39,632 మంది, 60 నుంచి 69 ఏళ్లలోపు 24,838మంది, 70 నుంచి 79 ఏళ్లలోపు 11,875మంది, 80 సంవత్సరాలు పైబడిన వారు 3,460మంది ఓటర్లు ఉన్నారు.

ఎగరని వైసీపీ జెండా

టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌, ఇందిరాకాంగ్రెస్‌, జనతా, స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినప్పటికీ వైసీపీ జెండా మాత్రం ఇంతవరకు ఎగరలేదు. 2014లో దువ్వాడ శ్రీను, 2019లో పేరాడ తిలక్‌ వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పొందారు. ప్రస్తుత ఎన్నికల్లో దువ్వాడ శ్రీను, అచ్చెన్నాయుడు మధ్య పోటీ నెలకొంది. కాగా, ఈ నియోజకవర్గం పునర్విభజనకు ముందు వారసత్వ రాజకీయాలు కనిపించలేదు. నియోజకవర్గ పునర్విభజన తరువాత హరిశ్చంద్రాపురం, టెక్కలి ఒకటిగా ఏర్పడిన తరువాత దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడు కింజరాపు అచ్చెన్నాయుడు వారసత్వ రాజకీయాల్లోకి రాగలిగారు. ఇదే నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ కిల్లి కృపారాణి 2009 ఎంపీగా ఎన్నికై 2012 నుంచి 2014 వరకు కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రస్తుతం పార్లమెంట్‌ సభ్యులుగా ఉండగా టెక్కలి నియోజకవర్గానికి చెందిన హనుమంతు అప్పయ్యదొర, డాక్టర్‌ కణితి విశ్వనాథం సైతం పార్లమెంట్‌ సభ్యులుగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికం. తరువాత స్థానంలో మత్స్యకారులు, రెడ్డీలు, యాదవులు, శెగిడీలు, ఎస్సీలు, ఎస్టీలు, కాపు, వెలమ, వైశ్య తదితర కులాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. ఇక్కడ గెలుపు, ఓటములు శాసించేది మాత్రం కాళింగ ఓటర్లే.

Updated Date - Apr 18 , 2024 | 12:12 AM