upadhi: మరింత ‘ఉపాధి’
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:46 PM
'upadhi' hiked ఉపాధిహామీ పథకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బోగస్ మస్తర్లకు చెక్ పెట్టి.. కూలీలకు వేతనం పెంచి.. మరింత ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం వేతనదారులకు రోజుకు రూ.263 కూలి ఉండగా.. దానిని రూ.300కు పెంచేందుకు వేతన పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసింది.

కనీస వేతనం రూ.300కు పెంపు
మస్తర్లు మాయజాలానికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక కమిటీ
నరసన్నపేట, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బోగస్ మస్తర్లకు చెక్ పెట్టి.. కూలీలకు వేతనం పెంచి.. మరింత ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం వేతనదారులకు రోజుకు రూ.263 కూలి ఉండగా.. దానిని రూ.300కు పెంచేందుకు వేతన పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. పనివేళల్లో కూడా మార్పులు చేసి.. గిట్టుబాటు వేతనం అందజేయనుంది. ఆ విభాగానికి డ్వామాలో కీలకంగా ఉండే జిల్లా విజిలెన్స్ అధికారిని నియమించింది.
జిల్లాలో 4.32 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. ఈ ఏడాది 7.35 లక్షల పనులను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 3.8 లక్షల మంది వేతనదారులు పనులకు వెళ్తున్నారు. జిల్లాలో గుర్తించిన వాటిలో 6.02లక్షల పనులు సాగుతున్నాయి. వేతనదారులు ప్రస్తుతం 4 గంటలు పనిచేస్తున్నారు. అదనంగా మరో గంట పెంచేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. ఉపాధిహామీ సిబ్బందితో పాటు ఏపీడీలు, ఏపీవోలు, ఎంపీడీవోలు నిత్యం మస్తర్లను తనిఖీ చేయాలి. కూలీలకు రోజుకు 300 వేతనం అందించేందుకుగానూ.. సంబంధిత పనులు, సమయం కేటాయింపు అంశాలను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన వేతన పర్యవేక్షణ విభాగం పరిశీలించనుంది. అలాగే ఉపాధిహామీ పనుల్లో బోగస్ మస్తర్ల బాగోతం నడుస్తుందనే విమర్శలు ఉన్నాయి. కూలీలు పనులకు రాకపోయినా.. హాజరైనట్టు కొంతమంది సిబ్బంది మేనేజ్ చేసి.. వేతనాలు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి బోగస్ మస్తర్ల బాగోతానికి పర్యవేక్షణ విభాగం చెక్ పెట్టనుంది.
నిబంధనలివే..
ఉపాఽదిహామీ కూలీలకు రోజువారీ వేతనం సగటున రూ.300 పెంచేందుకు ప్రభుత్వం పలు నిబంధనలను జారీ చేసింది. ప్రధానంగా పనుల గుర్తింపు, పనిప్రదేశాలకు అనుగుణంగా చేపట్టాలి. ముందస్తుగా అంచనాలు తయారు చేయాలి. నేలస్వభావం, కూలీలు పనిచేయడానికి సానుకూలంగా ఉండేలా గుర్తించాలి. జిల్లాను యూనిట్‌గా తీసుకుని పనులు కల్పించాలి. గ్రామాల్లో ఉపాధి పనులపై కూలీలకు అవగాహన కల్పించాలి. పనివేళల్లో మార్పులు చేయాలి. టెక్నికల్ అసిస్టెంట్లు నిత్యం మానిటరింగ్ చేయాలి. ఏపీడీ, ఏపీవో, ఎమ్పీడీవోలు మస్టర్లను తనిఖీ చేయాలి. వేతనదారులు పనివేళలు, కొలతలు పారదర్శకంగా లెక్కించాలి. వేతనదారులకు చెల్లించే వేతనాల రసీదులు కచ్చితంగా ఇవ్వాలి.