Share News

సర్పంచ్‌ల నిధులు పక్కదారి

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:48 PM

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల నిధులను పక్కదారి పట్టించింది. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8,660 కోట్లు సొంత అవసరాలకు వినియోగించింది’ అని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం, ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌, వి.లక్ష్మీముత్యాలరావు ఆరోపించారు.

సర్పంచ్‌ల నిధులు పక్కదారి
అచ్చెన్నాయుడుకు వినతిపత్రం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్‌ సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు

- న్యాయం చేయాలని అచ్చెన్నకు వినతి

టెక్కలి, ఫిబ్రవరి 29: రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల నిధులను పక్కదారి పట్టించింది. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8,660 కోట్లు సొంత అవసరాలకు వినియోగించింది’ అని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం, ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌, వి.లక్ష్మీముత్యాలరావు ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేయాలని కోరుతూ.. గురువారం కోటబొమ్మాళిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల విధులు, హక్కులను కాలరాసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్‌ మిషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించి పనులు చేపట్టాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీల గౌరవవేతనం నెలకు రూ.15వేలకు, ఎంపీపీ, జడ్పీటీసీల గౌరవ వేతనం రూ.30వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనులు చేయించాలని కోరారు. మైనింగ్‌ సెస్‌, ఇసుకలో వాటా నిధులు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌, నీటితీరువా తలసరి గ్రాంట్‌ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. 2019 నుంచి ఎగ్గొట్టిన రూ.4వేల కోట్లు తక్షణమే పంచాయతీలకు చెల్లించాలన్నారు. గ్రామపంచాయతీ నిధులు వినియోగంలో ఉన్న ఫీజింగ్‌ ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్‌ సర్పంచ్‌ల సంఘం, ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ ఉమ్మడిగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Feb 29 , 2024 | 11:48 PM