‘ఎత్తిపోతలకు’ నిధులు
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:33 PM
ఎత్తిపోతల పథకాల ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంత్రి అచ్చెన్న చొరవతో నిధులు మంజూరు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు రూ.78.85 లక్షలు
- మంత్రి అచ్చెన్న చొరవతో మంజూరు.. రైతుల హర్షం
(టెక్కలి)
ఎత్తిపోతల పథకాల ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంత్రి అచ్చెన్న చొరవతో నిధులు మంజూరు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సారవకోట మండలాల పరిధిలో వంశధార ప్రధాన ఎడమకాలువపై సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించే ఎనిమిది ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటిలో గత ఆరు నెలలుగా సుమారు రూ.80లక్షలు విలువచేసే రాగివైరు, డీపీ ఆయిల్ చోరీకి గురయ్యాయి. దీనిపై ఏపీఎస్‌ఐడీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఖరీఫ్‌లో తమకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఎత్తిపోతల పథకాల ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్న.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో శుక్రవారం రూ.78.85 లక్షల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
- చిన్నసాన ఎత్తిపోతల పథకం ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు రూ.14.60 లక్షలు, సౌడాం ఎత్తిపోతల పథకానికి రూ.13.80లక్షలు, మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకానికి రూ.31.20లక్షలు, సుభద్రాపురం ఎత్తిపోతల పథకానికి రూ.4.40లక్షలు, తొగిరి ఎత్తిపోతల పథకానికి రూ.8.35లక్షలు, టెక్కలిపాడు ఎత్తిపోతల పథకానికి రూ.6.50 లక్షలు నిధులను మంజూరయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఏపీఎస్‌ఐడీసీ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌లో రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. నిధుల మంజూరుపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లలో ఒక్కొక్కటీ చోరీ జరుగుతున్నా ప్రజాప్రతినిఽధులు, అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన అచ్చెన్నకు రుణపడి ఉంటామని పలువురు రైతులు తెలిపారు.