Share News

రేపటి నుంచి పోలీసు అమరవీరుల స్మారకోత్సవాలు

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:40 PM

పోలీసు అమరవీరుల స్మారకోత్సవాలను ఈ నెల 21నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రేపటి నుంచి పోలీసు అమరవీరుల స్మారకోత్సవాలు

శ్రీకాకుళంక్రైం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల స్మారకోత్సవాలను ఈ నెల 21నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమరవీరులను గుర్తుచేసుకుంటూ సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, వారి త్యాగాలను ప్రజలకు తెలియజేసేలా అన్ని స్టేషన్ల పరిధిలో స్మారకోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ‘21న జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, అమరవీరుల కుటుంబ సభ్యులను కలుసుకుంటాం. 31 వరకు ఎచ్చెర్ల పోలీసు కల్యాణ మండపంలో ఆయుధాలు, పరికరాలు, సాధనలు, సాంకేతిక ఉపకరణాలతో ఓపెన్‌ హౌస్‌ ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. సబ్‌డివిజనల్‌, సర్కిల్‌, పోలీసు స్టేషన్లలో కూడా ఓపెన్‌హౌస్‌ నిర్వహించనున్నాం. అమరవీరుల గ్రామాలను డీఎస్పీ స్థాయి అధికారులు సందర్శించి వారు చదివిన పాఠశాల, కళాశాలలకు వెళ్లి త్యాగవీరుల ఫొటోల వద్ద నివాళులర్పిస్తారు. ఆ గ్రామంలో ఏదైన పాఠశాల, రోడ్డు, అభివృద్ధి పనులకు వారి పేర్లు పెట్టేలా గ్రామస్థులకు సూచనలిస్తారు. సైబర్‌ నేరాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 24న శ్రీకాకుళం, 25న కాశీబుగ్గ, 26నటెక్కలి సబ్‌డివిజనల్‌ పరిధిలో పలు పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాం. పర్యావరణ పరిరక్షణలో పోలీసుల పాత్ర అన్న అంశంపై పోలీసు సిబ్బందికి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు సబ్‌డివిజనల్‌ పరిధిలో నిర్వహించనున్నాం. 26,27న మూడు సబ్‌డివిజన్ల పరిధిలో పోలీసు దేశభక్తిని తెలిపే సందేశాత్మక చిత్రాలు ప్రదర్శిస్తాం. 28న జిల్లా పోలీసు కార్యాలయంలో, 29న టెక్కలి, 30న కాశీబుగ్గ సబ్‌డివిజన్‌ పరిధిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాం. 30న అమరవీరుల కుటుంబాల్లో ప్రత్యేక విజయాలు సాధించిన వారికి సన్మానిస్తాం. 31న శ్రీకాకుళంలో రాష్ర్టీయ ఏక్తా దివస్‌ కార్యక్రమంలో భాగంగా ఉదయం యూనిట్‌ రన్‌, సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీతో అమరవీరుల స్మారకోత్సవాలు ముగుస్తాయ’ని ఎస్పీ తెలిపారు.

Updated Date - Oct 19 , 2024 | 11:40 PM