Share News

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:37 PM

పలాస నియోజకవర్గానికి ఎట్టకేలకు వంశధార రానుంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో చుక్కనీరు కూడా రాక.. రైతులు సాగునీటికి ఇబ్బందులు పడ్డారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వంశధారను పలాస నియోజకవర్గానికీ అందించేలా చర్యలు చేపట్టారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..
టెక్కలిపట్నం వద్ద వంశధార కాలువ పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష(ఫైల్‌)

- నేడు పలాసకు వంశ‘ధార’

- వైసీపీ పాలనలో చుక్కనీరు కూడారాని వైనం

(పలాస)

పలాస నియోజకవర్గానికి ఎట్టకేలకు వంశధార రానుంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో చుక్కనీరు కూడా రాక.. రైతులు సాగునీటికి ఇబ్బందులు పడ్డారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వంశధారను పలాస నియోజకవర్గానికీ అందించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు శనివారం ఉదయం వంశధార చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు. హిరమండలంలోని గొట్టాబ్యారేజీ వద్ద మూడు రోజుల కిందట వంశధార నీటిని కాలువ ద్వారా విడుదల చేశారు. బ్యారేజి నుంచి నీరు ఇక్కడకు చేరడానికి నాలుగు రోజుల వ్యవధి పడుతుంది. టెక్కలిపట్నం, నందిగాం మీదుగా పలాసకు నీరు చేరుకుంటుంది. అక్కడ నుంచి కేదారిపురం 60టి వద్దకు చేరుకొని వివిధ దశల్లో వజ్రపుకొత్తూరు మండలంలోకి ప్రవేశించి శివారు భూములకు నీరందిస్తుంది. పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో మొత్తం వంశధార కాలువ ద్వారా 9వేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. అనధికారికంగా మరో ఐదువేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది.

- టీడీపీ హయాంలో 2019 వరకూ వంశధార నీరు పలాసకు వచ్చేది. మాజీ మంత్రి, అప్పటి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ నిత్యం అధికారులతో చర్చలు జరుపుతూ నీటిని తీసుకువచ్చేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి కాగా.. టెక్కలి నియోజకవర్గం వరకే వంశధార పరిమితమైంది. దీనిపై ఆ పార్టీ నాయకులే జిల్లా సమావేశాల్లో అధికారుల తీరును ప్రశ్నించినా పట్టించుకున్న పాపాన లేదు. ఫలితంగా కాలువలో పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారాయి. వర్షం నీరు కూడా ప్రవహించే పరిస్థితి లేదు.

- ఈసారి ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గౌతు శిరీష భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమె వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి వంశధార సమస్యను తీసుకెళ్లారు. ఈక్రమంలో ఇటీవల పలాస మండలం టెక్కలిపట్నం వద్ద వంశధార ప్రవేశించే ప్రాంతాన్ని మంత్రి అచ్చెన్న సందర్శించారు. వైసీపీ నిర్లక్ష్యంతో ఐదేళ్లుగా వంశధార నీరు రాక.. రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే శిరీష ఆయనకు వివరించారు. దీంతో పలాసకు వంశధార వచ్చేలా చర్యలు చేపడతామని అచ్చెన్న హామీ ఇచ్చారు. ఈ మేరకు పలాస నియోజకవర్గంలో వంశధార కాలువ ప్రవహించే మొత్తం 16 కిలోమీటర్ల కాలువను ఆధునీకరించారు. కాలువలో పిచ్చిమొక్కలు తొలగించారు. చుక్క నీరు వచ్చినా నేరుగా వంశధార ఆయకట్టు చెరువుల్లోకి చేరేలా వంశధార అధికారులు పనులు పూర్తి చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గంగమ్మకు స్వాగతం పలుకుదాం

టెక్కలిపట్నం వద్ద వంశధార నీరు శనివారం చేరుకుంటుంది. గంగమ్మతల్లికి స్వాగతం, హారతులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున రైతులు, టీడీపీ నాయకులు తరలిరావాలి. సాగునీటి వనరులన్నీ పక్కాగా బాగుచేసి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే విధంగా చర్యలు తీసుకుంటాం.

- పీరుకట్ల విఠల్‌రావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి

Updated Date - Jul 05 , 2024 | 11:37 PM