Share News

పింఛన్‌ ఎప్పుడిస్తారని అడిగినందుకు..

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:30 AM

తన తండ్రికి పింఛన్‌ ఎప్పుడిస్తారని అడిగినందుకు ఓ లబ్ధిదారుడి కుమారుడిపై వలంటీర్‌ దాడికి పాల్పడ్డాడు. కులంపేరుతో దుర్భాషలాడాడు. ఆ వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదులో జాప్యం చేశారు. దీంతో బాధితుడు తనకు న్యాయం చేయాలంటూ సబ్‌కలెక్టర్‌ను ఆశ్రయించారు.

పింఛన్‌ ఎప్పుడిస్తారని అడిగినందుకు..

- లబ్ధిదారుడు కుమారుడిపై వలంటీర్‌ దాడి

- సబ్‌కలెక్టర్‌, పోలీసులకు బాధితుడు ఫిర్యాదు

- కేసు నమోదులో జాప్యం

టెక్కలి, ఏప్రిల్‌ 4: తన తండ్రికి పింఛన్‌ ఎప్పుడిస్తారని అడిగినందుకు ఓ లబ్ధిదారుడి కుమారుడిపై వలంటీర్‌ దాడికి పాల్పడ్డాడు. కులంపేరుతో దుర్భాషలాడాడు. ఆ వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదులో జాప్యం చేశారు. దీంతో బాధితుడు తనకు న్యాయం చేయాలంటూ సబ్‌కలెక్టర్‌ను ఆశ్రయించారు. బాధితుల వివరాల మేరకు.. టెక్కలి మేజర్‌పంచాయతీ చాకిపల్లి సచివాలయ పరిధిలో పింఛన్‌దారుడు కుప్పిలి అప్పారావు కుమారుడు సింహాచలంపై వలంటీర్‌ బొమ్మాళి తిరుపతిరావు దాడికి పాల్పడ్డాడు. బుధవారం సచివాలయం వద్దకు తిరుపతిరావు వెళ్లి.. తన తండ్రికి పింఛన్‌ సొమ్ము ఎప్పుడు ఇస్తారని వలంటీర్‌ తిరుపతిరావును ప్రశ్నించాడు. దీంతో ‘ఇక్కడ నీకేమి పనిరా?.. అంటూ దాడి చేయడమే కాకుండా జాతి తక్కువ నా కొడకా అంటూ కులం పేరుతో వలంటీర్‌ తిరుపతిరావు దూషించాడు’ అని సింహాచలం ఆరోపించారు. దీనిపై టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడిచేసిన వలంటీర్‌పై అట్రాసిటీ కేసు నమోదుచేసి తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడి జరిగిన సమయంలో స్థానికులు బోళ్ల గోపి, పంగ గిరి, కత్తుల కుమార్‌, పంగ సన్యాసి, తదితరులు ఉన్నారని తెలిపాడు. ఘటనపై తక్షణమే దర్యాప్తు చేసి వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గురువారం సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌కు బాధితుడు సింహాచలం ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని సబ్‌కలెక్టర్‌ తహసీల్దార్‌ మురళీకృష్ణకు ఆదేశించారు. ఈ విషయమై టెక్కలి సీఐ పి.పైడయ్య వద్ద ప్రస్తావించగా దీనిపై విచారణ చేస్తున్నామని, ఇంకా కేసు నమోదు చేయలేదన్నారు. ఇదిలా ఉండగా సింహాచలంపై తిరుపతిరావు దాడికి పాల్పడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Updated Date - Apr 05 , 2024 | 12:30 AM