వంశధారలో వరద నీరు
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:55 PM
తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా క్యాచ్‌మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలకు మంగళవారం మధ్యాహ్నం వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగింది.
హిరమండలం, సెప్టెంబరు 10: తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా క్యాచ్‌మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలకు మంగళవారం మధ్యాహ్నం వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఉదయం 8గంటల వరకు నదిలో 10,686 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా.. మధ్యాహ్నం ఒంటిగంటకు 30,500 క్యూసెక్కులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టెక్కలి ఆర్డీవో సుదర్శనదొర, ప్రత్యేకాధికారి రమ్మోహన్‌రావు, తహసీల్దార్ వెంకటరమణ బ్యారేజీ వద్దకు చేరుకొని వరద పరిస్థితిని పరిశీలించారు. వంశధార అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం వచ్చిన వరద వలన నదీతీర గ్రామాలకు ఎలాంటి ముప్పు ఉండదని వంశధార అధికారులు తెలిపారు. సాయంత్రం వరద ప్రవాహం క్రమేపీ తగ్గింది. రాత్రి 7 గంటలకు ఇన్‌ఫ్లో 22,356 క్యూసెక్కులు ఉండగా.. బ్యారేజీ 19 గేట్లు పైకెత్తి నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని ఈఈ ప్రదీప్, డీఈఈ రంగనాయకులు, ఏఈఈ ధనుంజయ, బి సత్యనారాయణ, పరిశుద్ధబాబు పరిశీలిస్తున్నారు. అంతకముందు మహేంద్రతనయ నది అవతల ఉన్న జిల్లోడిపేట గ్రామాన్ని ఆర్డీవో, రెవెన్యూ అధికారులు సందర్శించారు. పడవలో వెళ్లి.. గ్రామంలో వరద పరిస్థితిని తెలుసుకున్నారు.
భయాందోళనలో తీరప్రాంతవాసులు
జలుమూరు: వంశధార నదికి వరద పోటెత్తి ప్రవహిస్తుండడంతో తీర ప్రాంత గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. జలుమూరు మండలంలో కొమనాపల్లి, అచ్యుతాపురం, నగిరికటకం, సురవరం, దొంపాక మాకివలస లింగన్నాయుడుపేట, పర్లాం, యాతపేట, అంధవరం, రామకృష్ణాపురం, ఉప్పరపేట గ్రామస్థులు ముంపు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం వంశధార నదికి 30 వేల క్యూసెక్కులు నీరు ప్రవహిస్తోందని తహసీల్దారు లక్ష్మినారాయణ తెలిపారు. నదీ తీర గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు.