చేప ముల్లు గుచ్చుకుని..
ABN , Publish Date - Aug 15 , 2024 | 12:08 AM
కుటుంబ పోషణ కోసం ఆ మత్స్యకారుడు పదహారు రోజుల కిందట కర్ణాటక రాష్ట్రం మంగుళూరుకు వలస వెళ్లాడు.
- మంగుళూరులో జిల్లా మత్స్యకారుడి మృతి
- వలస వెళ్లిన 16 రోజుల్లోనే..
- తండ్రి ఒడిలోనే ప్రాణాలు వదిలిన వైనం
- నర్సయ్యపేటలో విషాదం
శ్రీకాకుళం రూరల్, ఆగస్టు 14: కుటుంబ పోషణ కోసం ఆ మత్స్యకారుడు పదహారు రోజుల కిందట కర్ణాటక రాష్ట్రం మంగుళూరుకు వలస వెళ్లాడు. అక్కడ సముద్రంలో వేటకు వెళ్లగా ఓ చేప ముల్లు గుచ్చుకుంది. దీంతో తీవ్ర అనార్యోగానికి గురయ్యాడు. చివరకు ఆరోగ్యం క్షీణించి తండ్రి ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. శ్రీకాకుళం రూరల్ మండలం నర్సయ్యపేట గ్రామానికి చెందిన కొమర పోలీసు (39) అనే మత్స్యకారుడు 2011లో రేవతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానికంగా కొంతకాలంగా సరైన పనిలేక కుటుంబ పోషణ కష్టమయింది. దీంతో తన తండ్రి అవతారంతో కలిసి గత నెల 28న మంగుళూరు వలస వెళ్లాడు. అక్కడ పోలీసుకు చేపల వేట పని దొరకగా, తండ్రి అవతారానికి ఒడ్డున వలలు అల్లుకునే పని లభించింది. కొన్ని రోజుల కిందట చేపల వేటకు వెళ్లిన పోలీసుకి సముద్రంలో ఓ చేప ముల్లు గుచ్చుకుంది. దీంతో అనారోగ్యానికి గురికావడంతో ఒడ్డుకు వచ్చి చికిత్స తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటే కుటుంబ పోషణ భారమవుతుందని మళ్లీ బోటులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో పోలీసు ఆరోగ్యం క్షీణించింది. ఒడ్డుకు తీసుకెళ్లాలని బోటులోని తోటి మత్స్యకారులను రెండు రోజులుగా వేడుకున్నా పట్టించుకోలేదు. చివరకు సముద్రంలో దూకాడు. దీంతో అతన్ని కాపాడి ఈ నెల 12న ఒడ్డుకు తీసుకుని వచ్చారు. అక్కడే వలలు పని చేసుకుంటున్న తండ్రిని పిలిచి అతని ఒడిలో తలపెట్టుకుని.. చేప విషం తన ఒంటి నిండా పాకేసిందని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని, తానింక బతకనేమోనని చెబుతూనే ప్రాణాలు విడిచాడు. తోటి మత్స్యకారులు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న భార్య రేవతి, తల్లి దుర్గమ్మ బుధవారం మంగుళూరు చేరుకున్నారు. ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న పోలీసుని చూసి భోరున విలపించారు. మంగుళూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తయింది. గురువారం అక్కడే అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
పోలీసు మృతితో నర్సయ్యపేటలో విషాదచాయలు అలముకున్నాయి. మత్స్యకార నాయకుడు కోనాడ నర్సింగరావు.. పోలీసు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా పట్టించుకోలేదన్నారు. దీంతో వారికి వలసలు తప్పడం లేదన్నారు. ఇలా వెళ్లిన వారంతా సరిహద్దులో పక్క దేశ కోస్టుగార్డులకు చిక్కడం, లేదంటే మరణించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీలంక కోస్ట్‌గార్డులకు చినగనగళ్లవానిపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు చిక్కారని, వారు విడుదల కాకముందే మంగుళూరులో మరో మత్స్యకారుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు.
తోటి మత్స్యకారులే కారణం
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నా కొడుకు పోలీసు ఆరోగ్యం క్షీణించింది. ఒడ్డుకు తీసుకెళ్లాలని బోటు డ్రైవర్‌ను రెండు రోజులుగా కోరినాపట్టించుకోలేదు. దీంతో సముద్రంలో దూకేశాడు. దీంతో కాపాడి ఒడ్డుకు తెచ్చారు. చనిపోయే ముందు ఈ విషయం నాకు చెప్పి బాధపడ్డాడు. నా కొడుకు చావుకు కారణం తోటి మత్స్యకారులు, బోటు ఓనరే. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-అవతారం, మృతుడి తండ్రి