జూన్ 12న మూలపేటలో తొలిషిప్ ల్యాండింగ్
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:45 PM
సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టులో వచ్చే ఏడాది జూన్ 12న తొలి షిప్ ల్యాండ్ అయ్యేలా లక్ష్యం నిర్ణయించామని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మూలపేట పోర్టు పనులను పునఃప్రాంభించారు.
- పోర్టుకు అనుసంధానంగా 8వేల ఎకరాల్లో పారిశ్రామికాభివృద్ధి
- భావనపాడులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం
- పోర్టు పనులు పునఃప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు
సంతబొమ్మాళి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టులో వచ్చే ఏడాది జూన్ 12న తొలి షిప్ ల్యాండ్ అయ్యేలా లక్ష్యం నిర్ణయించామని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మూలపేట పోర్టు పనులను పునఃప్రాంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2014లో 3,500 ఎకరాల్లో భావనపాడుకు పోర్డు నిర్మాణానికి నోటిఫికేషన్ ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోర్టును మూలపేటకు మార్చి కేవలం 350 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. పోర్టుకు అనుసంధానం భూములుంటే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఈస్టుకోస్టు పవర్‌ప్లాంట్‌కు చెందిన 1800 ఎకరాలు, ఏపీఐఐసీకి చెందిన 1200 ఎకరాలతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న 5వేల ఎకరాల సాల్ట్ భూములును తీసుకొని అభివృద్ధి చేపడతాం. ఉప్పు భూములు తీసుకొనేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ రిఫనరీ మంజూరు చేసింది. నేను, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ ప్రాంతంలో రిఫనరీ పెట్టాలని సీఎం చంద్రబాబుకు కోరాం. ఒకవేళ రిఫనరీ రాకుంటే కాలుష్యరహిత పరిశ్రమలు స్థాపించేలా చర్యలు తీసుకుంటాం. పోర్టుకు అనుగుణంగా టౌన్‌షిప్ రావాలి. విశాఖ-భోగాపురం వరకు తీరప్రాంత వెంబడి ఆరు లేన్ల రహదారిని మొదటి విడతలో చేపడతాం. రెండో విడతలో భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకు ఆరు లేన్ల రహదారి నిర్మిస్తాం. మూలపేట పోర్టుకు అనుసంధానంగా 8వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర నూతన పారిశ్రామిక పాలసీ ద్వారా ఎంఎస్‌ఎంఈ కింద ప్రతి నియోజకవర్గంలో ఒక పార్కు ఏర్పాటు చేస్తున్నాం. వలసలు నివారణకు చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.
భావనపాడులో ఫిషింగ్ హార్బర్
మూలపేటలో పోర్టుతోపాటు మత్స్యకారుల వేట కోసం భావనపాడులో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘బుడగట్లపాలెంలో త్వరలోనే పిషింగ్ హార్బర్ పనులు చేపడతామం. మంచినీళ్ళపేటలో ఫిష్ ల్యాండింగ్ ట్యాంక్ నిర్మిస్తాం. మత్స్యకారులను అన్ని విధాల ఆదుకుంటాం. రాష్ట్రంలో సొంత అవసరాలకు పూర్తిగా ఉచితంగా ఇసుక తీసుకువెళ్లేందుకు అనుమతులు ఇచ్చాం. ప్రజలకు అనువుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్ల సీనరీజ్‌ను రద్దు చేసింది. గత ప్రభుత్వం మద్యం పేరిట రూ.వేల కోట్లు దోచుకుంది’ అని అచ్చెన్న ఆరోపించారు.
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
పోర్టు నిర్వాసితులందరికీ న్యాయం చేస్తానని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ‘గత ప్రభుత్వంలో చాలామంది నిర్వాసితులకు అన్యాయం జరిగింది. దీనిపై ఇప్పటికే రీసర్వే చేసి బాధితులను గుర్తించాం. పోర్టు వల్ల నిర్వాసితులుగా మారిన మూలపేట,విష్ణుచక్రం గ్రామాల వారికి ముందుగా ఉపాధి కల్పిస్తాం. తర్వాత నియోజకవర్గ స్థాయి వారికి న్యాయం చేస్తాం. నిర్వాసితుల కాలనీని టౌన్‌షిప్‌గా అభివృద్ది చేస్తాం. అక్కడ ఉప్పునీరు పడడం వల్ల వంశధార రిజర్వాయర్ ద్వారా పైప్‌లైన్ వేసి మంచినీటిని అందిస్తామ’ని అచ్చెన్న తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఆర్డీవో కృష్ణమూర్తి, కింజరాపు హరప్రసాద్, మండల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు జీరు భీమారావు, రెడ్డి అప్పన్న పాల్గొన్నారు.
30 శాతం పనులు పూర్తి
విశ్వసముద్ర ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎమ్‌డీ అనిల్ ఎండ్లూరి మాట్లాడుతూ 30శాతం పోర్టు పనులు పూర్తయ్యాయని తెలిపారు. ‘580 మీటర్ల పొడవు నార్త్‌బ్రేక్ వాటర్ పనులు పూర్తయ్యాయి. సౌత్ బ్రేక్ వాటర్ పనులు 2450 మీటర్లకుగాను 1700 మీటర్లు పూర్తి చేశాం. ఇండో పార్ట్స్ కాంక్రీట్ బ్లాక్‌లను 54వేలకు 24 వేల బ్లాక్‌లు పూర్తయ్యాయి. జనరల్ కార్గో బెర్త్‌కు పైలింగ్ పూర్తయింది. ఒక కోల్ బెర్త్ ప్రారంభించాల్సి ఉంది. 14 కిలోమీటర్ల మేర మూలపేట నుంచి జాతీయ రహదారి -16 వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం సబ్‌గ్రేడ్ పూర్తయింది. వచ్చే ఏడాది జూన్ 12 నాటికి మెదటి బెర్త్ వినియోగంలోకి తీసుకువస్తామ’ని ఎమ్‌డీ తెలిపారు.