Share News

తొలి ఫలితం.. ఆమదాలవలస

ABN , Publish Date - May 27 , 2024 | 11:45 PM

సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం దగ్గర పడుతోంది. ఈవీఎంల్లో నేతల తలరాతలు భద్రంగా ఉన్నా.. వారి జాతకం జూన్‌ 4న తేలనుంది. ముందుగా ఆమదాలవలస, చివరాఖరున పాతపట్నం నియోజకవర్గాల ఫలితం వెల్లడికానుంది.

తొలి ఫలితం.. ఆమదాలవలస
మాట్లాడుతున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- చివరాఖరున పాతపట్నం

- ఎంపీ ఓట్ల లెక్కింపు.. అర్ధరాత్రి వరకూ..

- 1300 మంది సిబ్బందితో ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం దగ్గర పడుతోంది. ఈవీఎంల్లో నేతల తలరాతలు భద్రంగా ఉన్నా.. వారి జాతకం జూన్‌ 4న తేలనుంది. ముందుగా ఆమదాలవలస, చివరాఖరున పాతపట్నం నియోజకవర్గాల ఫలితం వెల్లడికానుంది. జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్‌తో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13న ఎన్నికలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 18,63,520 ఓటర్లు ఉండగా 14,17,959 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎచ్చెర్లలోని శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నిబంధన ప్రకారం తక్కువ పోలింగ్‌ కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ముందుగా చేపట్టాలి. జిల్లావ్యాప్తంగా 2,357 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అతి తక్కువగా ఆమదాలవలసలో 259 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈ మేరకు ఆమదాలవలస నియోజకవర్గం ఈవీఎంలను ముందుగా తెరిచి ఓట్లు లెక్కించి.. మధ్యాహ్నం 3 గంటలకు తొలి ఫలితం వెల్లడించనున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గం ఫలితం వెల్లడిస్తారు. తర్వాత వరుసగా పలాస, ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఎచ్చెర్ల నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. సుమారుగా సాయంత్రం 4 గంటలకు పూర్తిస్పష్టతతో తెలుస్తుంది. జిల్లాలో పాతపట్నంలో అధికంగా 332 పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో.. ఈ నియోజకవర్గం ఫలితం చివరిలో తేలనుంది. ఇక శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు మాత్రం అర్ధరాత్రి వరకు సమయం పట్టే అవకాశముంది. 2019 ఎన్నికల్లో ఎంపీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి 3 గంటలవరకు పూర్తికాలేదు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో ప్రారంభం...

పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్లపై ప్రతిపక్షం గంపెడాశలు పెట్టుకోగా.. వాటితో తమకు గండం తప్పేలాలేదని అధికారపార్టీ ఆందోళన చెందుతోంది. గతంలో కాకుండా ఈసారి పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్లు ముందుగా లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. జిల్లావ్యాప్తంగా 38,865 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. ఇవి ఎవరితలరాతను మార్చేస్తాయోనని మంత్రులు.. అధికారపార్టీ ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నారు. అరగంటలో లెక్కింపు పూర్తిచేసి.. 8.30 గంటల నుంచి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.

రౌండ్ల వారీగా లెక్కింపు..

ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 1300 మంది సూపర్‌వైజర్లు, మైక్రోఅబ్జర్వర్లు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌లను నియమించారు. రౌండ్లవారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆమదాలవలస నియోజకవర్గానికి 19 రౌండ్లు, పాతపట్నం 24, ఇచ్ఛాపురం 22, పలాస 21, టెక్కలి 23, శ్రీకాకుళం 20, ఎచ్చెర్ల 23, నరసన్నపేట 21 రౌండ్లుగా లెక్కింపు జరగనుంది.

లెక్కింపు కేంద్రంలోకి సెల్‌ఫోన్ల అనుమతి లేదు: కలెక్టర్‌

అరసవల్లి/గుజరాతీపేట: ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లకు అనుమతి లేదని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. ఎచ్చెర్లలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రంలో నియోజకవర్గాల వారీగా సోమవారం డ్రై రన్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల నియమాలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థుల ప్రవేశంపై ఎస్పీ రాధికతో చర్చించారు. డ్రైరన్‌లో జేసీ ఎం. నవీన్‌, టెక్కలి సబ్‌కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, డీఆర్వో ఎం.గణపతిరావు, ఏఎస్పీ ప్రేమ్‌కాజల్‌, ఆర్వోలు, జడ్పీ సీఈవో, డీఎస్పీలు, ఇతర అధికారులు ఉన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:45 PM