చివరకు ఫ్లైఓవరే!
ABN , Publish Date - Feb 03 , 2024 | 12:23 AM
రణస్థలంలో ఫ్లైఓవర్ నిర్మాణానికే జాతీయ రహదారుల సంస్థ మొగ్గు చూపింది. తీవ్ర తర్జనభర్జనల నడుమ బైపాస్ కంటే వంతెన నిర్మాణమే మేలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులు కసరత్తు ప్రారంభించి డ్రోన్ సర్వే పూర్తిచేశారు.
- రణస్థలంలో ఎట్టకేలకు వీడిన సందిగ్ధత
- డీపీఆర్ తయారీలో అధికారులు
- విద్యుత్ శాఖతో సంప్రదింపులు
- బైపాస్‌ను పక్కనపెట్టి.. స్తంభాలతో కూడిన వంతెన వైపు మొగ్గు
(రణస్థలం)
రణస్థలంలో ఫ్లైఓవర్ నిర్మాణానికే జాతీయ రహదారుల సంస్థ మొగ్గు చూపింది. తీవ్ర తర్జనభర్జనల నడుమ బైపాస్ కంటే వంతెన నిర్మాణమే మేలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులు కసరత్తు ప్రారంభించి డ్రోన్ సర్వే పూర్తిచేశారు. విద్యుత్‌శాఖ అధికారులను సైతం సంప్రదించి రోడ్డు వెంబడి ఉన్న స్తంభాలను మార్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. డీపీఆర్ తయారుచేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే టెండరు పూర్తిచేసి మే, జూన్ నాటికి పనులు ప్రారంభిస్తామని నేషనల్ హైవే అధికారులు చెబుతున్నారు.
- ఇదీ పరిస్థితి
విశాఖ నుంచి నరసన్నపేట వరకూ దాదాపు 135 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని ఆరు లేన్లగా విస్తరించారు. కానీ రణస్థలం మండల కేంద్రాన్ని పెండింగ్‌లో పెట్టడంతో ఆరేళ్లుగా సందిగ్ధత కొనసాగుతోంది. మండల కేంద్రాన్ని తప్పించి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. అలాగని ఫ్లైఓవర్ నిర్మించలేదు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రణస్థలం మండల కేంద్రాన్ని తప్పించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి 2016లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దన్నానపేట నుంచి లావేరు మండలం రావివలస వరకూ 3.5కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణానికి నిర్ణయించారు. సుమారు 66ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. భూసేకరణ కూడా చేపట్టారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం, ఎచ్చెర్లలో సేకరించిన భూములకు మాదిరి పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. మార్కెట్ ధర ప్రకారం సెంటు భూమికి రూ.2లక్షలకుపైగా చెల్లిస్తామని కూడా ప్రకటించారు. కానీ అప్పట్లో విపక్షంగా ఉన్న వైసీపీ నేతలు ఈ పరిహారం ఏమూలకు సరిపడదని.. దాని పెంచాలని డిమాండ్ చేశారు. మిగతా ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై దృష్టి పెట్టిన హైవే అథారిటీ అధికారులు రణస్థలంలో పెండింగ్ పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు పరిహారం విషయంలో మాట మార్చారు. సెంటుకు మొదటి అనుకున్నంత ధర ఇవ్వలేమని 30శాతం తగ్గించి ఇస్తామని ప్రకటించారు. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. బైపాస్ నిర్మించాలంటే దాదాపు ఐదు చోట్ల వంతెనల నిర్మాణం చేపట్టాలి. రైతులకు పరిహారం చెల్లించాలి. ఈ మొత్తం లెక్కలు వేసుకున్న హైవే అథారిటీ అధికారులు రణస్థలంలో ఫ్లైఓవర్ నిర్మాణానికే మొగ్గుచూపారు. అప్పటికే రైతుల నుంచి సేకరించిన 66ఎకరాలను తిరిగి వారికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
- ప్రతిపాదనలు ఇలా..
రణస్థలం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు ఏడాది కిందట సన్నాహాలు చేశారు. రూ.200కోట్లతో నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ఖరారు అయినట్టు ప్రకటించారు. కానీ పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు డీపీఆర్ తయారు చేసేందుకు అధికారుల సర్వే పూర్తిచేయడంతో ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభించినట్టు అయింది. ఫ్లైఓవర్ నిర్మాణంతో రణస్థలం ప్రాభవం కోల్పోతుందని.. వంతెన నిర్మించవద్దంటూ స్థానికులు, వ్యాపారులు ఆందోళనలు చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలపై ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలో ఖర్చు తగ్గించుకోవడంతో పాటు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా ఉండేలా వంతెన నిర్మాణానికి నేషనల్ హైవే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్, ఆశీలుమెట్ట తరహాలో భారీ స్తంభాలతో వంతెన ఏర్పాటుకు నిర్ణయించినట్టు సమాచారం. కింద వ్యాపారాలకు అడ్డంకి లేకుండా.. వంతెనపై లారీలు, అంతర్ రాష్ట్ర వాహనాలు వెళ్లే వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు హైవే అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్‌శాఖ అధికారుల వద్ద ప్రస్తావిస్తే నేషనల్ హైవే అధికారులు తమను సంప్రదించారని తెలిపారు. రోడ్డు వెంబడి ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు చెప్పారు. దారిపొడవునా విద్యుత్ స్తంభాలు ఎన్ని ఉన్నాయి? వాటిని మార్చేందుకు వీలుందా? ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? అన్న విషయాలను సేకరించినట్టు ట్రాన్స్‌కో ఏఈ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. అలాగే ఆర్‌డబ్లూఎస్ డీఈ సూర్యనారాయణను నేషనల్ హైవే ఇంజినీర్లు కలిశారు. ఎక్కడైనా పైపులైన్ల మరమ్మతులు ఉంటే పరిశీలించి గుర్తించాలని సూచించారు.