‘ఫెంగల్’ అలజడి
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:01 AM
జిల్లా రైతాంగాన్ని ఫెంగల్ తుఫాన్ భయపెడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది శుక్రవారం నాటికి తుఫాన్‌గా మారనుంది.

-తుఫాన్ హెచ్చరికతో రైతుల్లో ఆందోళన
- జిల్లాలో రేపు, ఎల్లుండి వర్షాలు
- హెచ్చరించిన వాతావరణశాఖ
- అధికార యంత్రాంగం అప్రమత్తం
నరసన్నపేట/హరిపురం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా రైతాంగాన్ని ఫెంగల్ తుఫాన్ భయపెడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది శుక్రవారం నాటికి తుఫాన్‌గా మారనుంది. దీని ప్రభావంతో జిల్లాలో శుక్ర, శనివారం మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావారణ శాఖ గురువారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పర్యటిస్తూ ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరి కోతలు కోయవద్దని, ఇప్పటికే కోసిన పంటను, ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవాలని సూచిస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
రైతుల్లో ఆందోళన
తుఫాన్ హెచ్చరికలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఖరీప్ సీజన్‌లో జిల్లాలో సుమారు 3.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటికే 2.2 లక్షల ఎకరాల్లో కోతలు, 1.02 లక్షల ఎకరాల్లో నూర్పులు పూర్తయ్యాయి. ధాన్యం రాశులను రోడ్లపై, కళ్లాల్లో ఆరబెడుతున్నారు. అయితే, మంగళవారం నుంచే ఆకాశం మేఘావృతం కావడంతో రైతులు ధాన్యాన్ని భద్రపరుచుకుంటున్నారు. ఇంకా కొనుగోలు ప్రారంభంకాకపోవడంతో కొందరు రైతులు దళారులకు పంటను విక్రయిస్తున్నారు. వంశధార ఎడమ కాలువ పరిధిలోని జలుమూరు, నరసన్నపేట, పోలాకి మండలాల్లో వరి కోతలు నిలిపివేశారు. ఈ మూడు మండలాల్లో 15 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. పనలు పూర్తిస్థాయిలో ఎండనప్పటికీ వాటిని హడావుడిగా కుప్పలు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుప్పలు వేయకుండానే నేరుగా నూర్పు చేస్తున్నారు. వర్షం కురిసినా పంట తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు కప్పుతున్నారు. మందస ప్రాంతంలో డాబార్సింగి, కలింగదల్, దామోదరసాగర్‌లతో పాటు సునాముది, మహేంద్రతనయా నది, సంకుజోడి, గోపాల సాగరం వంటి పెద్ద సాగునీటి వనరుల కింద సుమారు 10 వేల హెక్లార్లల్లో వరి పంట కోత దశకు చేరుకుంది. సగానికి పైగా పొలాలు కోతలు కోసి ఉండడంతో ఎక్కడ కుప్పలు పెట్టాలి, ఏమిచేయాలో పాలు పోవడంలేదని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. మందస మండలంలో ఏగ్రామం వెళ్లి చూసినా పొలాల్లో రైతులు, కుప్పలు వేస్తున్న దృశ్యాలే కన్పిస్తున్నాయి.