Share News

వణికిస్తున్న వాయుగుండం

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:52 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రైతులను బెంబేలెత్తిస్తోంది. ఈనెల 23 నుంచి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

వణికిస్తున్న వాయుగుండం
జమ్ము వద్ద కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట

- రైతుల గుండెల్లో తుఫాన్‌ గుబులు

- వరి పంటకు నష్టం తప్పదని ఆందోళన

నరసన్నపేట, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రైతులను బెంబేలెత్తిస్తోంది. ఈనెల 23 నుంచి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోత దశలో వరి పంటకు ముంపు నష్టం వాపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 4,75,947 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ఆర్‌ఎన్‌ఆర్‌, పారిజాతి రకాల పంట కోత దశలో ఉంది. పాతపట్నం, సారవకోట, జలుమూరు, ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జలి తదితర మండలల్లో ఇప్పటికే కొంతమేరకు యంత్రాలతో కోతలు పూర్తి చేసి పచ్చిధాన్యాన్ని విక్రయాలు చేపట్టారు. నరసన్నపేట, పోలాకి, కోటబొమ్మాళి, గార, శ్రీకాకుళం, ఆమదాలవలస, బూర్జ, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో వరి పంట కోసేందుకు సిద్ధంగా ఉంది. ఈ దశలో ఏమాత్రం గాలులు వీచినా, వర్షం పడినా నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏటా అక్టోబరులో తుఫాన్‌ల బెడద తప్పడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురిస్తే పండిన పంటంతా మొలకెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చివరి వరకు గండమే

తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటే పండిన వరిపైరు నేలపై పడిపోతుంది. పంట చేతికి వచ్చేవరకు గండంగా ఉంటుంది. తురుచూ ప్రకృతి వైపరీత్యాల నుంచి బయట పడేలా ముందుస్తుగానే కాలువల్లో సాగునీరు విడుదల చేస్తే రైతుకు బాగుంటుంది.

- జల్లు చంద్రమౌళి, ల్యాండ్‌ లార్డు, ఉర్లాం

...............

అక్టోబర్‌ అంటే భయమే

ఏటా అక్టోబరు నెల వచ్చిందంటే రైతులకు భయమే. దీపావళి అమావాస్య పోయే వరకూ వరికోతలు కోచేందుకు చూస్తాం. గత నెలలో తుఫాన్‌ గండం తప్పిందని సంతోషించాం. పంటలు మరో పదిహేనురోజుల్లో చేతికి వస్తున్న తరుణంలో మళ్లీ తుఫాన్‌ హెచ్చరికలతో భయమేస్తోంది. ప్రస్తుతం వరి పంట కోయలేం. పొలంలో ఉంచలేని పరిస్థితి నెలకొంది.

యాళ్ల వేణుగోపాలరావు, రైతు, మాకివలస

............

విద్యుత్‌ శాఖ హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు

అరసవల్లి: దానా తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో ఈనెల 22 నుంచి 28 వరకు ఈదురుగాలులు, వర్షాలతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో మూడు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ పంపిణీలో అవాంతరాలు ఏర్పడితే.. శ్రీకాకుళం- 94906 10045, టెక్కలి- 83328 43546, పలాస-73825 85603 ఫోన్లు నెంబర్లుకు సంప్రదించాలని సూచించారు. విద్యుత్‌ స్తంభాలు ఒరిగినా.. వైర్లు తెగినా సహాయ కేంద్రాలకు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యుత్‌ వినియోగదారులు భద్రతా సూచనలు పాటించాలని తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 11:52 PM