Share News

ఇంటర్‌ విద్యార్థులకు ‘పరీక్షే’!

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:53 PM

జిల్లాలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అసౌకర్యాలు కలుగకుండా, పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. చాలా కేంద్రాల్లో సమస్యలు నెలకొన్నాయి.

ఇంటర్‌ విద్యార్థులకు ‘పరీక్షే’!
సరుబుజ్జిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రం

- నేటి నుంచి పరీక్షలు

- సమస్యల నడుమ కేంద్రాలు

- కొన్నిచోట్ల దూరంగా కేటాయించడంతో ఇబ్బందులు

(సరుబుజ్జిలి/మెళియాపుట్టి)

మెళియాపుట్టి మండలం పెద్దమడి గురుకుల కళాశాలలో సుమారు 176మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. వీరంతా చాపర, మెళియాపుట్టి కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. రోజూ 15 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష రాయాలంటే ఇబ్బందేనని బి.గణపతి, బి.భరత్‌కుమార్‌ తదితర విద్యార్థులు వాపోతున్నారు. పరీక్ష కేంద్రం దూరంగా కేటాయించడంతో ఉదయం 6.30 గంటలకే ఇంటి నుంచి బయలుదేరాలని, ఈ క్రమంలో మరింత ఒత్తిడికి గురవుతున్నామని పేర్కొంటున్నారు. పెద్దమడిలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.

..................

మెళియాపుట్టి జూనియర్‌ కళాశాల కేంద్రంలో సుమారు 286 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయనున్నారు. ఈ కేంద్రంలో ప్రహరీ లేకపోవడంతో బయట నుంచి వ్యక్తులు సులువుగా లోపలికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ వైకుంఠరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

.....................

సరుబుజ్జిలిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రం విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకుతోంది. నిర్మించినా ప్రారంభానికి నోచుకోని మరుగుదొడ్లు, చాలీచాలని తరగతి గదులు, విరిగిన పాత బెంచీలు, కానరాని తాగునీటి సదుపాయంతో విద్యార్థుల సహనానికే పరీక్షగా మారుతోంది. ఈ కేంద్రంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం 200 మంది, ద్వితీయ సంవత్సరం 250 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు-నేడు పథకంలో భాగంగా ప్రిన్సిపాల్‌ భూషణరావు సుమారు రూ.36లక్షలతో జీజే కళాశాల మరమ్మతులు చేయించారు. నిధుల విడుదలలో జాప్యం, స్థానిక నేతలను విస్మరించడం, రెగ్యులర్‌ సిబ్బందిని కాదని ఎంటీస్‌ లెక్కల మాస్టర్‌పై ఆధారపడడం, ప్రిన్సిపాల్‌ ఒంటెద్దు పోకడల నిర్ణయాలు.. తదితర కారణాలతో మరుగుదొడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగాయి. పరీక్షల సమయానికి పనులు పూర్తయినా.. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్‌ తమ్మినేని సీతారాం వాటిని ప్రారంభించలేదు. దీంతో వాటిని వినియోగంలోనికి తేవాలా? వద్దా? అనే సందిగ్ధంలో సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.

......................

జిల్లాలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 83 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం 19,937మంది, ద్వితీయ సంవత్సరం 25,765 మంది మొత్తం 45,702 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. 83మంది చొప్పున చీఫ్‌సూపరింటెండెంట్లు, డెవలప్‌మెంట్‌ అధికారులతోపాటు 1600మంది ఇన్విజిలేటర్లను నియమించామని అధికారులు తెలిపారు. మొత్తం 1,480 సీసీ కెమెరాల పర్యవేక్షణ పరీక్షలు నిర్వహించనన్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు అసౌకర్యాలు కలుగకుండా, పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. చాలా కేంద్రాల్లో సమస్యలు నెలకొన్నాయి. ‘నాడు-నేడు’ పఽథకం పేరుతో సకాలంలో నిధులు మంజూరు కాక పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో పరీక్షా కేంద్రాల్లో అరకొర సౌకర్యాలే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు సరుబుజ్జిలిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రంలో మరుగుదొడ్లతోపాటు రన్నింగ్‌ వాటర్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆదరాబాదరాగా పనులు చేపట్టినా ఒకేషనల్‌ బ్లాక్‌నుంచి ప్రిన్సిపాల్‌ బ్లాక్‌కు తాగునీటి సదుపాయం కల్పించలేదు. అలాగే నూతనంగా ఒక్క బెంచీ కూడా లేదు. పాతవి, విరిగిపోయిన వాటికి ముస్తాబు చేయించారు. అప్పటికీ బెంచీలు చాలకపోతే పక్కనున్న ప్రైవేటు కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి బెంచీలు తెప్పించి సర్దుబాటు చేశారు. మరోవైపు కళాశాలలో పరీక్షలు నిర్వహించేందుకు తరగతి గదులు చాలడం లేదు. బోటనీ, జువాలజీ, ల్యాబ్‌లోనే పరీక్ష గదిని కేటాయించారు. ఏ చిన్న తేడా వచ్చినా రసాయనాలు, ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌తో విద్యార్థులు అవస్థలు పడాల్సిందే. మరోవైపు రేకుల షెడ్‌లో తాత్కాలికంగా నిర్వహిస్తున్న గ్రంథాలయంలోనూ కొన్ని రోజులు పరీక్షలు జరపనున్నారు. కళాశాల సిబ్బంది కోసం ప్రత్యేక గది లేకపోవడం, పరీక్షల సిబ్బంది, తనిఖీల బృందం ఎవరు వచ్చినా కూర్చోవడానికి ఆరుబయట సిమెంట్‌ బెంచీలు తప్ప ఎలాంటి సౌకర్యాలు లేవు. ఈ విషయమై చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఆకెళ్ల రామారావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. పరీక్షల నిర్వహణకు గదుల సమస్య ఉందన్నారు. ల్యాబ్‌ గదులను ఉపయోగించడానికి ప్రిన్సిపాల్‌ అనుమతిచ్చారని తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం శుద్ధజలాన్ని తెప్పిస్తామన్నారు. నాడు-నేడులో ఫర్నీచర్‌ మంజూరు కాకపోవడంతో పాత బెంచీలను వినియోగిస్తున్నామని తెలిపారు.

- కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిందే. ఆపసోపాలు పడుతూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సిందే. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు ఒత్తిడికి గురై.. ప్రమాదాల బారిన పడిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. చదువుతున్న కళాశాలలకు సమీపంలో కేంద్రాలు కేటాయిస్తే మేలని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:53 PM