Share News

అన్నింటా ఆధిక్యమే

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:25 PM

సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీయే కూటమి సునామీ మాదిరి విజృంభించి వైసీపీని తుడిచిపెట్టేసింది. జిల్లాలో శ్రీకాకుళం లోక్‌సభతో పాటు.. ఎనిమిది అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో కూటమి కైవసం చేసుకుంది.

అన్నింటా ఆధిక్యమే

- జిల్లాలో కూటమికి భారీ మెజార్టీ

- వైసీపీ గట్టి షాక్‌ ఇచ్చిన టీడీపీ అభ్యర్థులు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీయే కూటమి సునామీ మాదిరి విజృంభించి వైసీపీని తుడిచిపెట్టేసింది. జిల్లాలో శ్రీకాకుళం లోక్‌సభతో పాటు.. ఎనిమిది అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో కూటమి కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థులకు రౌండ్‌ రౌండ్‌కూ ఆధిక్యత రావడం.. ఎన్నడూ లేనంత మెజార్టీ లభించడంతో వైసీపీ నాయకులు ఖంగుతిన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలతోపాటు, ఉద్యోగుల స్వేచ్ఛను సైతం హరించేసింది. ఏం మాటాడినా, అన్యాయం జరిగిందని గొంతెత్తినా, హక్కుల సాధన కోసం పోరాటం చేసినా అప్రజాస్వామిక దాడులు చేసేవారు. పోలీసు కేసులు, అరెస్టుకు దిగేవారు. మరోవైపు టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ అరెస్టులు, కక్షసాధింపులకు పాల్పడేవారు. ఇలా అన్ని విధాలా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు. మరోవైపు ఐదేళ్లలో ఎక్కడా అభివృద్ధి పనులు లేక అసంతృప్తి చెందారు. అందుకే ఓట్ల రూపంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను బయటపెట్టారు. ఊహించని స్థాయిలో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారు. ఈసీ ఆదేశాలతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం.. కూటమి అధికారంలోకి రావడంతో అన్నివర్గాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

కూటమి మెజార్టీ ఇలా..

- వైసీపీ సీనియర్‌ నేత.. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై.. సర్పంచ్‌గా ఉంటూ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన గొండు శంకర్‌ జిల్లాలోనే అత్యధికంగా 52,521 ఓట్ల తేడాతో గెలవడం చర్చనీయాంశమవుతోంది. ధర్మాన మొదటి రెండున్నరేళ్లు.. ప్రజలను పట్టించుకోకపోవడం.. మంత్రిగా అవకాశం దక్కాక.. చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకుని ప్రజలనుంచి ఛీత్కారానికి గురయ్యారు. కనీసస్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది.

- తర్వాత స్థానంలో పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుపై గౌతు శిరీషకు 40,350 ఓట్లు ఆధిక్యత లభించింది. పశుసంవర్థకశాఖ మంత్రి ఉంటూ.. కొండలను గుల్ల చేసిన సీదిరికి పరాభవమే ఎదురైంది.

- ఇక ఆమదాలవలసలో వైసీపీ అభ్యర్థి స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌కు 35,032 ఓట్ల మెజార్టీ దక్కింది.

- టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడుకు 34,435 ఓట్ల మెజార్టీ వచ్చింది. అచ్చెన్నకు హ్యాట్రిక్‌ విజయం దక్కింది.

- ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్‌కు 39,783 ఓట్లు, నరసన్నపేటలో బగ్గు రమణమూర్తికి 29,371 ఓట్లు, పాతపట్నంలో మామిడి గోవిందరావుకు 26,527 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇక ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు 29,089 ఓట్ల మెజార్టీతో జిల్లాలో ఆపార్టీ తరపున అసెంబ్లీకి బోణీ కొట్టడం చర్చనీయాంశమైంది.

- శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి గాను టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు ప్రజలు ఏకపక్షంగా ఓట్లేశారు. రామ్మోహన్‌నాయుడుకు 7,54,328 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌కు 4,26,427 ఓట్లు మాత్రమే పడ్డాయి. 3,27,901 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్‌నాయుడు హ్యాట్రిక్‌ విజయం సాధించడంతో.. ఈసారి ఆయనకు కేంద్రమంత్రి వర్గంలో పదవి లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

నోటా దాటని కాంగ్రెస్‌

రాష్ట్ర విభజన కారణంగా తెలుగు ప్రజలు 2014లో కాంగ్రెస్‌ పార్టీని తిరస్కరించారు. ప్రత్యేకంగా విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014లోనూ, 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ డీలాపడింది. ఈసారి ఎన్నికలకు మాత్రం కాంగ్రెస్‌కు కాస్త జవసత్వాలు వచ్చాయని అందరూ భావించారు. పీసీసీ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ షర్మిలారెడ్డి.. ముందుగా శ్రీకాకుళం జిల్లాలోనే ప్రచారం నిర్వహించారు. తన అన్న వైఎస్‌ జగన్‌పై మాటల తూటాలు పేల్చారు. జనం నుంచి కూడా స్పందన లభించింది. కానీ ఎన్నికల్లో మాత్రం ఓట్ల రూపంలో ఆ స్పందన కనిపించలేదు. నోటా కన్నా.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులందరికీ తక్కువగానే ఓట్లు పోలయ్యాయి.

గత ఎన్నికలు పరిశీలిస్తే..

శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి కాంగ్రెస్‌ పార్టీకి 2014లో 24,171 ఓట్లు, 2019లో 13,745 ఓట్లు లభించాయి. ఈసారి (2024) ఎన్నికల్లో 7,172 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అలాగే జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో 2014లో కాంగ్రెస్‌ పార్టీకి మొత్తం 24,707 ఓట్లు లభించాయి. 2019లో 17,059 ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఎన్నికల్లో 20,616 ఓట్లు లభించాయి. కాగా.. ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో కానీ, లోక్‌సభ స్థానంలో కానీ నోటా కన్నా కాంగ్రెస్‌ పార్టీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు 8 అసెంబ్లీ స్థానాల్లో 31,007 ఓట్లు, శ్రీకాకుళం లోక్‌సభకు 24,605 ఓట్లు లభించాయి. ఈ ఫలితాలను బట్టి ఇప్పటికీ హస్తానికి జనాల్లో ఆదరణ పెరగలేదని స్పష్టమవుతోంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, నోటాకు లభించిన ఓట్లు..

--------------------------------------------------------------------------------------------------

నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి పేరు ఓట్లు నోటా

-----------------------------------------------------------------------------------------------

ఆమదాలవలస సనపల అన్నాజీరావు 3,481 2,300

ఎచ్చెర్ల కరిమజ్జి మళ్లేశ్వరరావు 2,452 3,952

ఇచ్ఛాపురం మాసుపత్రి చక్రవర్తిరెడ్డి 792 4,374

పాతపట్నం కొప్పురౌతు వెంకటరావు 3,565 3,604

పలాస త్రినాథ్‌బాబు మజ్జి 1,064 2,762

నరసన్నపేట మంత్రి నరసింహమూర్తి 2,225 3,300

శ్రీకాకుళం అంబటి కృష్ణారావు 4,353 3,373

టెక్కలి కిల్లి కృపారాణి 2,684 7,342

----------------------------------------------------------------------------------------------

మొత్తం 20,616 31,007

----------------------------------------------------------------------------------------------

Updated Date - Jun 07 , 2024 | 11:25 PM