Share News

సర్వం సిద్ధం

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:30 AM

శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలకు సర్వం సిద్ధమయ్యింది. మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఎల్‌.ఎన్‌.పేట మండలం మిరియాపల్లి వద్ద వంశధార నదిలో సోమవారం జరిగే స్వామివారి చక్రతీర్థ స్నానాల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు.

సర్వం సిద్ధం
చక్రతీర్థ స్నానాలకు వంశధారనది మిరియాపల్లి రేవులో ఏర్పాటు చేసిన బారికేడ్లు

- నేడు శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థం

- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

- 300 మంది పోలీసులతో బందోబస్తు

జలుమూరు/ఎల్‌.ఎన్‌.పేట, మార్చి 10: శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలకు సర్వం సిద్ధమయ్యింది. మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఎల్‌.ఎన్‌.పేట మండలం మిరియాపల్లి వద్ద వంశధార నదిలో సోమవారం జరిగే స్వామివారి చక్రతీర్థ స్నానాల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు. సోమవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. పాడ్యమి గడియలు తగలుగానే మధ్యాహ్నం 12 గంటలకు ఆలయంలోని పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ బయటకు తెచ్చి నంది వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. మిరియాపల్లి వద్ద వంశధార నదికి చేరుకుంటారు. అక్కడ మిరియాపల్లి గ్రామస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం వంశధారలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలకు చక్రతీర్థ స్థానాలు చేస్తారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టెక్కలి డీఎస్పీ బాలచంద్రరెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. 300 మంది పోలీసులతో పాటు 3 రోప్‌ పార్టీలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మిరియాపల్లి రేవులో బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అదనపు బస్సులు నడుపుతున్నట్లు శ్రీకాకుళం 2వ డిపో మేనేజరు శర్మ తెలిపారు. శ్రీకాకుళం నుంచి శ్రీముఖలింగం తిరిగే 6 సర్వీసులతో పాటు అదనంగా మరో 4 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అలాగే టెక్కలి నుంచి 3 బస్సులు వేసినట్లు చెప్పారు. ఇప్పటికే సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీముఖలింగం చేరుకున్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:30 AM