Share News

అందరివాడు.. రామ్మోహన్‌నాయుడు

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:08 AM

రాజకీయాలకు అతీతంగా ప్రజాసమస్యలపై పార్లమెంట్‌ ప్రస్తావించి.. వాటికి పరిష్కారం మార్గం చూపుతూ.. తండ్రికి తగ్గ తనయుడిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక గుర్తింపు పొందారు.

అందరివాడు.. రామ్మోహన్‌నాయుడు
ఎంపీ రామ్మోన్‌నాయుడు

- పార్టీలకు అతీతంగా ప్రజాభిమానం

- ఈసారి 36,754 క్రాస్‌ఓట్లు లభ్యం

మెళియాపుట్టి, జూన్‌ 6: రాజకీయాలకు అతీతంగా ప్రజాసమస్యలపై పార్లమెంట్‌ ప్రస్తావించి.. వాటికి పరిష్కారం మార్గం చూపుతూ.. తండ్రికి తగ్గ తనయుడిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక గుర్తింపు పొందారు. అందుకే ఓటర్లు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఎన్నికల్లోనూ ఆయనపై అభిమానం చూపుతూ.. వరుసగా మూడుసార్లు గెలిపించారు. వైసీపీ ఓటర్లు సైతం క్రాస్‌ఓట్లతో ఆయనపై అభిమానం చూపడంతో మరింత మెజార్టీకి దోహదపడుతున్నారు.

- దివంగత నేత ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణం తర్వాత.. రామ్మోహన్‌నాయుడు రాజకీయ ఆరంగేట్రం చేశారు. తొలిసారిగా 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై విజయం సాధించారు. అప్పట్లో రామ్మోహన్‌నాయుడుకు 5,56,545 ఓట్లు రాగా.. రెడ్డి శాంతికి 4,28,853 ఓట్లు వచ్చాయి. రామ్మోహన్‌నాయుడుకు 1,27,692 ఓట్ల మెజార్టీతో లభించింది.

- 2019 ఎన్నికల్లో మరోసారి ఎంపీ రామ్మోహన్‌నాయుడు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రామ్మోహన్‌నాయుడుకు 5,34,544 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు 5,27,891 ఓట్లు పడ్డాయి. రామ్మోహన్‌నాయుడు 6,653 మెజార్టీ లభించింది. గత ఎన్నికల్లో వైసీపీ ఒక్కచాన్స్‌ హవా నడిచింది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టెక్కలి, ఇచ్ఛాపురం మినహా.. మిగిలిన ఎనిమిది చోట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు. ఆ హవాలోనూ.. క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్‌నాయుడుకు 6,653ఓట్ల మెజార్టీ సాధించడం.. ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటిచెప్పిది.

- ఈ సారి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రామ్మోహన్‌నాయుడు 3,14,107 ఓట్ల మెజార్టీతో హాట్రిక్‌ విజయం దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు 7,34,501 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌కు 4,20,394 ఓట్లు పడ్డాయి. ఈసారి కూడా ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు 36,754 క్రాస్‌ ఓట్లు పడడం.. అనూహ్య మెజార్టీ రావడంతో ప్రజల్లో ఆయనపై తరగని అభిమానాన్ని నిరూపించింది.

Updated Date - Jun 07 , 2024 | 12:08 AM