Share News

తాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోండి: కలెక్టర్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:57 PM

వేసవిలో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా సంబంధిత అధికారు లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు.

తాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోండి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌: వేసవిలో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా సంబంధిత అధికారు లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. శుక్రవా రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజినీ రింగ్‌ అధికారులతో తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ పనులు, విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రణస్థలం, ఎచ్చెర్ల, ఇచ్చాపురం మండలాల పరిధిలో భూగర్భ జలాల లభ్యతపై ఆరా తీశారు. నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని, గ్రామీణ, పట్టణ తేడా లేకుండా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద పెంచిన వేతనం రూ.300తో వేతనదారుకు ఏడాదికి 100 పనిదినాలు కల్పించాలని, జిల్లాలోని 1.82లక్షల మందికి లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలకు టెంట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తాగునీటిని అందుబాటులో ఉంచాలని, ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. వేసవిలో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుందని, డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్తుశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో డి.వెంకటేశ్వరరావు, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, డీపీవో వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ చిట్టిరాజు, వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ డోల తిరుమల రావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఇంజినీర్‌ పొగిరి సుగుణాకరరావు, ఆయా మండలాల నుంచి ఎంపీడీవోలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి

కలెక్టరేట్‌: తొలి విడత ఈవీఎం ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్దేశిత వెబ్‌సైట్‌లో పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిథుల సమక్షంలో ఈ ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు. డీఆర్వో ఎం.గణపతిరావు, ఈవీఎంల నోడల్‌ అధికారి, జిల్లా ఉపాధికల్పనా అధికారి కె.సుధ, సర్వశిక్ష అభియాన్‌ ఏపీసీ జయప్రకాష్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 11:57 PM