Share News

ఐటీఐతో ఉపాధి

ABN , Publish Date - May 19 , 2024 | 12:02 AM

ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్ధ)లో చేరితే తక్కువ సమయంలో ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యి. పాలిటెక్నిక్‌, వృత్తి విద్యా కోర్సులు అందుబాటులోకి వచ్చినా ఐటీఐకి ఏ మాత్రం డిమాండ్‌ తగ్గలేదు.

ఐటీఐతో ఉపాధి
ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐ

- ఆసక్తి చూపిస్తున్న యువత

- వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

(ఎచ్చెర్ల)

ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్ధ)లో చేరితే తక్కువ సమయంలో ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యి. పాలిటెక్నిక్‌, వృత్తి విద్యా కోర్సులు అందుబాటులోకి వచ్చినా ఐటీఐకి ఏ మాత్రం డిమాండ్‌ తగ్గలేదు. గత ద శాబ్దం కాలంగా ఐటీఐలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఐటీఐ పూర్తయిన తర్వాత నేరుగా పా లిటెక్నిక్‌ డిప్లమో రెండో సంవత్సరంలో చేరే అవకాశం కూడా ఉంది. ఐటీఐ పాసైతే వివిధ సంస్థల్లో, పరిశ్రమ ల్లో ఉద్యోగాలు పొందే వీలుంది. ఈ కారణంగా ఐటీఐ చదివేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు.

పెరిగిన గిరాకీ

మూడు, నాలుగు దశాబ్దాల క్రితం ఐటీఐ సీటు దక్కించుకోవడమే చాలా కష్టంగా ఉండేది. గతంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు వచ్చిన విద్యార్థులు సైతం ఐటీఐ కోర్సులో చేరేవారు. శ్రీకాకుళం డీఎల్‌టీసీలో సీటు లభించలేదంటే బొబ్బిలి, విశాఖ వంటి సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లి ఐటీఐ కోర్సులో సీట్ల కోసం ప్రయత్నించేవారు. అలాంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. దశాబ్దం క్రితం ఐటీఐ కోర్సులకు బొత్తిగా డిమాండ్‌ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ క్రమేణా ఐటీఐ కోర్సులు పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన తర్వాత ఐటీఐ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం గ్యారెంటీ కావడంతో యువత ఇటు వైపుగా ముందుకు సాగుతున్నారు. దీంతో ఐటీఐ కోర్సులకు తిరిగి గిరాకీ ఏర్పడింది. వెల్డర్‌ మినహా మిగిలిన కోర్సులకు పదో తరగతి చదివిన వారు అర్హులు. వెల్డర్‌ కోర్సుకు ఏడో తరగతి ఉత్తీర్ణులై పదో తరగతి చదివితే సరిపోతుంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కోర్సుల్లో ప్రవేశం కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీలోగా ఐటీఐ డాట్‌ ఏపీ జీవోవీ డాట్‌ ఇన్‌ వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న అప్లికేషన్‌ను, ఒరిజనల్‌ సర్టిఫికేట్లను సమీపంలోని ఏదైనా ప్రభుత్వ ఐటీఐలో వచ్చే నెల 10వ తేదీలోగా వెరిఫికేషన్‌ చేయించుకుంటేనే అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌కు అర్హులవుతారు. ఐటీఐ చదివిన వారికి రైల్వేలో, ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీఈపీడీసీఎల్‌, ఆర్టీసీ, స్టీల్‌ప్లాంట్‌, షిప్‌యార్డ్‌, కెమికల్‌ పరిశ్రమలు, డిఫెన్స్‌, ఆర్టీసీ తదితర శాఖల్లో ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి.

జిల్లాలో ఐటీఐల వివరాలు

జిల్లాలో ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాసలో ప్రభుత్వ ఐటీఐలు, 20 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రభుత్వ ఐఐటీల్లో 720 సీట్లు, ప్రైవేటు ఐటీఐల్లో 3,056 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఫిట్టర్‌: ఐటీఐ కోర్సుల్లో ఫిట్టర్‌ ఎవర్‌ గ్రీన్‌ కోర్సు. ఇది రెండేళ్ల కోర్సు. ఇతర కోర్సులో సీట్లు ఖాళీగా ఉన్నా, ఈ కోర్సులో మాత్రం సీట్లు నిండిపోతాయి. ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉన్న కోర్సు ఇది. కౌన్సెలింగ్‌లో తొలి ఆప్షన్‌లో ఈ కోర్సునే ఎంచుకుంటారు.

ఎలక్ర్టికల్‌: ఈ కోర్సు కాల పరిమితి రెండేళ్లు. ఎలక్ర్టికల్‌ విభాగంతో సంబంధమున్న కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీఈపీడీసీఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశముంది. అలాగే ప్రైవేటు సెక్టార్‌లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు చాలా మంది మూడేళ్ల క్రితం కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ఎలక్ట్రీషియన్లుగా ఎంపికయ్యారు.

డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌: ఈ కోర్సు కాల పరిమితి రెండేళ్లు. నిర్మాణ రంగం లో వీరికి అవకాశాలు ఎక్కువ. వివిధ ప్రభుత్వ శాఖల్లో కూడా ఉద్యోగాలు పొందే అవకాశముంది. వివిధ కార్పొరేషన్‌ల్లో డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌ కోర్సు పూర్తిచేసిన వారు చేరి ప్రస్తుతం ఏఈలుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

మోటార్‌ మెకానిక్‌: ఈ కోర్సు కాలపరిమితి రెండేళ్లు. మోటార్‌ రంగంలో స్థిరపడేందుకు అవకాశముంటుంది. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందే వీలుంది. మోటారు రంగానికి రోజు రోజుకు ప్రాధాన్యం పెరుగుతోం ది. స్వయం ఉపాధి దిశగా ఈ రంగాన్ని ఎంచుకొని అద్భుతాలు సృష్టిం చినవారు ఉన్నారు.

ఇన్‌స్ర్టుమెంట్‌ మెకానిక్‌: ఈ కోర్సు కాలపరిమితి రెండేళ్లు. ఈ కోర్సు పూర్తయితే పరిశ్రమల్లో ఆటోమెషిన్‌ల వద్ద ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ కోర్సుకు డిమాండ్‌ బాగానే ఉంది.

కంప్యూటర్స్‌: ఈ కోర్సు కాలపరిమితి ఏడాది. పదో తరగతి చదివిన అభ్యర్థులు అర్హులు. ఏ రంగంలో రాణించాలన్నా కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాల్సిందే. కంప్యూటర్‌ ఆపరేటర్లుగా, హార్డవేర్‌ లో ఉద్యోగాలు పొందేందుకు వీలుంది.

డీజిల్‌ మెకానికల్‌: డీజిల్‌తో సంబంధము న్న అన్ని విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ గ్యారేజీల్లో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఈ కోర్సు కాల పరిమితి ఏడాది మాత్రమే.

కటింగ్‌ అండ్‌ టైలరింగ్‌: ఈ కోర్సు కాల పరిమితి ఏడాది మాత్ర మే. మహిళలకు సంబంధించిన కోర్సు ఇది. కటింగ్‌, టైలరింగ్‌కు సం బంధించి తర్ఫీదు ఇస్తారు. శ్రీకాకుళం డీఎల్‌టీసీలో ఈ కోర్సు ఉంది.

వెల్డర్‌: ఏడో తరగతి ఉత్తీర్ణులై పదో తరగతి చదివిన అభ్య ర్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. అన్ని పరిశ్రమల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఏడాది కోర్సు ఇది. వెల్డర్‌ కోర్సు చదివిన వారు అరబ్‌ దేశాల్లో ఉద్యోగాలు పొందే వీలుంది.

ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌: ఈ కోర్సు కాలపరిమితి రెండేళ్లు టీవీలు, సెల్‌ఫోన్లు రిఫైర్‌ చేయడంలో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులో ప్రావీణ్యం పొందితే సొంతంగా తన కాళ్లపై నిలబడడటమే కాకుం డా మరికొంతమందికి ఉపాధి కల్పించవచ్చు.

బ్రిడ్జి కోర్సు ద్వారా పైచదువులు

ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు బ్రిడ్జి కోర్సు ద్వారా పై చదువులు కొనసాగించవచ్చు. బ్రిడ్జి కోర్సు పూర్తిచేసిన తర్వాత ప్రవేశ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు.

స్కాలర్‌షిప్‌ సౌకర్యం

ఐటీఐలో ప్రవేశం పొందే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సౌకర్యం పొందే వీలుంది. రెండేళ్లు, ఏడాది కాలపరిమితిలో కూడిన ఐటీఐ కోర్సుల్లో ఉచితంగా ప్రవేశం పొందవచ్చు. పదో తరగతి మార్కులు, రిజ ర్వేషన్‌ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

కౌన్సెలింగ్‌ ద్వారానే..

పదో తరగతి మార్కుల ప్రాతిపదికన రూపొందించిన మెరిట్‌ లిస్ట్‌ ప్రాప్తికి నిర్థేశించిన తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తాం. ఐటీఐ కోర్సులు చదివిన అభ్యర్థులు తక్కువ సమయంలోనే ఉద్యోగాలు పొందే వీలుంది. ఐటీఐ చదివిన వారికి పరిశ్రమల్లో ప్రాధాన్యం ఉంటుంది. విదేశాల్లో కూడా ఐటీఐ అభ్యర్థులకు డిమాండ్‌ ఉంది. పరిశ్రమలకు అనుగుణంగా ఐటీఐల్లో శిక్షణ ఇస్తుండడంతో నాణ్యమైన సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. శిక్షణ అనంతరం అప్రంటీస్‌ మేళాలు, మెగా జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం.

- ఎల్‌.సుధాకరరావు, జిల్లా కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ ఐటీఐ, ఎచ్చెర్ల

Updated Date - May 19 , 2024 | 12:02 AM