ఎక్కడకెళ్లినా ఎన్నికల చర్చలే
ABN , Publish Date - May 12 , 2024 | 12:04 AM
ఎన్నికల ఫీవర్ జనాలకు పట్టుకుంది. ఎక్కడకెళ్లినా, ఎవరి నోట విన్నా ఎన్నికల చర్చలే కనిపిస్తోన్నాయి.

మెళియాపుట్టి: ఎన్నికల ఫీవర్ జనాలకు పట్టుకుంది. ఎక్కడకెళ్లినా, ఎవరి నోట విన్నా ఎన్నికల చర్చలే కనిపిస్తోన్నాయి. గ్రామాలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, సెలూన్ షాపులు.. ఇలా ఎక్కడ చూసినా రాజకీయంపైనే చర్చ జరుగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. ఈ నియోజకవర్గంలో ఎవరిది విజయం, ఎంత మెజార్టీ వస్తుందంటూ చర్చించుకోవడం కనిపిస్తోంది.
నమ్మకస్తులకే డబ్బు పంపిణీ బాధ్యత
మెళియాపుట్టి: జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ మహిళా అభ్యర్థికి చెందిన డబ్బులు రూ.80 లక్షలు ఐదు రోజుల క్రితం ఓ నాయకుడి వద్ద ఉంచినట్లు సమాచారం. రెండు రోజుల తరువాత ఓటర్లకు పంచేందుకు ఆ డబ్బులను ఆమె అడిగితే దొంగలు పట్టుకొని పోయారని చెప్పడంతో ఆ నేత ఖంగుతిన్నట్లు తెలిసింది. దీంతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేక, ఎవరికి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ నేత మరోసారి మోసానికి గురికాకుండా ఉండేందుకు తనకు అత్యంత నమ్మకస్తులైన వారికి ఓటర్లకు డబ్బుల పంపిణీ బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. నాలుగు ప్రాంతాల్లో నలుగురి వద్ద డబ్బులను నిల్వచేసి ఆ తాళాలు మాత్రం తన వద్దే ఉంచుకున్నట్లు వినికిడి. ఈ పరిస్థితి జిల్లాలోని మిగతా అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. శనివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. గత ఎన్నికల్లో ఎవరైతే నమ్మకంతో ప్రతి ఓటరుకు నగదు అందించారో అటువంటి నేతలకే ఈసారి కూడా ఆ బాధ్యతలను అభ్యర్థులు అప్పగిస్తోన్నారు. ఓటర్లందరికీ ఒకేలా కాకుండా కేటగిరీ వారిగా విభజించి నగదు పంచాలని వీరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీపై అభిమానంతో కచ్చితంగా తమకే ఓటు వేస్తారు.. డబ్బులిస్తేనే ఓటు వేస్తారు.. నగదు ఇచ్చినా ప్రత్యర్థి పార్టీకే ఓటు వేస్తారు.. ఇలా మూడు రకాలుగా ఓటర్లను విభజించి డబ్బులు పంచాలని చూస్తున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
గెలుపు భారం దేవుడిదే
మెళియాపుట్టి: కొందరు అభ్యర్థులు తన గెలుపు భారాన్ని దేవుళ్లపై వేశారు. తనను గెలిపించాలని దేవుళ్లను ప్రార్థించి ముడుపులు కట్టుతున్నట్లు తెలుస్తోంది. గెలిచిన తర్వాత మీ సన్నిధికి వచ్చి ముడుపులు చెల్లిస్తానని పూజలు చేస్తుండడం కనిపిస్తుంది. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా దేవుళ్లను మొక్కడం కనిపిస్తుంది. కాగా, సోమవారం పోలింగ్ అనంతరం జూన్ 4న వెలువడే ఫలితాల వరకు తమకు టెన్షన్ తప్పదంటూ అభ్యర్థులు చెబుతున్నారు. ప్రచారంలో తమకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని, ఫలితాలు అనుకూలంగా ఉంటాయని ఒకవైపు చెబుతున్నా లోలోపల వారిలో టెన్షన్ కనిపిస్తోంది.
పేరు వలంటీర్లది.. డబ్బులు ఆ నాయకుడికి!
మెళియాపుట్టి: నియోజకవర్గ కేంద్రం పాతపట్నంలో అధికార పార్టీకి అనుకూలంగా రాజీనామాలు చేసి వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్న గ్రామ వలంటీర్లకు ఓ నేత సున్నాం రాశాడనే ప్రచారం జరుగుతోంది. రాజీనామాలు చేసి పోలింగ్ ఏజెంట్లగా ఉంటే ఒక్కొక్కరికి రూ.10 వేలు నుంచి రూ.20 వేలు వరకు అందిస్తామని ఆ నేత వలంటీర్లకు ఆశ చూపాడు. దీంతో చాలామంది వలంటీర్లు రాజీనామా చేశారు. వీరికి ఇస్తామన్నా డబ్బులను సదరు నాయకుడు అభ్యర్థి నుంచి తీసువెళ్లినట్లు తెలుస్తోంది. కానీ, ఆ నగదు మాత్రం వలంటీర్లకు అందలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎవరైనా అడిగతే ‘నేనే మీకు వలంటీర్లగా వేయించాను. పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ మీకే వలంటీర్లగా అవకాశం ఇస్తా. అంతేగానీ డబ్బులు మాట మాత్ర ఎత్తొద్దు’ అంటూ తేల్చిచెబుతుండడంతో ఏం చేయాలో వలంటీర్లకు తోచడం లేదు. తమను మోసం చేసిన నాయకుడికి ఓటు ద్వారా సమాధానం చెప్పేందుకు వలంటీర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది.