Share News

అయ్యో.. ఎచ్చెర్ల

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:21 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎచ్చెర్ల నియోజకవర్గమంతా సమస్యలమయమే. ఓ వైపు నారాయణపురం, తోటపల్లి కాలువలున్నా రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పవు. మరోవైపు పరిశ్రమలు ఉన్నా స్థానికులకు ఉపాధి కరువే.

అయ్యో.. ఎచ్చెర్ల
నీరు లేక అధ్వానంగా తోటపల్లి కాలువ

- అభివృద్ధికి ఆమడ దూరం

- నియోజకవర్గమంతటా సమస్యలే

- ప్రతి మండలంలోనూ ప్రజలకు అవస్థలే

- పరిశ్రమలు ఉన్నా.. స్థానికులకు ఉపాధి కరువే

- కాలువలున్నా సాగునీటికీ ఇబ్బందులే

- అమలుకాని వైసీపీ ఎన్నికల హామీలు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఆ నియోజకవర్గం జిల్లాలో ప్రత్యేకం. సిక్కోలులో ఉన్నా.. లోక్‌సభ నియోజకవర్గం మాత్రం పక్క జిల్లా విజయనగరం పరిధిలోకి వస్తుంది. మరోవైపు పారిశ్రామిక వాడ నియోజకవర్గంగా ప్రసిద్ధి చెందింది. భారీ పరిశ్రమలు, కార్పొరేట్‌ కంపెనీలు ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఉన్నాయి. కాగా.. ప్రగతి మాత్రం ఆశించినస్థాయిలో లేదు. ఇదీ జిల్లా ముఖద్వారమైన ఎచ్చెర్ల నియోజకవర్గ దుస్థితి. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ నియోజకవర్గమంతా సమస్యలమయమే. ఓ వైపు నారాయణపురం, తోటపల్లి కాలువలున్నా రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పవు. మరోవైపు పరిశ్రమలు ఉన్నా స్థానికులకు ఉపాధి కరువే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పరిశ్రమలోనూ స్థానికులకు 75 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని జీవో తెచ్చారు. కానీ, ఆ జీవో మాత్రం అమలైన దాఖలాలు లేవు. గత ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి చేసే నాయకుడినే ఎన్నుకోవాలని నియోజకవర్గ ప్రజలంతా భావిస్తున్నారు. వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

ఎచ్చెర్ల మండలం...

- నియోజకవర్గంలో సమస్యలను పరిశీలిస్తే.. ఎచ్చెర్ల మండలలో ప్రధాన సాగునీటి వనరు నారాయణపురం కుడికాలువ ఉంది. ఈ కాలువకు దశాబ్దాలుగా ఆధునికీకరణ పనులు చేపట్టలేదు. వైసీపీ ప్రభుత్వం కాలువ నిర్వహణకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.

- తమ్మినాయుడుపేట, పొన్నాడ గ్రామాలు నాగావళి నదికి ఆనుకుని ఉన్నాయి. వరదల సమయంలో ఈ గ్రామాల్లోని భూములు తరచూ కోతకు గురవుతున్నాయి. కరకట్టలు నిర్మిస్తామని పలు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదు.

- తోటపాలెం నుంచి కొత్తపేట మీదుగా సంతసీతారాంపురం వెళ్లే రహదారిలో పెద్దపెద్ద గోతులు ఏర్పడి అధ్వానంగా మారింది. ప్రజలు రాకపోకలు చేసేందుకు నరకయాతన పడుతున్నారు.

- నాగావళి నదిపై 1959-1963లో బూర్జ మండలం నారాయణపురం, సంతకవిటి మండలం రంగరాయపురం గ్రామాల మధ్య నారాయణపురం ఆనకట్టను నిర్మించారు. ఇందులో భాగంగా ఎచ్చెర్ల మండలం వరకు కాలువను తవ్వారు. దుప్పలవలస గ్రామానికి వెళ్లే దారిలో నారాయణపురం కాలువకు ఓ వంతెన నిర్మించారు. అప్పట్లో అతి కొద్దిమంది మాత్రమే ఈ వంతెనపై రాకపోకలు సాగించేవారు. నేడు ఈ వంతెన ఆవశ్యకత బాగా పెరిగింది. దుప్పలవలస, అర్బన్‌హౌసింగ్‌, డోలవానిపేట, బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. అర్బన్‌ హౌసింగ్‌లో ఐదారు వందల మంది ప్రజలు ఉన్నారు. డోలవానిపేట, దుప్పలవలస ప్రజలు కూడా ఈ వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

లావేరు మండలం...

- లావేరు మండలం బుడుమూరులోని నారాయణసాగరం పెద్ద చెరువును మినీ జలాశయంగా అభివృద్ధి చేస్తే మండల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేతలు ప్రతిసారీ హామీలు ఇస్తున్నారే తప్ప పనుల్లో కదలిక లేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సైతం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

- లావేరు మండలం బుడుమూరు పెద్దగెడ్డపై అదపాక, గుర్రాలపాలెం గ్రామాల మధ్య నేతేరు, లక్ష్మీపురం గ్రామాల సమీపంలో ఉన్న కాజ్‌వేలు శిథిలమయ్యాయి. దీంతో వీటి మీదుగా రాకపోకలు సాగించేందుకు ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి స్థానాల్లో వంతెనలు నిర్మించాల్సి ఉన్నా నేతలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

- లావేరు మండలం వేణుగోపాలపురం, నాగంపాలెం, తాళ్లవలస, గుమ్మడాం, రణస్థలం తదితర గ్రామాలకు వెళ్లే మట్టిరోడ్డులు అధ్వానంగా మారడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వీటిని బీటీ రోడ్డులుగా మారుస్తామని ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నీటి మీద రాతల్లా మారాయి. కనీసం కంకర సైతం వేయలేదు.

రణస్థలం మండలం...

- తోటపల్లి ప్రాజెక్టు ద్వారా మండలంలోని ఆయకట్టు మొత్తానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కనీసం చర్యలు చేపట్టలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన సాగునీరు సైతం ప్రస్తుతం పొలాలకు అందడం లేదు.

- రణస్థలం మండలంలోని పరిశ్రమల్లో అర్హులైన స్థానిక యువకులకు ఉద్యోగాలిప్పిస్తామని పరిశ్రమల ఏర్పాటు సమయంలో కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఒక్కరికీ ఉద్యోగమిచ్చిన దాఖలాలు లేవు. దీంతో స్థానిక యువత ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు సైతం ఈ విషయాన్ని కనీసం పట్టించుకోవడంలేదు.

- రణస్థలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. మండలంలోని యువత డిగ్రీ చదివేందుకు శ్రీకాకుళం నగరం, సమీప పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. పలువురు బాలికలు ఇంటర్‌ తర్వాత చదువుకు దూరమవుతున్నారు. కళాశాల ఏర్పాటు చేస్తే యువతకు ఉపయోగకరంగా ఉంటుంది.

జి.సిగడాం మండలం....

-జి.సిగడాం మండలంలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం కలగానే మిగులుతోంది. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బొత్స సత్యనారాయణ జి.సిగడాంలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసి వదిలేశారు. దీని నిర్మాణంపై మండల ప్రజలు ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. మండలంలో అగ్ని ప్రమాదాలు జరిగితే రాజాం, పొందూరు అగ్నిమాపక కేంద్రాలపై ఆధార పడాల్సి వస్తోంది.

- జి.సిగడాం మండలంలో మడ్డువలస, తోటపల్లి కాలువల ద్వారా సాగునీరు శివారు గ్రామాలకు అందడం లేదు. ఏటా రైతులు పంట నష్టపోవాల్సి వస్తోంది. మడ్డువలస, తోటపల్లి పిల్ల కాలువల ద్వారా మండలంలో బాతువ, గెడ్డకంచరాం, పెసాం, ఎందువ, నడిమివలస, సేతుభీమవరం, నిద్దాం, పాలకండ్యాం, వాడ్రంగి తదితర గ్రామాల్లో సుమారు 12వేల ఎకరాల వరకు పంటలు పండిస్తున్నారు. కాలువల నిర్మాణాలు పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు.

- జి.సిగడాం మండలంలో పెంట, నిద్దాం, ఎస్‌పీఆర్‌ పురం, నక్కపేట, గొలుసుపూడి తదితర గ్రామాల్లో రహదారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే రహదారుల మరమ్మతులకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినా ఇంతవరకు పట్టించుకోలేదు.

...................

ఐదేళ్లుగా సాగునీరు లేదు

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తోటపల్లి కాలువ నుంచి పుష్కలంగా నీరు వచ్చేది. ఏడాదికి మూడు పంటలు పండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదేళ్లుగా తోటపల్లి కాలువ ద్వారా సాగునీరందని దుస్థితి నెలకొంది. దీంతో పంటలు నష్టపోతున్నాం.

దన్నాన సత్తిబాబు, కొండములగాం, రణస్థలం

..............................

కాలవ పనులు పూర్తి కాలేదు

వైసీపీ పాలనలో రైతులు పూర్తిగా నష్టపోయారు. గతంలో తోటపల్లి నీరుతో రైతులు బాగా పంటలు పండించేవారు. ప్రస్తుతం చీపురుపల్లి వరకు వస్తున్న తోటపల్లి కాలువ నీరు రణస్థలం వరకు ఎందుకు రావడం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తోటపల్లి కాలువ పనులు పూర్తికాలేదు. శివారు ప్రాంతాలకు నీరు వెళ్లడం లేదు. తోటపల్లి నీరు వస్తే చెరువులు నిండేవి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి.

కెల్ల హేమంతుకుమార్‌, రణస్థలం

..............................

ఆధునికీకరణ పనులేవీ

టీడీపీ ప్రభుత్వ హయాంలో జైకా నిధులతో నారాయణపురం ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ పనులు పూర్తికాలేదు. దీంతో ఆయకట్ట రైతులకు కష్టాలు తప్పడంలేదు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా ఆధునికీకరణ పనులు 50 శాతం కూడా పూర్తికాలేదు.

- నక్క లక్ష్మణరావు, చినకొంగరాం, ఎచ్చెర్ల

..............................

సిబ్బంది లేక సమస్యలు

నారాయణపురం ఆనకట్ట ద్వారా సాగునీరు అందించే కింతలి సెక్షన్‌కు సిబ్బంది కూడా తగినంత లేరు. గతంలో కుశాలపురం పరిధిలో ఈ కార్యాలయం ఉండేది. సాగునీరు ముందుకు సాగేందుకు ప్రాధానంగా ఉండాల్సిన లస్కర్లను కూడా ప్రభుత్వం నియమించలేదు. కాలువ నిర్వహణ సరిగా లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉంది

- బాన్న వెంకటరావు, ధర్మవరం, ఎచ్చెర్ల

..............................

సాగునీరు అందక అవస్ధలు

తోటపల్లి కాలువ ద్వారా సాగునీరు అందక అవస్థలు పడుతున్నాం. గ్రామం పైనుంచి ప్రధాన కాలువ ఉన్నా.. పిల్ల కాలువలు లేక సాగునీరు అందడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. పిల్ల కాలువలు తవ్వించి సాగునీరు అందించాలి

- రెడ్డి నీలంనాయుడు, రైతు, బాతువ, జి.సిగడాం

............................

మదుములు ఏర్పాటు చేయాలి

తోటపల్లి ప్రధాన కాలువకు మదుములు ఏర్పాటు చేసి వాటి ద్వారా సాగునీటి చెరువులకు నీటిని మల్లించాలి. చెరువుల్లో లో నీటిని నిల్వ ఉంచటం వలన వర్షాభావ సమయంలో పంటలకు సాగునీరు అందుతుంది. తోటపల్లి కాలువ నుంచి నీరు రాకపోవటంతో పొట్ట దశలో పంటలు ఎండిపోయి.. నష్టపోతున్నాం.

- కూనుబిల్లి అప్పలనాయుడు, రైతు, బాతువ, జి.సిగడాం

Updated Date - Apr 20 , 2024 | 12:21 AM