Share News

చచ్చిపోతున్నా చలించరా?

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:02 AM

ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిత్యం ఏదోఒక చోట దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా వజ్రపుకొత్తూరు మండలంలో భల్లూకాలు విరుచుకుపడుతున్నాయి.

 చచ్చిపోతున్నా చలించరా?
ఆలయంలో సేదతీరుతున్న ఎలుగుబంటి

- నిత్యం ఎలుగుబంట్ల దాడులు

- ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు

- కానరాని నియంత్రణ చర్యలు

- భయంగొప్పిట్లో ఉద్దానం

(వజ్రపుకొత్తూరు)

ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిత్యం ఏదోఒక చోట దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా వజ్రపుకొత్తూరు మండలంలో భల్లూకాలు విరుచుకుపడుతున్నాయి. ఈ మండలంలోనే వందకుపైగా ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటి భారినపడి ఎందరో ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. దీంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకప్పుడు తీరప్రాంత గ్రామాల్లోని జీడి, మామిడి, కొబ్బరితోటల్లో ఎలుగుబంట్లు సంచరించేవి. ఇప్పుడు పొలాలు, పల్లపు ప్రాంతాల్లో కూడా సంచరిస్తున్నాయి. ఏదో ఒకచోట ఎలుగుబంట్లు కంట పడుతుండడంతో అవి ఎప్పుడు ఎలా దాడి చేస్తాయోమోనని ప్రజలు భీతిల్లుతున్నారు. ప్రస్తుతం జీడి, మామిడి పంటల సీజన్‌ కావడంతో తోటల్లో అవి మకాం వేసి దాడులు చేస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సిన అటవీశాఖాధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. తాము చచ్చిపోతున్నా చలించరా అని ప్రశ్నిస్తున్నారు. ఎలుగుబంట్లను సంరక్షణశాలకు పంపించేలా చర్యలు చేపడితే తమకు ఇటువంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.

ఘటనలు..

- 2018 జూన్‌ 11న సోంపేట మండలం ఎర్రముక్కాం, మందస మండలం దున్నూరు పరిసరాల్లో ఎలుగుబంటి మారణకాండ సృష్టించింది. తోటలో ఉన్న దంపతులిద్దరిపై దాడిచేసి చంపేసింది. మరో ఏడుగురిని గాయపరచింది.

- 2022 జూన్‌ 19న వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి చెందిన కడమటి కోదండరావు ఎలుగుబంటి దాడిలో మృతి చెందాడు.

-2022 జూన్‌ 20న వజ్రపుకొత్తూరులోని జీడి తోటలో పని చేస్తున్న ఆరుగురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.

- గతేడాది ఆగస్టులో ఇదే మండలం అక్కుపల్లిలో చొక్కల లోకనాథంపై భల్లూకం దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన నెల రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు.

- ఈ ఏడాది మార్చి 23న ఇదే మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లిలో ఎలుగుబంటి బీభత్సం సృష్టిం చింది. జీడితోటల్లో పనులకు వెళ్లిన రైతులపై దాడి చేసింది. ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

మానవ తప్పిదమే కారణం?

గతంలో ఎప్పుడో ఒకసారి ప్రజలకు ఎలుగుబంట్లు కనిపించేవి. ప్రస్తుతం నిత్యం ఏదో ఒక చోట భల్లూకాలు దర్శనమిస్తున్నాయి. జీడి, మామిడి తోటల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. కొన్నిసార్లు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. దీనికి కారణం మానవ తప్పిదమనే విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు కొండలు, తీరప్రాంతాల్లో ఉండే సరుగుడు తోటలు ఎలుగుబంట్లకు నివాస కేంద్రాలుగా ఉండేవి. అయితే, కొందరు చోటా నాయకులు ఈ కొండలను తవ్వి ఆక్రమించుకుంటుండగా, తీరప్రాంతాల్లో ఉన్న సరుగుడు తోటలను కొంతమంది రైతులు నరికేసి విక్రయించేస్తున్నారు. అలాగే గ్రామాలకు సమీపంలో ఉండే జీడి, మామిడి, కొబ్బరి తోటలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసి వాటిని ప్లాట్లగా మార్చేస్తున్నారు. దీంతో భల్లూకాలకు స్థావరాలు కరువై ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. దీనికి తోడు కొమ్మ చెట్లకు పెడుతున్న మందులను ఎలుగుబంట్లు తినేస్తుండడంతో అవి పిచ్చిగా మారి మనుషులపై దాడికి పాల్పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ఎలుగుబంట్ల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అటవీశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అవి ప్రజలపై దాడి చేసిన సమయంలో హడావుడి చేసి ఆ తరువాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలుగు బంట్లు గ్రామాలు, తోటల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అమ్మవారి ఆలయంలో భల్లూకం

పలాసరూరల్‌: మండలంలోని మామిడిపల్లి గ్రామంలో తూర్పు వైపున ఉన్న జీడితోటల్లోని అమ్మవారి ఆలయం వద్ద బుధవారం ఎలుగుబంటి సేదతీరుతూ కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. జీడిపిక్కల సీజను కావడంతో రైతులు అధికంగా పిక్కలు ఏరుతూ తోటల్లోనే కాలం గడుపుతున్నారు. ఇటీవల కాలంలో ఎలుగుబంట్ల సంచారంతో జీడి తోటల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఇప్పటివరకూ వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో భల్లూకాల సంచారం అధికంగా ఉండేది. ప్రస్తుతం పలాస మండలంలో కూడా ఈ జాడ కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడిగా జీడి తోటల్లోకి వెళ్లాలని, చేతిలో ఏమైనా ఆయుధాలు ఉంటేనే వెళ్లాలని రైతులకు గ్రామస్థులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్ప టికైనా అటవీ శాఖాధి కారులు స్పందించి ఎలుగు బంట్లు గ్రామాలు, తోటల్లోకి రాకుండా నియంత్రించాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:02 AM