Share News

సిరా చరిత్ర తెలుసా?

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:11 AM

ఓటు వేశారా? అంటే నోటితో సమాధానం చెప్పనవసరం లేదు. నేరేడు రంగులో ఉన్న సిరా గుర్తున్న వేలుని చూపిస్తే చాలు. సిరా చుక్కకు, ఓటుకు ఉన్న సంబంధం అటు వంటిది. ఈ సిరా వేస్తేనే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు గుర్తింపు ఉంటుంది. ఓటు వేసిన పౌరులకు ఆ సిరా ఎక్కడ తయారవుతోందోనన్న సందేహాలు ఉంటాయి.

సిరా చరిత్ర తెలుసా?

(నరసన్నపేట)

ఓటు వేశారా? అంటే నోటితో సమాధానం చెప్పనవసరం లేదు. నేరేడు రంగులో ఉన్న సిరా గుర్తున్న వేలుని చూపిస్తే చాలు. సిరా చుక్కకు, ఓటుకు ఉన్న సంబంధం అటు వంటిది. ఈ సిరా వేస్తేనే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు గుర్తింపు ఉంటుంది. ఓటు వేసిన పౌరులకు ఆ సిరా ఎక్కడ తయారవుతోందోనన్న సందేహాలు ఉంటాయి.

మైసూర్‌లో పరిశ్రమ..

కర్ణాటకలోని మైసూర్‌లో గల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోని రంగులు వార్నీష్‌ పరిశ్రమ ఎన్నికల సమయంలో చేతి వేలికి వినియోగించే సిరాను తయారుచేస్తోంది. దేశంలోని అన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జరిగే అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక్కడి నుంచే సిరా సరఫరా అవుతోంది. 1962 సార్వత్రిక ఎన్నికల నుంచి మైసూర్‌ పెయింట్స్‌ వార్నీష్‌ కర్మాగారం ఉత్పత్తిచేస్తున్న చెరిగిపోని సిరానే వినియోగిస్తున్నారు. ఈసారి కూడా అక్కడి నుంచే సిరాను సరఫరా చేయ నున్నారు.

తొలుత లక్క.. ఆ తర్వాత పెయింట్లు

1937లో అప్పటి మైసూర్‌ మహారాజు నాల్మడి కృష్ణరాజు వడయార్‌ ఈ సిరా తయారీ కర్మాగారాన్ని స్థాపించారు. అప్పటి దీని పేరు మైసూర్‌ లాక్‌ అండ్‌ పెయింట్స్‌వర్క్స్‌గా ఉండేది. 1989లో దీని పేరును మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నీస్‌ సంస్థగా మార్చారు. స్వాతంత్ర్యానికి ముందు వరకు మైసూర్‌ రాజులు స్వాధీనంలో ఉండేంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక్కడ తొలుత సీళ్లు వేసుందుకు కావాల్సిన లక్క తయారీకి ఈ పరిశ్రమను స్థాపించారు. చెట్ల నుంచి వచ్చే జిగురు తీసుకొచ్చి దానికి ఇతర అటవీ ఉత్పత్తులను కలిపి లక్కగా మార్చి రాజముద్రను వేసేందుకు మైసూరు రాజులు ఉపయోగించేవారు. జిగురు సరఫరా తగ్గిపోవడంతో లక్కకు బదులుగా చెట్ల పసరు ఆధారంగా పెయింట్ల తయారీని ప్రారంభించారు. 1962లో ఒక ఓటరు పలుమార్లు ఓటు వేయకుండా నిరోధించేందుకు చెరిగిపోని సిరాను ఉత్పత్తిచేయాలని కేంద్ర నిర్ణయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నేషనల్‌ ఫిజికల్‌ లాబోరేటరీస్‌ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కర్మాగారానికి అప్పగించారు.

ఈ సిరా ఎందుకు చెరగదంటే ..

మొదట్లో ఓటేసిన వ్యక్తికి ఎడమచేతి చూపుడు వేలిపై సిరా చుక్కను పెట్టేవారు. 2006 ఫిబ్రవరి నుంచి ఓటర్ల ఎడమ చేతి వేలి గోరుపై సిరాను గీతగా పెడుతున్నారు. సిరాలో 7.25 శాతం సిల్వర్‌ నైట్రేట్‌ ఉన్నందున వెంటనే చెరిగిపోదు. ఈ సిరా నేరేడు పండు రంగులో ఉంటుంది.

Updated Date - Apr 19 , 2024 | 12:11 AM