Share News

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:41 PM

అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహిస్తున్న సభ వద్దే.. ‘ఆంధ్రజ్యోతి’ స్టాఫ్‌ ఫొట్రోగాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ మూకల దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శ్రీకాకుళంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం భారీఎత్తున జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
శ్రీకాకుళంలో ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద ధర్నా చేస్తున్న జర్నలిస్టులు

- ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై దాడికి నిరసనగా పాత్రికేయుల ధర్నా

- జర్నలిస్టులూ ఓటర్లేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నినాదాలు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహిస్తున్న సభ వద్దే.. ‘ఆంధ్రజ్యోతి’ స్టాఫ్‌ ఫొట్రోగాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ మూకల దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శ్రీకాకుళంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం భారీఎత్తున జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ‘పత్రికాస్వేచ్ఛను హరించొద్దు’ అంటూ నినాదాలు చేశారు. ‘జర్నలిస్టులకూ కుటుంబాలుంటాయి.. వాళ్లూ ఓటర్లే అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాల’ంటూ నినదించారు. ఫొటోగ్రాఫర్‌పై దాడికి పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకుండానే దాడులకు పాల్పడుతున్న అధికారపార్టీ తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లి ధర్మారావు మాట్లాడుతూ జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడటంతో పత్రికా స్వేచ్ఛను హరించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ‘ఎందరో మహామహులు.. నియంతలు సైతం గద్దెనెక్కి దిగిపోయిన ఘటనలు గుర్తుతెచ్చుకోవాలి. యాజమాన్యాలను దృష్టిలో ఉంచుకుని సిబ్బందిపై దాడులకు పాల్పడటం సరికాదు. జర్నలిస్టులు సమాజానికి దిక్సూచిగా ఉన్నంతవరకు అధికార పార్టీ బెదిరింపులు ఏమీచేయలేవు’ అని ధర్మారావు స్పష్టం చేశారు. అనంతరం జర్నలిస్టులందరూ ప్రెస్‌క్లబ్‌ నుంచి గాంధీ పార్కు వద్దకు ప్లకార్డులతో ర్యాలీ చేశారు. అక్కడ గాంధీ విగ్రహానికి వినతిపత్రాని సమర్పించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరరావు, సామ్నా రాష్ట్రకార్యవర్గ సభ్యులు మల్ల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చైతన్య, సత్యనారాయణ, సీనియర్‌ జర్నలిస్టు నాగభూషణం, ఎలకా్ట్రనిక్‌ మీడియా అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావు, జిల్లా ప్రతినిధి నాయుడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌, టీవీ5, ఎన్టీవీ జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:41 PM