Share News

మళ్లీ ఐదేళ్లంట!

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:58 PM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శనివారం విడుదల చేసిన వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. గత ఎన్నికల ఇచ్చిన హామీలేవీ సక్రమంగా అమలుకాలేదు. కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ఐదేళ్లూ నిర్లక్ష్యం వహించారు. ప్రస్తుతం తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలోనూ పాత అంశాలే ప్రస్తావించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మళ్లీ ఐదేళ్లంట!
నత్తనడకన సాగుతున్న పోర్టు పనులు

- ప్రధాన ప్రాజెక్టుల పూర్తికి గడువు ఇదీ

- వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై పెదవివిరుపు

- గత హామీలకే దిక్కులేదని అసంతృప్తి

- ఎన్నికలముందు హడావుడిగా శంకుప్థాపనలు

- ఓట్ల కోసమేనంటున్న విపక్షాల నాయకులు

(టెక్కలి)

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శనివారం విడుదల చేసిన వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. గత ఎన్నికల ఇచ్చిన హామీలేవీ సక్రమంగా అమలుకాలేదు. కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ఐదేళ్లూ నిర్లక్ష్యం వహించారు. ప్రస్తుతం తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలోనూ పాత అంశాలే ప్రస్తావించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే.. జిల్లాకు సంబంధించి పోర్టు నిర్మాణం, ఫిష్షింగ్‌ హార్బర్‌, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌, కోల్డ్‌స్టోరేజ్‌ గొడౌన్‌లు, అగ్రీ టెస్టింగ్‌ ల్యాబ్‌లు వచ్చే ఐదేళ్లలో పూర్తిచేస్తామని జగన్‌ మేనిఫెస్టోలో వెల్లడించారు. ఇవన్నీ గతంలో ఇచ్చిన హామీలే కాగా.. ఏవీ సక్రమంగా అమలుకాలేదు. అలాగే ఆసరా, విద్యాదీవెన, అమ్మఒడి, చేయూత వంటి పథకాలకు బటన్‌ నొక్కి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పలువురు లబ్ధిదారులకు డబ్బులు అందలేదు. దీంతో తాజా మేనిఫెస్టోను కూడా ప్రజలు నమ్మేస్థితిలో లేరని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు అని చెబుతూ.. బూడిద రత్నాలుగా మార్చేసిందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. ఐదేళ్లలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని ఆరోపించారు. వైసీపీ మేనిఫెస్టోపై చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

- అందరికీ అందని ఆసరా :

జిల్లాలో సుమారు 38,804 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీటికి వైఎస్సార్‌ ఆసరా కింద సుమారు రూ.284కోట్లు చెల్లించేందుకు జనవరి 23న ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కారు. ఇప్పటివరకూ మూడు నెలలు కావస్తున్నా డ్వాక్రా మహిళలకు డబ్బులు జమకాలేదు. జిల్లాలో కొన్ని సంఘాలకు రుణమాఫీ కూడా జరగలేదు.

- అతీగతీ లేని ఫిషింగ్‌ హార్బర్‌ :

ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట ప్రాంతాల్లో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ ఏడాది కిందట వర్చువల్‌గా శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగడం లేదు. ‘బుడగట్లపాలెం వద్ద సుమారు 40 ఎకరాల్లో రూ.332కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తాం. రూ.786కోట్లు ద్వారా రోజుకు 26,100 మెట్రిక్‌టన్నుల చేపలవేట చేసి.. పదివేల మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామ’ని గతంలో వైసీపీ నేతలు ప్రకటించారు. కానీ ఫిషింగ్‌ హార్బర్‌ పూర్తికాలేదు. మంచినీళ్లపేట వద్ద మట్టిదిబ్బలతో వదిలేశారు.

- హామీలకు పరిమితమైన కోల్డ్‌స్టోరేజ్‌ :

జిల్లాలో 193 కిలోమీటర్ల తీరం ఉన్నా.. ఈ ఐదేళ్లలో కోల్డ్‌స్టోరేజ్‌ ఊసెత్తలేదు. ఈసారి అధికారంలోకి వస్తే కోల్డ్‌స్టోరేజ్‌ గోదాములు కడతామని మేనిఫెస్టోలో ప్రకటించడంపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. మత్స్యసంపద దళారీల పాలవుతుందే తప్ప.. తమకు ఉపాధి దక్కడం లేదని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. కొంతమంది వలసబాట పడుతున్నారు.

- నిరుపయోగంగా అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ :

సీఎం జగన్‌ గతేడాది జూలై 8న జిల్లాలో రెండోవిడత వైఎస్సార్‌ అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లో సాంకేతిక పరికరాలు, కెమికల్స్‌, గ్లాస్‌వేర్‌ సామగ్రి, ఫర్నీఛర్స్‌ వంటివి లేక దిష్టిబొమ్మలుగా దర్శనమిస్తున్నాయి. నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట ప్రాంతాల్లోని వైఎస్సార్‌ అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి పరీక్షలు చేయడానికి అవసరమైన సామగ్రి లేక నిరుపయోగంగా ఉన్నాయి.

- నత్తనడకన మూలపేట పోర్టు:

వచ్చే ఐదేళ్లలో పోర్టుల నిర్మాణం పూర్తిచేస్తామని జగన్‌ మేనిఫెస్టోలో వెల్లడించగా.. ఉన్నవాటికే దిక్కులేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో గతేడాది ఏప్రిల్‌ 19న పోర్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయగా.. ఇప్పటికి 30 శాతం పనులు కూడా పూర్తికాలేదు. సౌత్‌బ్రేక్‌ వాటర్‌కు సంబంధించిన పనులు ఇంకా 600 మీటర్లు పూర్తికావాల్సి ఉంది. ఇండోపాడ్స్‌ నిర్మాణాలు కూడా మరో 40వేల వరకు తయారు చేయాల్సి ఉంది. బెర్త్‌ నిర్మాణాలతోపాటు పోర్టుకు సంబంధించి రోడ్డు, రైలు మార్గాలు పూర్తికాలేదు. రైలు మార్గానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ, సుమారు 300 ఎకరాల సాల్ట్‌భూములకు సంబంధించి ల్యాండ్‌ అక్విజేషన్‌ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు.

Updated Date - Apr 27 , 2024 | 11:58 PM