Share News

రాజీనామా చేసి తప్పు చేశామా?

ABN , Publish Date - May 25 , 2024 | 11:57 PM

వార్డు, గ్రామ వలంటీర్లు ఐదేళ్ల పాటు ప్రజలకు సేవలందించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు గురై కొందరు రాజీనామాలు చేశారు. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు.

రాజీనామా చేసి తప్పు చేశామా?
ఇచ్ఛాపురం మునిసిపల్‌ కమిషనర్‌కు రాజీనామా పత్రాలు అందజేస్తున్న వార్డు వలంటీర్లు

-మదనపడుతున్న గ్రామ, వార్డు వలంటీర్లు

- ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటని బెంగ

- జిల్లా వ్యాప్తంగా 7,632 మంది రాజీనామా

ఇచ్ఛాపురం, మే 25: వార్డు, గ్రామ వలంటీర్లు ఐదేళ్ల పాటు ప్రజలకు సేవలందించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు గురై కొందరు రాజీనామాలు చేశారు. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అప్పుడు రాజీనామాలు చేసిన వలంటీర్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకు రాజీనామాలు చేశామా? అని బాధపడుతున్నారు. రాజీనామాలు చేసి తప్పు చేశామా అని మదన పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రాకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ ఆవేదన చెందుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ, వార్డు వలంటీర్లను నియమించింది. ఐదేళ్లపాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్‌ ఎన్నికల సమయం రాగానే వారితో రాజీనామాలు చేయించేందుకు ఆ పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చారు. రాజీ నామా చేసిన వారినే మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీర్లుగా తీసుకుంటామని మభ్యపెట్టారు. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ పార్టీకి సేవలందించాలనే తీరులో వీరి వ్యవహారం సాగింది. వైసీపీ నేతల ఒత్తిడి కారణంగా జిల్లా వ్యాప్తంగా 7,632మంది వలంటీర్లు రాజానామాలు చేశారు. వీరికి ప్రభుత్వం వేతనం ఇవ్వలేదు. నేతలు కూడా కొద్దిపాటి సొమ్ముతో సరిపెట్టారు. ఒక్కొక్క వలంటీరుకు రూ.5వేలు చొప్పున ఇచ్చి ప్రచారంలో వారి సేవలను వినియోగించుకున్నారు. రాజీనామా చేయని వలంటీర్లకు మాత్రం ప్రభుత్వం గత నెలతో పాటు ఈనెల వేతనం కూడా ఇచ్చింది. వీరు రూ.పది వేలు లబ్ధిపొందారు. ముందు ముందు ప్రభుత్వం వారి సేవలను కొనసాగించనుంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేలు వేతనం ఇస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించారు. దీంతో చాలామంది వలంటీర్లు పునరాలోచనలో పడ్డారు. అధికార పార్టీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా సరే రాజీనామాలు చేసేందుకు ముందుకు రాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే వీరంతా యధావిధిగా కొనసాగుతారు. వారికి రూ.పది వేలు గౌరవ వేతనం లభిస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు వినిపిస్తు న్నాయి. ఇప్పటికే కూటమిలో జోష్‌ పెరిగింది. చాలాచోట్ల అభ్యర్థులకు ముందస్తు శుభాకాంక్షలు చెప్పేవారి సంఖ్య కూడా పెరిగింది. మరోవైపు వైసీపీ అభ్యర్థుల శిబిరాలు, కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. వీరిని కలిసే నేతలు కూడా కరువయ్యారు. చాలా మంది ముఖం చాటేస్తూ తిరుగుతున్నారు. రాజీనామాలు చేసిన వలంటీర్లను పట్టించుకున్న వారే లేరు. దీంతో అనవసరంగా వైసీపీ నేతల మాటలను నమ్మి తాము బలిపశువులయ్యామని వారు మదనపడుతున్నారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో..

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 1,668మంది వలంటీర్లకు గాను 1,374మంది రాజీనామాలు చేశారు. ఇచ్ఛాపురం మున్సిపాల్టీ, మండల పరిధిలో 458మందికి 405మంది, కవిటి మండలంలో 399 మందికి 252 మంది, కంచిలి మండలంలో 354కు 277, సోంపేట మండలంలో 457కు 440 మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. అయితే, నియోజకవర్గంలో 294మంది వలంటీర్లు రాజీనామా చేయలేదు. వీరు రెండు నెలలకు గాను రూ.10వేలు గౌరవం వేతనం అందుకున్నారు. రాజీనామాలు వలంటీర్లకు మాత్రం రూపాయి కూడా అందలేదు. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు.

Updated Date - May 25 , 2024 | 11:57 PM