Share News

అప్పులుచేసి బటన్‌నొక్కుడు పాలన

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:46 PM

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కుతున్నామని చెప్పుకోవడానికే సీఎం జగన్‌ పాలన సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ అబద్దాలకోరు అని ఆరోపించారు.

అప్పులుచేసి బటన్‌నొక్కుడు పాలన
అచ్చెన్న సమక్షంలో టీడీపీలో పెద్దబాణాపురం సర్పంచ్‌ పైల ఇందిరమ్మ, రమేష్‌నాయుడు దంపతులు

- ముఖ్యమంత్రి జగన్‌ అబద్దాలకోరు

- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

నందిగాం, ఫిబ్రవరి 29: రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కుతున్నామని చెప్పుకోవడానికే సీఎం జగన్‌ పాలన సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ అబద్దాలకోరు అని ఆరోపించారు. గురువారం నందిగాం మండలం పెద్దబాణాపురంలో సర్పంచ్‌ పైల ఇందిరమ్మ, ఆమె భర్త రమేష్‌నాయుడుతో పాటు అనుచరులు అచ్చెన్న, ఎంపీ రామ్మోహన్‌నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే ఆనందపురం పంచాయతీ వార్డు సభ్యురాలు రోణంకి రూపావతి, కెల్లి నవీన్‌, ఆర్‌.నారాయణరావు తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘సంపద సృష్టించి ప్రజలకు పంచినప్పుడే నిజమైన నాయకుడు అవుతారు. వైసీపీ పాలన అంతా అప్పులమయం. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, స్వయం ఉపాధి అవకాశాలు కూడా లేవు. జగన్‌ పాలనపై అన్నివర్గాల ప్రజలు విసిగిపోయారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో జగన్‌ పర్యటించి హంద్రీ నీవా ప్రాజెక్టుకు బటన్‌ నొక్కి 24 గంటలు కాకముందే అక్కడ కాలువలో ఆటలు ఆడుకున్నారు. ఇదీ ఆయన పనితనానికి నిదర్శనం. సొంత చెల్లినే పట్టించుకోని జగన్‌.. ప్రజలకు ఏమి మేలు చేస్తారు?. ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి.. రానున్న ఎన్నికల్లో జగన్‌రెడ్డిని సాగనంపాలి’ అని పిలుపునిచ్చారు. టీడీపీ-జనసేన కూటమిని గెలిపిస్తే.. మేలైన పాలన అందిస్తామని తెలిపారు.

- ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ రైతులకు అండగా ఉన్న టీడీపీకి పట్టం కట్టాలని కోరారు. అచ్చెన్నను తిట్టినందుకు దువ్వాడకు టెక్కలి టిక్కెట్‌ ఇచ్చారని, ఇటువంటి వ్యక్తులు ప్రజల మేలు కోరేవారు కారన్నారు. గడిచిన ఐదేళ్లలో రైతులకు కన్నీరు రప్పించారని ఆరోపించారు. రాష్ట్రమంత్రి తప్పుల రాజు, ఆ పార్టీ నాయకులు శివారు ప్రాంతానికి సాగునీరు అందించలేక ప్రతిపక్షంపై తప్పులు నెట్టారని, ఇటువంటి వారికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు పి.అజయ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో టెక్కలి, కోటబొమ్మాళి పార్టీ అధ్యక్షులు బగాది శేషు, బోయిన రమేష్‌లు, టెక్కలి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి కణితి కిరణ్‌కుమార్‌, నాయకులు ఎం.బాలకృష్ణ, కె.హరివరప్రసాద్‌, టి.మహేష్‌, మదన్‌గౌడ్‌, కె.ప్రసాదరావు, హరిబాబు, ఎం.సింహాచలం, పి.జోగారావు, ఎస్‌.జానకిరాం, డి.సన్యాసిరావు, ఎం.మోహనరావు, జె.మోహనరావు, వి.విజయలక్ష్మి, రామకృష్ణ, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నందిగాం టీడీపీ కార్యాలయం ఆవరణలో పార్టీ పతాకాన్ని అచ్చెన్నాయుడుతో కలిసి ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆవిష్కరించారు.

Updated Date - Feb 29 , 2024 | 11:46 PM