Cyber crime : సైబర్ కేటుగాళ్లు
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:43 PM
Online fraud జిల్లాలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కొత్తదారుల్లో దోచుకుంటున్నారు. యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులకు లైకులు కొడితే ఎక్కువ మొత్తం డబ్బులు ఆఫర్ ఇస్తామని ప్రజలను నమ్మబలుకుతున్నారు.

జిల్లాలో పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు
సామాజిక మాధ్యమాల్లో లైక్‌ల పేరిట దోపిడీ
ఫోన్‌కాల్స్ ద్వారా బెదిరిస్తూ డబ్బుల డిమాండ్
ఓటీపీ నెంబరు చెబితే బ్యాంకు ఖాతా ఖాళీనే
పలాస, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి):
మూడేళ్ల కిందట.. కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ఓ రైతు వెళ్లాడు. ఆయనకు పిన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎలా నమోదు చేయాలో తెలియక అక్కడ ఉన్న అపరిచిత వ్యక్తికి ఏటీఎం కార్డు ఇచ్చి.. అందులో రూ.5వేలు తీయాలని కోరాడు. ఆ వ్యక్తి ఏటీఎం కార్డు పెట్టి.. నెంబర్లు నొక్కినట్టు నటించి అందులో డబ్బులు లేవని చెప్పాడు. దీంతో ఆ రైతు వెనుదిరిగాడు. అయితే ఆ ఏటీఎం కార్డును అపరిచిత వ్యక్తి తస్కరించి.. ఆయన చెప్పిన పిన్ నెంబర్ ఆధారంగా రూ.50వేల వరకూ విత్‌డ్రా చేశాడు. నాలుగు రోజులపాటు బ్యాంకులో ఉన్న నగదంతా ఖాళీ చేసేశాడు. ఆ రైతు బ్యాంకుకు వెళ్లి.. డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించగా బ్యాలెన్స్ లేదని సిబ్బంది చెప్పారు. దీంతో తాను ఏటీఎం కేంద్రం వద్ద మోసపోయానని తెలుసుకుని లబోదిబోమన్నాడు.
..................
రెండేళ్ల కిందట పలాస మండలానికి చెందిన ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.. తన ఉద్యోగ విరమణ సమయంలో బ్యాంకు ఖాతాలో జమైన రూ.5లక్షలను ఇంటి అవసరాలకు వినియోగించాలనుకున్నాడు. ఇంతలో ఓ అపరిచిత వ్యక్తి ఆయనకు ఫోన్ చేశాడు. ‘బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ డబ్బులు జాగ్రత్తగా వినియోగించండి’ అని హిందీలో చెప్పాడు. మీకు ఓటీపీ వస్తుందని.. వెంటనే ఆ నెంబర్ చెప్పాలని కోరారు. ఆ విధంగా రైల్వే ఉద్యోగి చేయగా.. పది నిమిషాల్లో ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు అంతా ఖాళీ అయిపోయింది. డబ్బులు తీసినట్లుగా సమాచారం రావడంతో ఆయనకు బ్యాంకుకు వెళ్లి పరిశీలించగా అప్పటికే నష్టం జరిగిపోయింది.
..................
ఇటీవల చిన్నబడాం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడుకి పోలీసు డ్రస్ వేసుకుని ఓ వ్యక్తి తొలుత వాట్సాప్‌లో వీడియో కాల్ చేశారు. తర్వాత నేరుగా ఫోన్‌లో సంభాషిస్తూ ‘మీ కుమారుడు సైబర్ నేరంలో ఇరుక్కున్నాడు. ఎటువంటి కేసు లేకుండా ఆయన్ను విడుదల చేయాలంటే రూ.2లక్షలు తక్షణమే మా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాల’ని డిమాండ్ చేశారు. దీంతో ఉపాధ్యాయుడు ఏమిచేయాలో తెలియక తక్షణమే స్నేహితుల అకౌంట్ల నుంచి నగదు తెప్పించుకుని వారికి బదిలీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత తన కుమారుడికి ఫోన్ చేయగా.. అలాంటిదేమీ లేదని చెప్పడంతో తాను మోసపోయినట్టు గుర్తించాడు. ఈ ఘటనపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
........
జిల్లాలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కొత్తదారుల్లో దోచుకుంటున్నారు. యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులకు లైకులు కొడితే ఎక్కువ మొత్తం డబ్బులు ఆఫర్ ఇస్తామని ప్రజలను నమ్మబలుకుతున్నారు. అక్కడ నుంచి కథ మొదలవుతుంది. తమతో పెట్టుబడులు పెడితే రెట్టింపు నగదు ఇస్తామని ఆశ చూపిస్తూ.. మొత్తం ఊడ్చుకుపోతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత మరిన్ని మోసాలు పెరిగాయి. దేశంలో ప్రతి నిమిషానికి 700 పైగా సైబర్‌నేరాలు జరుగుతున్నాయని సాక్షాత్తు కేంద్ర సైబర్ నేర నివృత్త సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. నిత్యం ఫోనుల్లో వివిధ భాషల్లో సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది?. దాని నుంచి ఎలా అప్రమత్తం కావాలో చెబుతున్నా నేరాలు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా చదువుకున్న వారే ఇటువంటి నేరాలకు బాధ్యులు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్‌లైన్ మోసాలు, గేమ్స్, స్టాక్‌ఎక్చేంజ్, ఆన్‌లైన్ షాపింగ్‌ల్లో ఎక్కువగా ఇటువంటి మోసాలు జరుగుతున్నాయనేది స్పష్టమవుతోంది. దీని నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జిల్లాలోను సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలోనైనా సైబర్ నేరాలు తగ్గుముఖం పడతాయో లేదోనని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంతోపాటు ఐటీ రంగ నిపుణులు కూడా సైబర్‌క్రైమ్ నివారణకు చర్యలు చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
సైబర్‌నేరాలు, గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ ఆదేశాల మేరకు సంకల్పం కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కు స్పందించే ముందు సమాచారాన్ని ధ్రువీకరించుకోండి. సామాజిక మాధ్యమాల్లో అనుమానిత లింక్‌లు క్లిక్ చేయవద్దు. నగదు లావాదేవీలను బ్యాంకుల ద్వారే నిర్థారించుకోవాలి. అనుమానిత కాల్స్, నెంబర్లపై తక్షణమే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. 1930 నెంబర్‌కు ఫోన్ చేస్తే తగు రక్షణ కల్పిస్తాం. అధిక రాబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కేవైసీని వ్యక్తిగతంగా, బ్యాంకుల ద్వారా మాత్రమే చేయాలి. వ్యక్తిగత, బ్యాంకు వివరాలు ఎవరితో పంచుకోవద్దు.
- వి.వెంకటఅప్పారావు, డీఎస్పీ, కాశీబుగ్గ