Share News

రేపే ఓట్ల లెక్కింపు

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:42 PM

సార్వత్రిక ఎన్నికల ముగిసే క్రతువులో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపే జరగనుంది. జిల్లాలో శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, ఎచ్చెర్ల, అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి గత నెల 13న పోలింగ్‌ నిర్వహించారు.

రేపే ఓట్ల లెక్కింపు
మాట్లాడుతున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- 1996 మంది సిబ్బందితో లెక్కింపు ప్రక్రియ

- నేటి నుంచి మూడు రోజులు మద్యం బంద్‌

- అంతటా యాక్ట్‌ 30, సెక్షన్‌ 144 అమలు

- పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్‌

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికల ముగిసే క్రతువులో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపే జరగనుంది. జిల్లాలో శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, ఎచ్చెర్ల, అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి గత నెల 13న పోలింగ్‌ నిర్వహించారు. 14,17,959 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే 25,826 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు. ఎచ్చెర్ల సమీపాన శివానీ కళాశాలలో స్ర్టాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసి.. ఈవీఎంలు భద్రపరిచారు. మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ల ఓట్లతో లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటల నుంచి ఈవీఎంల ద్వారా ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం 2.30గంటలకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం వెలువడనుండగా... అన్ని నియోజకవర్గ ఫలితాలు సాయంత్రం 4 గంటలకు స్పష్టమవుతుంది. ఈ మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో మీడియా సమావేశంలో ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.

- జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 8 ప్రత్యేక కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి 9 కౌంటింగ్‌ హాల్స్‌ను సిద్ధం చేశారు. ఈవీఎంల కోసం 112 టేబుల్స్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 29 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి 98 ఈవీఎంల టేబుళ్లు, 30 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మొత్తం 1996 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇందులో రిటర్నింగ్‌ అధికారులు 9మంది, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు 77 మంది, కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు 492 మంది, కౌంటింగ్‌ అసిస్టెంట్లు 582, మైక్రో అబ్జర్వర్లు 397 మంది, క్లాస్‌-4 ఉద్యోగులు 439 మందిని సిద్ధం చేశారు. మొత్తం కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలించేందుకు కీ అబ్జర్వర్‌లు 8 మందిని ఎన్నికల కమిషన్‌ నియమించింది.

- ఆమదాలవలస ఫలితం ముందుగా..

ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 19 రౌండ్లలో ఓట్లను ఈవీఎంలలో లెక్కించనున్నారు. ఇతర నియోజకవర్గాలకంటే ఆమదాలవలసలో తక్కువ పోలింగ్‌ స్టేషన్లు ఉండటంతో మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పూర్తి ఫలితం వెల్లడి కానుంది. పోలింగ్‌ స్టేషన్లు అధికంగా ఉన్న పాతపట్నం నియోజకవర్గం ఫలితాలు చివరాఖరున.. అంటే సుమారు 4 గంటలకు వెల్లడవుతుంది. మొత్తం 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉండటంతో పాతపట్నం ఫలితం ఆలస్యమవుతుంది. శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ ఫలితాలు అర్ధరాత్రి అయ్యే అవకాశముంది.

- ఫోన్‌లు తీసుకువెళ్లకూడదు..

ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు కౌంటింగ్‌ ప్రక్రియ వద్దకు అభ్యర్థులు, ఏజెంట్లు.. ఫోన్‌లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్‌లను.. తీసుకెళ్లరాదు. జిల్లా అంతటా 144 సెక్షన్‌తో పాటుగా, యాక్ట్‌ 30 అమల్లో ఉంటుంది. అలాగే ఏజెంట్లకు కచ్చితంగా బ్రీత్‌ఎనలైజర్‌తో పరీక్షించాకనే లోపలికి విడిచిపెడతారు. లెక్కింపు ప్రక్రియ వద్ద ఐదు మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు.

- ర్యాలీలు.. బాణసంచా సామగ్రి కాల్చివేత నిషేధం

బాణసంచా కాల్చివేత, విజయోత్సవ ర్యాలీలపై నిషేధముంది. గెలిచిన అభ్యర్థి వెంట పోలీసులు ఇంటివరకు వెళ్లి భద్రత కల్పిస్తారు. అలానే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు.. అలాగే జిల్లా వ్యాప్తంగా సీఎస్‌ఎఫ్‌, ఏపీఎస్‌పీ, సీఆర్పీఎఫ్‌ దళాలతోపాటు.. సివిల్‌ పోలీసుల ప్లటూన్‌తో జిల్లా ప్రజలకు మూడంచెల భద్రత.. పర్యవేక్షణ ఉంటుంది. రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద, నాయకుల వద్ద పికెటింగ్‌ ఉంటుంది. ప్రత్యేకంగా జిల్లాలో 16చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. లూజ్‌ పెట్రోల్‌ విక్రయాలు నిషేధం విధించారు. మద్యం విక్రయాలు నేటి నుంచి ఆరో తేదీ వరకు బంద్‌ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వివాదాలు జరగకుండా ముందస్తుగా 878 మంది బైండోవర్‌ చేశారు. సమస్యత్మక గ్రామాలు 212 గుర్తించి.. ఆ ప్రాంతాల్లో నిఘా మరింత పెంచారు.

సంయమనం పాటించాలి

శ్రీకాకుళం క్రైం, జూన్‌ 2: ‘ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రజలు సంయమనం పాటించాలి. ఎటువంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దు’ అని ఎస్పీ రాధిక కోరారు. విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా పేలుళ్లు, సభల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘ఈ నెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమల్లో ఉంది. రోడ్లపై నలుగురు కన్నా ఎక్కువ గుమిగూడి ఉన్నా చర్యలు తప్పవు. జిల్లాలో ముఖ్యకూడళ్లు, కౌంటింగ్‌ కేంద్రంలో 288 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేసి.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రతి నిమిషం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాం. కేంద్ర బలగాలు, సివిల్‌ పోలీసులు, ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌లతో మూడంచెల భధ్రత ఏర్పాటు చేశాం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేలా 1,459 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు సిద్ధం చేశాం. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామ’ని తెలిపారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం వేకువజామున 3 గంటల నుంచి బుధవారం ఉదయం వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించామని తెలిపారు. చిలకపాలెంలోని శివానీ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రానికి.. కౌంటింగ్‌ సిబ్బంది, అభ్యర్థులు హైవే మీదుగా కింతలి మిల్లు జంక్షన్‌ వద్ద సర్వీసు రోడ్డులోకి ప్రవేశించి.. అంబేడ్కర్‌ యూనివర్సిటీ మీదుగా చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్పీ డా.జి.ప్రేమ్‌కాజల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 11:42 PM