Share News

ఎన్నికలకు కౌంట్‌డౌన్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:02 AM

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. గురువారం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా.. ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తనుంది.

ఎన్నికలకు కౌంట్‌డౌన్‌

- నేడే నోటిఫికేషన్‌ జారీ

- ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ

- మే 13న పోలింగ్‌.. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు

- ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. గురువారం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా.. ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తనుంది. నామినేషన్లకు ఆయా అభ్యర్థులంతా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్‌తో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ నోటీఫికేషన్‌ విడుదల చేస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకుగాను నామినేషన్లు స్వీకరిస్తారు. పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్‌లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 25వ వరకు నామినేషన్లను స్వీకరించి.. 26న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29తో గడువు ముగుస్తుంది. వచ్చే నెల 13న పోలింగ్‌ నిర్వహించి.. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికే ఈవీఎంలు అన్ని నియోజకవర్గాలకు చేరిపోయాయి. అధికారులతో ప్రతిరోజు జిల్లా ఎన్నికల అధికారి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రచారంలో టీడీపీ ముందంజ

ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ వైసీపీ కన్నా.. టీడీపీ ముందంజలో ఉంది. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు వచ్చి వెళ్లారు. పలాసలో ప్రజాగళం పేరిట సభ నిర్వహించి.. వైసీపీ పాలనను తూర్పారబట్టారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపు ఆవశ్యకత.. రాష్ట్ర ప్రయోజనాల గురించి జిల్లా ప్రజలకు వివరించారు. మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి జగన్‌ జిల్లాకు వచ్చి.. ఇక్కడే బస్సుయాత్ర ముగించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఈనెలలోనే జిల్లాకు వస్తున్నట్లు సమాచారం.

Updated Date - Apr 18 , 2024 | 12:02 AM