Share News

కాపర్‌ చోరులు!

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:15 AM

పొలాల్లో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు చోరీకి గురవుతున్నాయి. ఏటా రబీలో పంట పొలాలకు సాగునీరు అందించేందుకు రైతులు మోటార్లు అమర్చుతుంటారు. అర్ధరాత్రి పొలాల్లో దొంగలు చొరబడి వాటిని అపహరిస్తున్నారు. విద్యుత్‌ వైర్లను తొలగించి.. అందులో కాపర్‌(రాగి) దొంగిలించి విక్రయిస్తున్నారు.

కాపర్‌ చోరులు!
ఉప్పువలస రైతుల పోలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్‌లో కాపర్‌ను చోరీ చేసిన దృశ్యం

- పొలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు మాయం

- అందులో రాగి వైరును పట్టుకుపోతున్న వైనం

- ప్రాణాంతకమని తెలిసినా బరితెగింపు

- ముఠాగా ఏర్పడి యథేచ్ఛగా దొంగతనాలు

(రణస్థలం)

- ఈ నెల 15న రణస్థలం మండలం రావాడ పంచాయతీ ఉప్పువలస పొలాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లలో విలువైన రాగి లోహం చోరీకి గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్‌ కనెక్షన్లు తొలగించి అందులో ఉన్న రాగి వైరును అపహరించుకుపోయారు. ట్రాన్స్‌ఫార్మర్లను సమీపంలోని బావిలో పడేశారు.

....................

- కొద్దిరోజుల కిందట రణస్థలం మండలం గోశాంలో సైతం అర్ధరాత్రి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను కిందకు దించారు. అందులోని విలువైన కాపర్‌ను దొంగిలించే ప్రయత్నం చేశారు. ఇంతలో రైతుల అలజడి గమనించి ట్రాన్స్‌ఫార్మర్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

.....................

- ఏడాది కిందట లావేరు మండలంలో వరుసగా దొంగలు రెచ్చిపోయారు. పొలాల్లో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను టార్గెట్‌ చేసి.. వాటిలో ఉన్న రాగిని దొంగిలించారు. దీనిపై పోలీసులు దృష్టిపెట్టినా ఫలితం లేకపోయింది.

.....................

- గతేడాది మందస మండలం భిన్నళ మదనాపురంలోని పొలాల్లో విద్యుత్‌ మోటార్లు చోరీకి గురయ్యాయి. మార్పు మధుసూదనరావు, మల్ల కృష్ణమూర్తి, మార్పు నాగేశ్వరరావుకు చెందిన మోటార్లు పొలాల్లో ఉండగా.. దొంగలు ఎత్తుకుపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.

.....................

...ఇలా పొలాల్లో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు చోరీకి గురవుతున్నాయి. ఏటా రబీలో పంట పొలాలకు సాగునీరు అందించేందుకు రైతులు మోటార్లు అమర్చుతుంటారు. అర్ధరాత్రి పొలాల్లో దొంగలు చొరబడి వాటిని అపహరిస్తున్నారు. విద్యుత్‌ వైర్లను తొలగించి.. అందులో కాపర్‌(రాగి) దొంగిలించి విక్రయిస్తున్నారు. చీకట్లో విద్యుత్‌ వైర్లను కట్‌చేయడం ప్రాణాంతకమని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం వ్యవసాయానికి తొమ్మిది గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా ఉంటోంది. అది కూడా రెండు విడతలుగా అందిస్తున్నారు. దీంతో రైతులు విద్యుత్‌ లేని సమయాల్లోనే పొలాల్లో ఉంటూ.. చోరీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో దొంగతనాలు జరిగినా.. కొన్నే వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా దుండగులు పొల్లాలోని పాత ట్రాన్స్‌ఫార్మర్లను టార్గెట్‌ చేస్తున్నారు. పదేళ్ల కిందట అమర్చిన ట్రాన్స్‌ఫార్మర్లు అయితే అందులో సుమారు 14కిలోల కాపర్‌ వస్తుంది. మార్కెట్‌లో కిలో కాపర్‌ ధర రూ.2,500 పలుకుతోంది. దీంతో ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌ చోరీ చేస్తే రూ.30వేలకు పైగా లబ్ధి పొందవచ్చు. ఈ కాపర్‌ను బరంపూర్‌, కటక్‌, జైపూర్‌ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. చోరీల నుంచి కాపర్‌ కొనుగోలు చేసే వ్యాపారుల వరకూ ఒక ముఠా నడుస్తున్నట్టు తెలుస్తోంది.

- రైతులకు ఇబ్బందులే

సాధారణంగా 25కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ విలువ రూ.4 లక్షలు ఉంటుంది. దానిలో కాపర్‌ విలువ రూ.70వేల వరకూ ఉంటుంది. కాపర్‌ చోరీ అవుతుండడంతో దానికన్నా తక్కువ ధరకు లభించే అల్యూమినియాన్ని విద్యుత్‌శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లలో అమర్చుతున్నారు. కాగా.. ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. దొంగలు విద్యుత్‌ వైర్లను ప్రమాదకరంగా కట్‌చేసి అలానే వదిలేస్తుండడంతో రైతులు పొరపాటున వాటిని తాకితే ప్రమాదాలు తప్పవు. అలాగే పదుల సంఖ్యలో రైతులు డబ్బులు వేసుకొని ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసుకున్న పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు రైతు సబ్సిడీ పోను రూ.80వేల వరకూ కట్టాల్సి వస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురైతే సాగునీటి ఇబ్బందులతో పాటు తమపై అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నారు.

ప్రమాదాలకు అవకాశం

పొలాల్లో వ్యవసాయ బోర్లకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్లు దొంగిలించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలో కొత్తది అమర్చేసరికి రోజులు పడతాయి. ఇంతలో పంటలు పూర్తిగా ఎండిపోతాయి. మరోవైపు విద్యుత్‌ వైర్లను కత్తిరించడంతో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. పోలీసులు నిఘా పెంచి కాపర్‌ చోరీలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాలి.

- ఎం.సూర్యనారాయణ, రైతు, ఉప్పువలస

..............................

రక్షణ ఏదీ?

అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నో విన్నపాలు ఇస్తే కానీ పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం లేదు. అటువంటి ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాపర్‌ కోసం మా ఉపాధిని దెబ్బతీస్తున్నారు. ప్రస్తుతం ఎండలు ముదరడంతో పంటలకు సాగునీరు అవసరం. ఇటువంటి సమయంలోనే దొంగతనాలకు పాల్పడడం బాధాకరం.

- నొడగల సోములు, రైతు, ఉప్పువలస

Updated Date - Feb 20 , 2024 | 12:15 AM