Share News

మావల్ల కానేకాదు!

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:05 AM

వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సొంత భవనాలు ఉండేలా ఉపాధిహామీ నిధులు మంజూరుచేసింది. ఇందులో భాగంగా అధికారపార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు.. ఆయా పంచాయతీల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీల ద్వారా తీసుకుని పనులు ప్రారంభించారు. ప్రభుత్వ తీరుతో ఇప్పుడు ఎందుకు చేపట్టామా? అంటూ ఈసురోమంటున్నారు.

మావల్ల కానేకాదు!
గార : శాలిహుండంలో శ్లాబువేసి నిలిచిన సచివాలయ నిర్మాణం

- 56 శాతం మాత్రమే ప్రభుత్వ భవనాలు పూర్తి

- 2019 నాటి ధరలతో పోల్చితే భారీగా పెరిగిన వ్యయం

- బిల్లుల మంజూరులోనూ ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం

- నష్టాన్ని భరించలేమంటూ చేతులెత్తేస్తున్న వైసీపీ నాయకులు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ప్రభుత్వ భవనాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. పంచాయతీల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణం కాంట్రాక్టు చేపడితే.. ప్రజల్లో గౌరవంతోపాటు డబ్బులు కూడా కాస్త మిగిలే అవకాశం ఉంటుందని అధికారపార్టీ మద్దతుదారులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు భావించారు. కానీ వారి ఆశలు అడియాశలై నష్టాలను చవిచూస్తున్నారు. ప్రభుత్వం 2019 నాటి ధరల ఆధారంగా నిధులు మంజూరు చేయగా.. ప్రస్తుతం నిర్మాణసామగ్రి వ్యయం పెరగడంతో పనులు చేపట్టడం తమ వల్ల కాదంటూ కొంతమంది చేతులెత్తేస్తున్నారు. బిల్లులు కూడా సకాలంలో మంజూరు కాకపోవడంతో నష్టాన్ని తాము భరించలేమంటూ స్పష్టం చేస్తున్నారు.

.........................

వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సొంత భవనాలు ఉండేలా ఉపాధిహామీ నిధులు మంజూరుచేసింది. ఇందులో భాగంగా అధికారపార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు.. ఆయా పంచాయతీల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీల ద్వారా తీసుకుని పనులు ప్రారంభించారు. ప్రభుత్వ తీరుతో ఇప్పుడు ఎందుకు చేపట్టామా? అంటూ ఈసురోమంటున్నారు. జిల్లాలో 602 సచివాలయ భవనాలు, 495 రైతుభరోసా కేంద్రాలు, 357 విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌లు.. మొత్తం 1,454 భవనాలు మంజూరయ్యాయి. ఇందుకుగాను సుమారు రూ.475 కోట్లు కేటాయించారు. రెండున్నరేళ్ల నుంచి భవనాల నిర్మాణం చేపడుతున్నా ప్రగతి అంతంతమాత్రంగానే ఉంది. ఎన్నికల కాలం సమీపిస్తుండడంతో.. ప్రభుత్వ ప్రాధాన్యం అంటూ అధికారులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేసినా ఇప్పటివరకూ 827 భవనాలు (56శాతం) మాత్రమే పూర్తయ్యాయి. సుమారు రూ.210కోట్ల వరకు బిల్లులు చెల్లించారు. చేపట్టిన పనులకు సంబంధించి రూ.18కోట్ల మేర బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. సకాలంలో బిల్లులు అందక.. పనులు పూర్తిచేయలేక స్థానిక అధికారపార్టీ నేతలు ఉసూరుమంటున్నారు. వివిధ దశల్లో ఉన్న 627 భవనాలు(44 శాతం) ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు ముగిశాక.. అప్పటి పరిస్థితి ఏమిటో అని అయోమయం చెందుతున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ‘నీరు-చెట్టు’ పనులకు సంబంధించిన బిల్లుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటూ కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు.

- ధరల్లో భారీ వ్యత్యాసం

వైసీపీ ప్రభుత్వం 2019లో అప్పటి ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ నాలుగేళ్లలో నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగాయని.. అప్పటి ధరలతో పోల్చితే భారీ వ్యత్యాసం ఉందని కాంట్రాక్టర్ల చెబుతున్నారు. 2019లో సిమెంట్‌ బస్తా రూ.175, మూడు యూనిట్ల చిప్స్‌(టిప్పర్‌ లారీ)రూ.4500, ఇసుక ట్రాక్టర్‌ రూ.1500, ఐరన్‌ టన్ను రూ.37,000, ఒక్కొక్కరికి రోజు కూలి రూ.300, మేస్త్రికి రోజుకూలీ రూ.400 ఉండేది. కరోనా వ్యాప్తి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం సిమెంట్‌ బస్తా రూ.420, మూడు యూనిట్ల చిప్స్‌ రూ. 15వేలు, ఇసుక రూ.5వేలు, ఐరన్‌ టన్ను రూ.82వేలు, రోజు కూలీ రూ.600, మేస్త్రికి రోజుకూలీ రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది. భారీ వ్యత్యాసంతో.. కనీసం మూడోవంతు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. దీనికితోడు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని మదనపడుతున్నారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారితే బిల్లుల విషయంలో తమ పరిస్థితి ఏంటని కలవరపడుతున్నారు. ఈ క్రమంలో పనులు పూర్తిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కాగా.. అధికార పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఈ పరిణామం ఇబ్బందికరంగా మారనుంది. దీనిపై ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం నోరువిప్పలేని పరిస్థితి నెలకొంది.

Updated Date - Jan 21 , 2024 | 12:05 AM