Share News

సమాజ సేవే.. సైన్స్‌ ధ్యేయం

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:50 PM

‘సమాజ సేవే సైన్స్‌ ధ్యేయం. సమాజంలో సమస్యలు గుర్తించి సాంకేతిక పరిష్కారాలు చూపడమే సైన్స్‌ లక్ష్యమ’ని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు అన్నారు.

సమాజ సేవే.. సైన్స్‌ ధ్యేయం
విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి

- జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు

- రాష్ట్రస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు మూడు ప్రాజెక్టుల ఎంపిక

టెక్కలి, ఫిబ్రవరి 28: ‘సమాజ సేవే సైన్స్‌ ధ్యేయం. సమాజంలో సమస్యలు గుర్తించి సాంకేతిక పరిష్కారాలు చూపడమే సైన్స్‌ లక్ష్యమ’ని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో ఐతమ్‌ అటల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజెస్‌, సమగ్రశిక్ష పాఠశాల విద్య ఎస్‌సీఈఆర్‌టీ, యూనిసెఫ్‌ విజ్ఞాన్‌ ఆశ్రమ్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఇన్‌స్పెయిర్‌ మనక్‌ అవార్డులను ప్రకటించారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు మూడు ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ‘పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బి.గాయత్రి, జశ్వంత్‌ పాత్రో, ఢిల్లేశ్వరరావులు తయారుచేసిన మహిళా రక్షణ-స్మార్ట్‌ స్టిక్‌ తయారీ ప్రథమ స్థానం సాధించింది. పాతపట్నం మోడల్‌స్కూల్‌కు చెందిన రోహిత్‌సాయి, ప్రీతిం, నితీష్‌ తయారుచేసిన ఒకే యంత్రంతో అనేక పనులు చేసే రోబోట్‌ ద్వితీయస్థానం దక్కించుకుంది. ఇప్పిలి జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాలకు చెందిన డి.నవీన్‌కుమార్‌, దివాకర్‌, వికాస్‌కుమార్‌లు రూపొందించిన ట్రాకింగ్‌ సోలార్‌ సిస్టమ్‌కు జిల్లాస్థాయిలో తృతీయ స్థానం పొందింది. వీరిని రాష్ట్రస్థాయి సైన్స్‌ పోటీలకు పంపనున్నాం. బాల్యం నుంచే సైన్స్‌పై విద్యార్థులు శ్రద్ధచూపేలా ఉపాధ్యాయులు కృషి చేయాల’ని డీఈవో సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి కుమారస్వామి, ఏపీడీ రోణంకి జయప్రకాష్‌, డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:50 PM