Share News

సీఎం సార్‌.. పోర్టు గుర్తుందా?

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:08 AM

మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గతేడాది ఏప్రిల్‌ 19న శంకుస్థాపన చేశారు. నేటికి (శుక్రవారం) సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. కానీ, పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.

సీఎం సార్‌.. పోర్టు గుర్తుందా?
నత్తనడకన సాగుతున్న పోర్టు నిర్మాణ పనులు:

(టెక్కలి)

మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గతేడాది ఏప్రిల్‌ 19న శంకుస్థాపన చేశారు. నేటికి (శుక్రవారం) సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. కానీ, పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉంది. రూ.4361.93 కోట్లతో పోర్టు టెండర్లను విశ్వసముద్ర సంస్థ దక్కించుకుంది. ఫేజ్‌-1లో పోర్టు కెపాసిటీ 23.5ఎంటీపీఏ, నాలుగు బెర్త్‌లు పూర్తయితే రూ.83.3ఎంటీపీఏలు ఎగుమతులు, దిగుమతులకు అనుకూలమని నిర్ణయించారు. ఈ నాలుగు బెర్త్‌ల్లో రెండు జనరల్‌, ఒకటి బొగ్గు, ఒకటి మల్టీపర్పజ్‌గా వినియోగించా లని, డిసెంబరు 2025 నాటికి పూర్తిచేయాలని సంకల్పించా రు. పోర్టుకు సంబంధించి 826.51 ఎకరాల భూములకు గాను ఇప్పటికి 522.89 ఎకరాలు మాత్రమే విశ్వసముద్రకు అధికారులు అప్పగించారు. మరో 303.62 ఎకరాలు అప్పగించాల్సి ఉంది. అయితే 293.97 ఎకరాల ఉప్పు భూముల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ భూములకు ఎకరాకు ఏ మేరకు పరిహారం చెల్లించాలన్నది ఇంకా తేలలేదు. రైలు మార్గానికి సంబంధించి 72.42 ఎకరాల భూములకు గాను సుమారు 140మంది రైతులు ఉండగా ఎకరాకు రూ.26లక్షల చొప్పున ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఆ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగలేదు. అలాగే 39మందికి సంబంధించిన పీడీఎఫ్‌లు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. రహదారుల భూములకు సంబంధించి పరిహారం చెల్లింపుల విషయంలో పలు గ్రామాల రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. ధర పెంపు కోసం కోర్టును ఆశ్రయించిన బన్నువాడ, కోటూరు రైతులకు ప్రభుత్వ ధర కంటే అదనంగా ఎకరాకు రూ.15లక్షల వరకు లభించింది. ముందుగా పోర్టు కోసం అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి భూములు ఇచ్చిన కొన్ని గ్రామాల రైతులకు మాత్రమే ప్రభుత్వ ధరకు అవార్డుల అందాయి. సుమారు 50 ఎకరాలకు పైగా అవార్డులు సైతం పలు కారణాలతో పెండింగ్‌లో ఉండగా అధికారులు ఆ డబ్బులు ట్రెజరీల్లో జమచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్‌బ్రేక్‌ పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. సాంకేతిక పరికరాల నిర్మాణం నత్తనడకన సాగుతుంది. పోర్టు పనులు బాహుబలి గ్రాఫిక్స్‌ అని ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం పోర్టు పూర్తయితే 25వేల ఉద్యోగాలు వస్తాయని నమ్మబలుకు తున్నారు. వైసీపీ మాత్రం ఈ ఎన్నికల్లో పోర్టును ప్రచారానికి వాడుకుంటుంది. మొత్తం మీద మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు మొదటి ఏడాదిలో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు.

Updated Date - Apr 19 , 2024 | 12:08 AM