Share News

నేటి నుంచి చంద్రన్న కార్మిక చైతన్య యాత్ర

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:43 PM

చంద్రన్న కార్మిక చైతన్య బస్సుయాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. బాబు ష్యూరిటీ.. కార్మికుల భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం పేరిట తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌(టీఎన్‌టీయూసీ) ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగనుంది.

నేటి నుంచి చంద్రన్న కార్మిక చైతన్య యాత్ర
టెక్కలిలో కార్మికుల చైతన్యయాత్రకు సిద్ధంగా ఉన్న బస్సు

- టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహణ

- 28రోజులు.. 92 నియోజకవర్గాల్లో పర్యటన

- టెక్కలిలో ప్రారంభించనున్న అచ్చెన్నాయుడు

టెక్కలి, జనవరి 5: చంద్రన్న కార్మిక చైతన్య బస్సుయాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. బాబు ష్యూరిటీ.. కార్మికుల భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం పేరిట తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌(టీఎన్‌టీయూసీ) ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగనుంది. టెక్కలి ఇందిరాగాంధీ కూడలిలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ యాత్రను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. 28 రోజులపాటు 92 నియోజకవర్గాల్లో ఈ బస్సుయాత్ర నిర్వహించేలా టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు రూపకల్పన చేశారు. అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గం కుప్పం వరకూ చైతన్యయాత్ర కొనసాగుతుందని రఘురామరాజు తెలిపారు. ‘జిల్లాలో తొలిరోజు టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2019 నుంచి ఇప్పటివరకూ కార్మికులకు జరిగిన అన్యాయంపై గళం విప్పనున్నాం. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో కార్మికుల కోసం అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ ఈ యాత్రలో వివరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసింది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసింది. లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు తొక్కేసింది. ఇసుకను అధికారపార్టీ నేతల అనుచరులకు కట్టబెట్టడంతో భవన నిర్మాణ కార్మికులకు పనిలేక 64మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో వాహన అపరాధ రుసుం రూ.130 ఉండగా గ్రీన్‌ట్యాక్స్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నేడు రూ.1,030కు పెంచింది. రవాణా రంగాన్ని ఆదాయవనరుగా మార్చుకొని కార్మికుల జీవితాల్లో చీకటి నింపింది. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే కార్మిక చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టామ’ని రఘురామరాజు వెల్లడించారు. తనతోపాటు టీఎన్‌టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోగంటి వేణుబాబు, సింధూజ, పరమేశ్వరరావు, స్థానిక నాయకులు దారపు రాము తదితరులు పాల్గొంటారని తెలిపారు.

Updated Date - Jan 05 , 2024 | 11:43 PM