Sankranti రండి బాబూ...రండి!!
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:19 AM
జిల్లాలో కొత్త సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగ సందడి ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రం శ్రీకాకుళంతో పాటు ఇతర పట్టణాల్లోనూ బంగారు, వస్త్ర దుకాణాలు, గృహోపకరణాలు, వాహనాల షోరూమ్‌లు, షాపింగ్ మాల్స్ గత వారం రోజులుగా కొనుగోలుదారులతో కిటికిటలాడుతున్నాయి.

ఒకటి కొంటే మరొకటి ఫ్రీ. రెండు కొంటే మూడోది ఉచితం. పండుగ క్ల్లియరెన్స్ సేల్.. భారీ ఆఫర్లు.. కళ్లు చెదిరే రాయితీలు.... జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇవే ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ఇదే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇవి సాధారణ, మధ్య తరగతి వారితో పాటు ఉన్నత వర్గాలనూ ఆకర్షిస్తున్నాయి. ఆఫర్ల గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. ఎక్కడ తమకు అనుకూలంగా ఉంటున్నాయో నిర్ణయించుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. అదే సమయంలో ఆఫర్‌లో లభిస్తున్న వాటి నాణ్యత పైనా దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
జోరందుకున్న సంక్రాంతి వ్యాపారం
మార్కెట్‌లో డిస్కౌంట్ల సందడి
కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్న వ్యాపారులు
నాణ్యతను చూడాలంటున్న నిపుణులు
శ్రీకాకుళం/నరసన్నపేట, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగ సందడి ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రం శ్రీకాకుళంతో పాటు ఇతర పట్టణాల్లోనూ బంగారు, వస్త్ర దుకాణాలు, గృహోపకరణాలు, వాహనాల షోరూమ్‌లు, షాపింగ్ మాల్స్ గత వారం రోజులుగా కొనుగోలుదారులతో కిటికిటలాడుతున్నాయి. వినియోగదారులను అకట్టుకునేందుకు కొందరు వ్యాపారులు బంఫర్ ఆఫర్లు ప్రకటించగా ..మరికొందరు వ్యాపారులు గిఫ్ట్ కూపన్లు... స్ర్కాచ్ కార్డులు... ఒకటి కొంటే మరొకటి ఉచితం... కిలోల్లో వస్త్రాలు తదితర ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు లక్కీడిప్‌లు. రూ.వెయ్యి...రూ. పదివేలు... రూ.50 వేల వరకు ఖరీదు చేస్తే.. అదనపు డిస్కౌంట్లు అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. . రెండు ప్యాంట్లు రూ.వెయ్యి... ఒక ప్యాంట్‌రూ. 750 అని.. రూ. 2వేల చీర రూ.వెయ్యికే సొంతం చేసుకోవాలని ఊరిస్తున్నారు. వినియోగదారులను విభిన్న రీతుల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. లక్కీడిప్‌ల ద్వారా బైకులు, కార్లను బహుమతులుగా ఇవ్వనున్నారు.
సంక్రాంతి జోష్...
క్రిస్మస్ సందర్భంగా దాదాపుగా డిసెంబరు మొదటి వారం నుంచే కొనుగోళ్లు మొదలయ్యాయి. సంక్రాంతికి వస్తు, వస్త్ర విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఏం చేయాలా అని ఇతరుల కంటే భిన్నంగా ఆఫర్లు ప్రకటించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో వస్త్ర వ్యాపారానిదే అగ్రస్థానం. శ్రీకాకుళం నగరంలో చిన్న, పెద్ద వస్త్ర దుకాణాలు సుమారు 100 వరకు ఉంటాయి. 300కు పైగా బంగారం షాపులు ఉన్నాయి. ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన మాల్స్ ఉన్నాయి. వీటితో పాటు నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో వస్త్ర, బంగారు దుకాణాలు ఉన్నాయి. పండగ వస్తుందంటే వీటన్నింటికీ డిమాండ్ ఎక్కువే. దీంతో వ్యాపారులు భారీ ఆఫర్లు పెట్టి క్యాష్ చేసుకుంటున్నారు.
సిక్కోలు కిటకిట
శ్రీకాకుళం నగరంలో షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు అధికంగా ఉండే జీటీ రోడ్డు, సూర్యమహల్ జంక్షన్, పాలకొండ రోడ్డు తదితర ప్రాంతాలు సందడిగా మారిపోయాయి. సంక్రాంతి దుస్తుల కొనుగోలు కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సరిహద్దులోని ఒడిశా నుంచి కూడా ఇక్కడికే వచ్చి షాపింగ్ చేసుకుంటున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే వ్యాపారం నాలుగు నుంచి ఐదురెట్లు అధికంగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వస్తువుల వ్యాపారం అదనం.
ఆఫర్ మంచిదే కానీ...
వస్త్రాలు, గృహోపకరణాలు, ఇతర వస్తువులను పండుగ సమయాల్లో తక్కువ ధరలు, ఆఫర్లతో విక్రయిస్తుంటారు. ఇవి సామాన్యులకు కొంత ఊరటనిచ్చేవేననడంలో సందేహం లేదు. అదే సమయంలో వీటి వెనుక చిన్నపాటి మాయాజాలమూ ఉంటోంది. ఆఫర్ల పేరుతో కొన్ని షాపుల యజమానులు నాసిరకం వస్త్రాలు, వస్తువులు అంటగడుతుంటారు. కొందరు చాలా కాలంగా షాపుల్లో ఎవరూ కొనుగోలు చేయకుండా వదిలేసిన వాటిని, కాలం చెల్లిన వాటిని విక్రయిస్తున్నారు. దీనిని గుర్తించలేని వినియోగదారులు మోసపోతున్నారు. ఆఫర్‌తో పాటు నాణ్యత కూడా అత్యవసరమని గుర్తించాలి. ఆఫర్‌పై ఆశతో నాణ్యత లేని వస్త్రాలు , వస్తువులు కొనుగోలు చేసి...ఇబ్బంది పడడకం కంటే...కాస్త భారమైనా అసలు ధర పెట్టి కొనుగోలు చేయడమే మేలన్న సంగతి గుర్తెరగాలి. వాస్తవానికి ఎమ్మార్పీ ధర రూ.2 వేలుగా చూపించి... దానిని రూ.వెయ్యికే విక్రయిస్తారు. దాని అసలు ధర రూ.వెయ్యి దాటి ఉండదనే విషయం తెలుసుకోవాలి. వ్యాపారి ఎవరైనా లాభం చూసుకునే రాయితీలు ప్రకటిస్తారు. సాధారణంగా రూ.100 లాభం వచ్చేచోట రూ.80 వచ్చేలా ఆఫర్ ఇస్తుంటామని, దీని వల్ల ఎక్కువ మొత్తంలో కొనుగోలు జరుగుతుందని..తద్వారా ఆదాయం వస్తుందని ఓ వ్యాపారి చెప్పారు.
అసలు స్టిక్కర్లు ఉండవు...
వస్త్ర దుకాణాల్లో ఉత్పత్తి చేసిన కంపెనీలకు సంబంధించిన ఎంఆర్‌పీ స్టిక్కర్లు మాత్రమే ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ వాటిని తీసివేసి... సొంత ఎంఆర్‌పీ స్టిక్కర్లను పెడుతున్నారు. ఇది నేరం కూడా. కొన్ని చోట్ల కిలోల వంతున దుస్తులు అమ్ముతున్నారు. అసలు దుస్తుల నాణ్యత ఎంత? దానికి దుకాణ యజమాని ఎంత రేటు కట్టి విక్రయిస్తున్నారు? తూకం సరిగా ఉందా లేదా? అన్న విషయంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టడం లేదు.