Share News

వాసుదేవుడి బ్రహ్మోత్సవం

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:54 PM

మందస వాసుదేవుని 15వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. వాసుదేవుడి ఆలయంలో బుధవారం నుంచి మార్చి 6వరకూ అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. రోజూ స్వామిజీల ప్రవచనాలతోపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

వాసుదేవుడి బ్రహ్మోత్సవం
వాసుదేవ పెరుమాళ్‌ ఆలయం

- నేటి నుంచి మార్చి 6 వరకు నిర్వహణ

(మందస)

మందస వాసుదేవుని 15వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. వాసుదేవుడి ఆలయంలో బుధవారం నుంచి మార్చి 6వరకూ అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. రోజూ స్వామిజీల ప్రవచనాలతోపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. 14వ శతాబ్దం నాటి ఈ ఆలయాన్ని మంజూష(మందస) సంస్థానాధీశులు ఎంతో అభివృద్ధి చేశారు. 1779-1823 మధ్య కాలంలో 45వ రాజు లక్ష్మణరాజ మణిదేవ్‌ ఈ ఆలయ వైభవాన్ని పెంచుతూ ఏటా 9 రోజుల బ్రహ్మోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచీ సంస్థానాధీశుల కాలం చెల్లే వరకూ ఏటా ఉత్సవాలు నిర్వహించేవారు. క్రమేపీ ఆదరణ కరువై ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. కాగా త్రిదండి చినజీయర్‌స్వామి శ్రీకూర్మం నుంచి పూరీ వరకూ పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఈ ఆలయాన్ని చూసి చలించిపోయారు. ఒడిశాకు చెందిన శిల్పకళాకారులను రప్పించి ఆలయాన్ని పునర్నిర్మించారు. 2010 ఫిబ్రవరి 5న మళ్లీ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా బుధవారం నుంచి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు వాసుదేవ పెరుమాళ్‌కు అభిషేకాలు, ఆంజనేయస్వామి ఆలయంలో సుందరకాండ పారాయణం, ధ్వజారోహణం, హనుమద్వాహన సేవ, శేష వాహన సేవ, గరుడవాహన సేవతోపాటు అన్నమయ్య కీర్తనలు, నృత్యప్రదర్శనలు, సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మార్చి 3న వాసుదేవుడి కల్యాణం, 4న తెప్పోత్సవం, 5న రథోత్సవం, చక్రస్నానాలు నిర్వహిస్తారు. 6న స్నపన కార్యక్రమంతో ఉత్సవాలు ముగిస్తారు. ఉత్సవాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించాలని అర్చకులు, నిర్వాహకులు కోరారు.

Updated Date - Feb 27 , 2024 | 11:54 PM