ఆ ఇద్దరికి భంగపాటు
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:16 AM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులను మార్పు చేస్తూ వస్తోంది. తాజాగా గురువారం రాత్రి మూడో జాబితాను విడుదల చేసింది.

-మూడో జాబితాలో మారిన సీను
-శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ
-దువ్వాడ శ్రీనుకు టెక్కలి టికెట్ ఖరారు
-ఆయన సతీమణి వాణికి మొండిచేయి
-కృపారాణికి ఎంపీ సీటూ లేదాయె
-జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉప్పాడ
ఒకరేమో శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
నియోజవర్గమంతా కలియతిరిగారు. సీఎంను కూడా పలుమార్లు కలిశారు. ఇక తనకే టికెట్ అని భావించారు.
ఇంకొరేమో టెక్కలి ఇన్‌చార్జిగా నియమించబడ్డారు. అధినాయకత్వం కూడా ఆమెకే టికెట్ దాదాపు ఖరారు చేసింది. అప్పటి నుంచి ఆమె ప్రజలతో మమేకమయ్యారు. టికెట్ తనకే అనుకున్నారు.
వైసీపీ అధినాయకత్వం గురువారం మూడో జాబితా విడుదల చేసింది. ఇందులో వారిద్దరి పేర్లు లేవు. దీంతో ఇద్దరూ కంగుతిన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలన్న వారి ఆశలు అడియాశలయ్యాయి. ఈ మార్పు వ్యవహారం పార్టీలోఓ అంతర్గత పోరుకు దారితీస్తుందన్న ఆందోళన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులను మార్పు చేస్తూ వస్తోంది. తాజాగా గురువారం రాత్రి మూడో జాబితాను విడుదల చేసింది. అయితే ఈ దఫా ఊహించని విధంగా ఆశించినవారికి భంగపాటే ఎదురైంది. నిరాశే మిగిలింది. గతేడాది ఏప్రిల్ 19న టెక్కలి నియోజకవర్గంలో మూలపేట పోర్టు శంకుస్థాపనకు విచ్చేసిన సీఎం జగన్మోహనరెడ్డి.. సభలో మాట్లాడుతూ టెక్కలిలో కన్ఫ్యూజన్ ఉండకూడదని.. ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనునే ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వారంలోనే దువ్వాడ శ్రీను సతీమణి నేరుగా సీఎం వద్దకు వెళ్లి.. టెక్కలి అసెంబ్లీ సీటు తనకే కేటాయించాలని.. అందుకు సంబంధించిన కొన్ని కారణాలను ప్రస్తావించారు. కొద్దిరోజుల వ్యవధిలోనే టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా దువ్వాడ వాణిగా ప్రకటించారు. ఆతర్వాత పార్టీపరంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. మరలా ఇప్పుడు అక్కడ అభ్యర్థిని మార్పు చేసి.. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా దువ్వాడ శ్రీనుకే ఖరారుచేస్తూ ప్రకటన జారీఅయింది. దీంతో మరలా దువ్వాడ వాణికి నిరుత్సాహం తప్పలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీమంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో భారీగా టీడీపీలో చేరికలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి కూడాను. అంటే వైసీపీ ఏరీతిన బలహీనపడుతున్నదో అర్థమవుతోంది. ఇక్కడి వైసీపీలో సమన్వయం ఉన్నట్లు కనిపించినప్పటికీ.. వర్గపోరు తీవ్రంగా ఉంది. ఇక్కడ తామంటే తాము.. అని పలువురు టికెట్ ఆశించారు. కానీ భంగపడ్డారు. వర్గపోరు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఇందులో ప్రస్తుత ఎంపీ అభ్యర్థి పేరాడ కూడా ఉన్నారు.
ఎంపీ అభ్యర్థిగా పేరాడ.. పాపం కృపారాణి..
కళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా పేరాడ తిలక్ వ్యవహరిస్తుండగా.. 2019 ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీచేసి అచ్చెన్నాయుడు చేతిలో ఓటమిపాలయ్యారు. అలాగే ఇదే నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి పార్టీలో చురుగ్గా ఉంటున్నారు. పలుమార్లు సీఎంను కలిశారు. శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని ఆశించినవారిలో ఆమె కూడా ఉన్నారు. కానీ అధినాయకత్వం ఆవిడకు రెండేళ్ల క్రితం పార్టీ పగ్గాలనుంచి కూడా తప్పించేసింది. ఇప్పుడు కూడా ఆశించిన ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించలేదు. శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ కూడా ఈ సీటు కోసం ప్రయత్నించారు. కానీ ఊహించని విధంగా పేరాడ తిలక్‌కు లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమిస్తూ పార్టీపరమైన ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఇప్పటికే వర్గపోరు బలంగా అధికార పార్టీలో ఉందాయె. సామాజికవర్గం ప్రకారం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించినప్పటికీ.. సమీకరణాలు దెబ్బతింటాయని రాజకీయ విశ్లేషకులు, సొంతపార్టీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృపారాణికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఎన్నికల్లో ఆమె వర్గం సహకరిస్తుందో లేదో అన్నది అనుమానమే.
ఇచ్ఛాపురం అభ్యర్థి మార్పు
వైసీపీలో వర్గపోరు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇచ్ఛాపురం ఒకటి. 2019లో పిరియా సాయిరాజ వైసీపీ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆతర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అతని సతీమణి పిరియా విజయ జడ్పీటీసీగా గెలుపొంది.. శ్రీకాకుళం జడ్పీ చైర్‌పర్సన్ పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా అధినాయకత్వం పిరియా విజయను ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించింది. ఇప్పుడు జడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇచ్ఛాపురం జడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మను నియమించనున్నారు. ఈమేరకు పార్టీపరంగా ఆదేశాలు వెల్లడయ్యాయి. ఇచ్ఛాపురంలో సాయిరాజ్‌పై ఉన్న వ్యతిరేకత.. వైసీపీకి లాభం కంటే నష్టం చేకూరే అవకాశముందని సమాచారం. ఇక్కడ జల్‌జీవన్ మిషన్ పనులు పూర్తికాకున్నా.. ఆదరాబాదరాగా ఇటీవల సీఎంతో ప్రారంభించేశారని.. ఇంకనూ పనులు జరగాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల స్టంట్‌తోనే చేపట్టే కార్యక్రమాలు అధికంగా ఉన్నాయని.. ప్రజల కోసం చేపట్టే కార్యక్రమాలు అల్పంగానే ఉన్నాయంటూ విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఆమదాలవలస, ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల విషయంలో ఎలాంటి నిర్ణయం పార్టీ నుంచి వెల్లడికాలేదు.