Share News

రెండు రోజులూ అవస్థలే

ABN , Publish Date - May 17 , 2024 | 12:07 AM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి వరకూ పోలింగ్‌ సాగింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో.. పోలింగ్‌ ప్రక్రియ జాప్యమైంది. ఇటు ఓటర్లకు.. అటు పోలింగ్‌ అధికారులకు నిరీక్షణ ఎదురైంది. పోలింగ్‌ ముగిశాక అన్ని రికార్డులు సరిచేసుకుని ఈవీఎంలతో స్ర్టాంగ్‌రూమ్‌కు వెళ్లేసరికి.. చాలా ఆలస్యమైంది.

రెండు రోజులూ అవస్థలే
పలాసలో టెంట్లు కూలిపోవడంతో.. నిరీక్షిస్తున్న ఎన్నికల సిబ్బంది (ఫైల్‌ )

- ఈవీఎంల మొరాయింపుతో అర్ధరాత్రి వరకూ పోలింగ్‌

- ముందురోజు ఎన్నికల సామగ్రి పంపిణీలోనూ ఇబ్బందులు

- వేకువజామున స్ర్టాంగ్‌రూమ్‌కు ఈవీఎంల తరలింపు

పలాస/ ఆమదాలవలస, మే 16: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి వరకూ పోలింగ్‌ సాగింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో.. పోలింగ్‌ ప్రక్రియ జాప్యమైంది. ఇటు ఓటర్లకు.. అటు పోలింగ్‌ అధికారులకు నిరీక్షణ ఎదురైంది. పోలింగ్‌ ముగిశాక అన్ని రికార్డులు సరిచేసుకుని ఈవీఎంలతో స్ర్టాంగ్‌రూమ్‌కు వెళ్లేసరికి.. చాలా ఆలస్యమైంది. పోలింగ్‌ మెటీరియల్‌ అప్పగించేందుకు సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వేచి ఉన్నారు. పోలింగ్‌ ముందురోజు ఎన్నికల సామగ్రి పంపిణీ సమయంలోనూ అవస్థలు పడ్డారు. సాధారణంగా ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్‌ పూర్తవ్వాలి. నిర్ణీత సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలి. కాగా.. పలాస నియోజకవర్గంలోని 40 కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగింది. యూపీ, ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం 6 గంటల సమయానికి ఓటర్లు బారులుదీరారు. వారంతా ఓటేసి..ప్రక్రియ పూర్తయేసరికి రాత్రి 9 గంటలైంది. అనంతరం ఈవీఎంలను బస్సుల్లో ఎక్కించి.. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శివానీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌రూమ్‌లను తరలించేసరికి రాత్రి రెండు.. మూడు గంటలైందని సిబ్బంది తెలిపారు.

- పోలింగ్‌ ముందురోజు పలాసలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద అలజడి రేగింది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల లోపు ఎన్నికల సామగ్రి పంపిణీ చేయాలి. కాగా.. ఆదివారం వేకువజామున భారీ వర్షంతోపాటు ఈదురు గాలులు వీయడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు మొత్తం కుప్పకూలిపోయాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. దీంతో ఎన్నికల సామగ్రి పంపిణీకి తీవ్ర అవరోధం ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని వరండాలో సామగ్రి పంపిణీ చేశారు. సాయంత్రం 6 గంటలైనా పోలింగ్‌ కేంద్రాలకు బస్సుల్లో సామగ్రి తరలించలేకపోయారు. గంటలపాటు నిరీక్షించలేక.. సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల విధులు కష్టమే కానీ.. ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేశామని.. శ్రీకాకుళం నగరానికి చెందిన మహేశ్వరి అనే ఉద్యోగి తెలిపారు.

- సరుబుజ్జిలి మండలం యరగాం గ్రామంలో అర్ధరాత్రి 12.30 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. బుధవారం వేకువజామున 4 గంటలకు భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ స్ర్టాంగ్‌రూమ్‌కు ఈవీఎంలు తరలించారు. అనంతరం సొంత స్థలాలకు చేరుకోవడానికి రవాణా సౌకర్యం లేక సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పోలింగ్‌ అధికారులకు రూ.వెయ్యి, రూ.750 పారితోషికం ఇవ్వగా.. జిల్లాలో మాత్రం రూ.500 మాత్రమే ఇచ్చారని పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - May 17 , 2024 | 12:07 AM