ధాన్యం నగదు చెల్లింపులకు బయోమెట్రిక్ మెలిక
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:54 PM
ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుభరోసా కేంద్రాల్లో ఎఫ్‌టీవోలు జనరేట్ చేసి 40 రోజులు కావస్తున్నా నేటికీ రైతు ఖాతాల్లో నగదు జమకాని పరిస్థితి. తాజాగా ధాన్యం నగదు చెల్లింపులకు బయోమెట్రిక్ లింక్ చేయాలని గ్రామీణ వ్యవసాయ సహాయకులు చెబుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

- జిల్లాలో రూ.143 కోట్ల బకాయిలు
- 40 రోజులుగా రైతుల ఎదురుచూపు
(టెక్కలి)
ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుభరోసా కేంద్రాల్లో ఎఫ్‌టీవోలు జనరేట్ చేసి 40 రోజులు కావస్తున్నా నేటికీ రైతు ఖాతాల్లో నగదు జమకాని పరిస్థితి. తాజాగా ధాన్యం నగదు చెల్లింపులకు బయోమెట్రిక్ లింక్ చేయాలని గ్రామీణ వ్యవసాయ సహాయకులు చెబుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 97,551మంది రైతులకు సంబంధించి 1,52,959 ఎఫ్‌టీవోలు జనరేట్ చేసి 4,44,251.04 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సుమారు లక్షా20వేల మంది రైతులకుగాను ఎఫ్‌టీవోలకు సంబంధించి బయోమెట్రిక్ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లాలో రైతులకు ధాన్యం బకాయిలు రూ.143కోట్లు మేర ఉన్నాయి. వాస్తవానికి రైతుభరోసా కేంద్రాల్లో గ్రామీణ వ్యవసాయశాఖ సిబ్బంది ఎఫ్‌టీవోలు జనరేట్ చేసిన 21 రోజుల్లో రైతుఖాతాల్లో డబ్బులు జమకావాలి. నెలలు గడుస్తున్నా తమ ఖాతాల్లో నగదు జమకాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా క్షేత్రస్థాయిలో గ్రామీణ వ్యవసాయ సహాయకులు మరోసారి రైతులకు బయోమెట్రిక్ వేయాలని కోరుతున్నారు. ధాన్యం డబ్బులతోపాటు గోనెసంచులు, హమాలీ ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా రైతుల ఖాతాల్లో జమవుతాయని చెబుతున్నారు. కొంతమంది రైతులు అందుబాటులో లేకపోవడంతో బయోమెట్రిక్ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. ఈ విషయమై పౌరసరఫరాలశాఖ డీఎం శ్రీనివాస్ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా రైతులకు ధాన్యం బకాయిలు రూ.143కోట్లు ఉన్నాయని, వాటిని త్వరలో చెల్లిస్తామన్నారు. బయోమెట్రిక్‌కు, దానికి సంబంధం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సీడీ రావాల్సి ఉన్నందున బయోమెట్రిక్ క్షేత్రస్థాయిలో వేయిస్తున్నారని తెలిపారు.