Share News

అక్కడ పెద్ద సైకో.. ఇక్కడ చిన్న సైకో

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:36 AM

‘‘అక్కడ పెద్ద సైకో సీఎం జగన్‌ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. విశాఖలో రుషికొండను బోడికొండగా మార్చేశారు. ఇక్కడ(పలాసలో) చిన్న సైకో మంత్రి సీదిరి అప్పలరాజు నెమలికొండ, సూదికొండ, నల్లబొడ్లూరు కొండలకు గుండుకొట్టారు’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు.

అక్కడ పెద్ద సైకో.. ఇక్కడ చిన్న సైకో
మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు, భారీగా హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణులు

- ఇద్దరూ కొండలకు గుండుకొట్టారు!

- సీఎం జగన్‌, మంత్రి సీదిరి అప్పలరాజు తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం

- అధికారంలోకి రాగానే అక్రమాలపై విచారణ చేస్తామని స్పష్టం

- ఉద్యానవనానికి పూర్వవైభవం తీసుకువస్తామని భరోసా

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

‘‘అక్కడ పెద్ద సైకో సీఎం జగన్‌ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. విశాఖలో రుషికొండను బోడికొండగా మార్చేశారు. ఇక్కడ(పలాసలో) చిన్న సైకో మంత్రి సీదిరి అప్పలరాజు నెమలికొండ, సూదికొండ, నల్లబొడ్లూరు కొండలకు గుండుకొట్టారు’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. పలాసలో సోమవారం రాత్రి నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. కొద్దిరోజులే వైసీపీకి అధికారం ఉందని అందుకే జగన్‌ కొత్త డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. పలాస నియోజకవర్గంలో కొండలను సైతం వైసీపీ నేతలు ఆక్రమించడంతో గ్రామాల్లోకి ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయని పేర్కొన్నారు. మే నెలలో చెరువులో చేప ఎగిరిపోతుందని మంత్రి సీదిరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసింది. జనసైనికులు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ సైన్యం వైసీపీని తరిమేందుకు సిద్ధంగా ఉన్నారు. మా మూడు పార్టీల అజెండా ఒక్కటేనని.. ప్రజాసంక్షేమమే ధ్యేయం. రానున్న ఎన్నికల్లో ఎన్డీమే అభ్యర్థులను గెలిపించి.. వైసీపీని సాగనంపాల’ని పిలుపునిచ్చారు. వైసీపీ విధ్వంసకర పాలనపై ఽధ్వజమెత్తుతూ.. తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న అభివృద్ధిని వివరించారు.

- ‘ఎన్టీఏ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్‌నాయుడు, పలాస ఎమ్మెల్యే అభ్యర్థిగా శిరీష పోటీ చేస్తున్నారు. వారిని ఆశీర్వదించి గెలిపించాలి. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ దివంగత నేత ఎర్రన్నాయుడు లేని లోటు రామ్మోహన్‌నాయుడు తీర్చుతున్నాడు. రెండుసార్లు ఎంపీగా గెలిచి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచాడు. ఈ ప్రాంతంలో గుర్తొచ్చే మరో పేరు.. సర్దార్‌ గౌతు లచ్చన్న.. రాజకీయ ప్రాధాన్యత ఉన్న, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం. ఆ కుటుంబ సభ్యులు నేడు ఎన్నో అవమానాలకు గురవుతున్నారు. ఒక్క సారి ఎమ్మెల్యే అయితే ఇంతలా తోకజాడిస్తే.. మూడు తరాలు రాజకీయాలు చేస్తున్న గౌతు కుటుంబానికి ఎంత ఉండాలి. అచ్చెన్నాయుడుని అక్రమంగా అరెస్ట్‌ చేశారు. గౌతు శిరీషకు ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులపై కేసులు పెడుతున్నారు. నేను అలాగే అనుకుంటే వీరంతా పాదయాత్రలు చేసేవారా తమ్మూళ్లు. పవన్‌ కల్యాణ్‌కు తీవ్రంగా అవమానించారు. ఎన్నిరకాలుగా అవమానించినా ఈ రాష్ట్రంలో వైసీపీని గద్దెదింపే వరకు మా పోరాటం ఆగదు. వైసీపీని సాగనంపడమే లక్ష్యంగా ఎన్డీఏతో కలసి పోరాడుతున్నాం.

- ‘కిడ్నీ సమస్య కోసం డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఫించన్లు అందజేశాం. కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను మంజూరు చేశాం. మత్స్యకారులను ఆదుకున్నాం. హుద్‌హుద్‌ సమయంలో విశాఖపట్నాన్ని, తితలీ తుఫాన్‌ సమయంలో పలాస ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించి ప్రాణనష్టం జరగుకుండా కాపాడాను. అదే సమయంలో పక్కనే విజయనగరంలోనే ఉన్న ఈ సైకో జగన్‌ కనీసం మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాడా.. మీకు కష్టం వచ్చినపుడు అండగా నిలిచిన నాయకులు మీకు కావాలా.. ఇలాంటి సైకోలు కావాలా’?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

- కష్టపడి చదువుతూ ఉత్తరాంధ్ర యువత ముందుంటారు. డిఫెన్స్‌లో పనిచేసేవారు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా వారే. ఇందుకు అభినందిస్తున్నాను. విశాఖపట్నంనుంచి భావనపాడుకు బీచ్‌ రోడ్డు ఏర్పాటు చేస్తే.. పరిశ్రమలు పెరిగి వలసలు నిలిచిపోతాయి. ఉపాధిమార్గాలు పెరుగుతాయి. ఎర్రన్న, గౌతు లచ్చన్న స్ఫూర్తిగా ప్రజాసేవలో ముందుకెళ్దామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

- పలాసలో రాత్రి బస

ప్రజాగళం సభ అనంతరం చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి పలాసలోనే బస చేశారు. మంగళవారం ఉదయం జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. అలాగే ఇటీవల టికెట్‌ దక్కనివారిని రప్పించి వారితో మాట్లాడనున్నట్టు తెలిసింది.

అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తాం...

- ఉద్యానవనానికి పూర్వవైభవం తీసుకువస్తా. ఉద్దానం రూపురేఖలు మారుస్తా

- మహేంద్ర తనయా, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పూర్తి చేస్తాం.

- వంశధార- బహుదా అనుసంధానం

- వంశధార నీరు ఇచ్ఛాపురం వరకూ సరఫరా

- కిడ్నీ నమస్యకు శాశ్వత పరిష్కారం

- పలాసలో రైతు బజారు ఏర్పాటు

- ప్రతి ఇంటికీ శుద్ధజలం సరఫరా

- వంశధార కాలువలకు సిమెంటు లైనింగ్‌

- జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు, డిఫెన్స్‌ అకాడమి, ఐఎస్‌ఐ ఆసుపత్రి, స్కిల్‌ డెవలప్‌ మెంటు సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. యువతకు అత్యున్నత ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తాం.

- జీడి పప్పుకోసం ఒక బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటాం. మద్దతు ధర అందజేస్తాం. ఆడబిడ్డలకు ఇళ్లు నిర్మించి అందజేస్తాం. ఇళ్లులేని వారికి రెండు సెట్లు స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తాం. టిడ్కొ ఇళ్లు పూర్తిచేసి అందజేస్తాం. రూ.4వేలు చొప్పున పింఛను అందజేస్తాం. సంపద సృష్టించి ఆడబిడ్డలకు లక్షాధికారులను చేస్తాను. బీసీలకు 50ఏళ్లకే పింఛను అందజేస్తాం. ఆదరణకు రూ.5వేలు కోట్లతో ఆదుకుంటాం. భూ పరిరక్షణ చట్టం రద్దుచేసి ప్రజలకు ఆదుకుంటాం.

- కిడ్నీ రోగాలకు కారణాలపై పరిశోధనలు చేస్తాం. ఇక్కడ ప్రజలు తినే ఆహారంపైనా పరిశోధనలు చేసి కిడ్నీ రోగాలే ప్రబలకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Updated Date - Apr 16 , 2024 | 12:36 AM