భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు
ABN , Publish Date - Sep 19 , 2024 | 12:14 AM
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పెడుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
- ఆరు నెలల ముందుగానే అందుబాటులోకి తెస్తాం
- కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
అరసవల్లి సెప్టెంబరు 18: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పెడుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది అల్లూరికి దక్కిన గౌరవం అని ఆనందం వ్యక్తం చేశారు. గడువు ప్రకారం 2026 డిసెంబరు నాటికి విమానాశ్రయం పూర్తవ్వాల్సి ఉందని, కానీ ఆరు నెలల ముందుగానే జూన్ 26 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
- మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం సరిహద్దుల్లో ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జవాన్లకు మద్దతుగా నిలిచేలా దేశంలోనే తొలిసారిగా జవాన్ డిక్లరేషన్ ప్రకటించామన్నారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా, సీఎం చంద్రబాబు సారథ్యంలో మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్‌కు ఆమోదం తెలపడం ఆనందంగా ఉందన్నారు. సైనికులు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.